‘బబుల్ గమ్’ రివ్యూ

నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, చైతు జొన్నలగడ్డ, హర్ష వర్ధన్, అను హాసన్ తదితరులు
సినిమాటోగ్రఫి: సురేష్ రగుతు
మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల
నిర్మాత: మహేశ్వరి మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
దర్శకత్వం: రవికాంత్ పేరేపు
విడుదల తేదీ: డిసెంబర్ 29, 2023

టాలీవుడ్ లో వారసులకు ఏమాత్రం కొదవలేదు. ఈకోవలోనే.. ‘బబుల్ గమ్’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు రోషన్ కనకాల. రజనీకాంత్, చిరంజీవి వంటి సూపర్ స్టార్స్ కు నటనలో ఓనమాలు నేర్పించిన దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల మనవడు.. రాజీవ్, సుమ తనయుడైన రోషన్ కనకాల.. ‘బబుల్ గమ్’తో హీరోగా ఆకట్టుకున్నాడా? సినిమా ఎలా ఉంది? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.

కథ
పేదింటి అబ్బాయి.. పెద్దింటి అమ్మాయి తరహా కథతోనే ‘బబుల్ గమ్’ రూపొందింది. ఆది (రోషన్ కనకాల) పక్కా హైదరాబాదీ కుర్రాడు. డిజె అవ్వాలని కలలు కంటాడు. పబ్‌లో అనుకోకుండా జాన్వీ(మానస చౌదరి)ని చూస్తాడు. ప్రేమలో పడిపోతాడు. లవ్-రిలేషన్స్ అంటే పెద్దగా పడని జాన్వీ.. ఆది ని తొలుత ఆట వస్తువుగా మాత్రమే చూస్తుంది. ఆ తర్వాత అతనితో ప్రేమలో పడుతుంది. మరి.. భిన్న వ్యక్తిత్వాలు ఉన్న ఈ ఇద్దరి ప్రేమ ఫలించిందా? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ
‘క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి హిట్స్ తో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు రవికాంత్ పేరెపు. కొంత గ్యాప్ తీసుకుని ఈ యంగ్ డైరెక్టర్ చేసిన సినిమా ఇది. సుమ తనయుడు రోషన్ ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను తీసుకున్న రవికాంత్.. ఓ కొత్త హీరోకి సరిపడే కథనే తీసుకున్నాడు. నేటి యువతరానికి అద్దం పట్టేలా హీరో క్యారెక్టరైజేషన్ ను డిజైన్ చేశాడు. అబ్బాయి, అమ్మాయిల మధ్య లవ్, కాన్ఫ్లిక్ట్ ను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు.

సినిమా ఫస్టాఫ్ లో ఎంగేజింగ్ అనిపించే సన్నివేశాలు పెద్దగా కనిపించవు. ఫ్రెండ్స్ మధ్య కామెడీ ట్రాక్.. లవ్ పేరుతో సాగే లస్ట్ తప్ప. యూత్ ఫుల్ కంటెంట్ పేరుతో అక్కడక్కడా హద్దులు దాటి వినిపించే డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయి. ఫస్టాఫ్ సో సో గా అనిపించినా.. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది. అక్కడ నుంచి సెకండాఫ్ లో అసలు కథ మొదలవుతోంది. ఎంగేజింగ్ ఎలిమెంట్స్, ఎంగేజింగ్ సీన్స్ తో సెకండాఫ్ సినిమాని నిలబెట్టిందని చెప్పొచ్చు. ఫైనల్ గా ఓ కొత్త ముగింపుతో సినిమాని పూర్తిచేశాడు డైరెక్టర్.

నటీనట, సాంకేతిక వర్గం
నటీనటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది హీరో రోషన్ గురించి. తనకు ఇది మొదటి సినిమాయే అయినా.. అతని లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా.. యారగెంట్ సీన్స్ లోనూ.. రొమాంటిక్ సన్నివేశాల్లోనూ రోషన్ రెచ్చిపోయాడు. హీరోయిన్ మానస చౌదరి రొమాంటిక్ సీన్స్ లో హీట్ పెంచింది. నూతన నటి అయినా రెండు తరహా షేడ్స్ ఉన్న తన పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన పాత్రల్లో హీరో ఫాదర్ గా కనిపించిన చైతు జొన్నలగడ్డ పాత్ర బాగుంది. ఇంకా.. హర్షవర్ధన్, వైవా హర్ష తమ పాత్రల మేరకు నటించారు.

దర్శకుడు రవికాంత్.. కొత్త వారైనా హీరోహీరోయిన్స్ ను కొత్తగా ప్రెజెంట్ చేయడంలో సఫలీకృతుడయ్యాడని చెప్పొచ్చు. అయితే.. తన గత చిత్రాలు ‘క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల’తో పోల్చుకుంటే ‘బబుల్ గమ్’ మూవీ కథ, కథనం విషయంలో కాస్త తడబడ్డాడని అనుకోవచ్చు. ఈ మూవీలోని శ్రీచరణ్ పాకాల అందించిన ‘జిలేబీ’ పాట బాగుంది.. కొన్ని సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బలాన్ని చేకూర్చింది. సురేష్ రగుతు విజువల్స్ బాగున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

మొత్తంగా.. సుమ తనయుడు రోషన్ కనకాల నటుడిగా సక్సెస్ అయ్యాడు. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా చూడాలనుకుంటే ‘బబుల్ గమ్’ మంచి ఆప్షన్.

Related Posts