‘ఊరు పేరు భైరవకోన’ ప్రీమియర్ రివ్యూ

నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు
సినిమాటోగ్రఫి : రాజ్ తోట
సంగీతం : శేఖర్ చంద్ర
సమర్పకుడు : అనిల్ సుంకర
నిర్మాత : రాజేష్ దండ
దర్శకత్వం : వి.ఐ.ఆనంద్
విడుదల తేదీ : 16-02-2024

ఇది వరకే సందీప్ కిషన్-వీఐ ఆనంద్ కాంబోలో ‘టైగర్’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రం మంచి చిత్రంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు వి.ఐ.ఆనంద్. ఇక.. చాలా గ్యాప్ తర్వాత సందీప్ కిషన్-వి.ఐ.ఆనంద్ కాంబోలో రూపొందిన సినిమా ‘ఊరు పేరు భైరవ కోన’.

గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవ కోన అంటూ ట్రైలర్ తోనే ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో సందీప్ సరసన వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ కథానాయికలుగా నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంస్థల పై రాజేష్ దండా, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. తమ కంటెంట్ పై నమ్మకంతో విడుదలకు ముందే ప్రీమియర్స్ వేయడం ఈమధ్య బాగా జోరందుకుంది. ఈకోవలోనే ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రానికి భారీ స్థాయిలో ప్రీమియర్స్ వేశారు. మరి.. ‘ఊరు పేరు భైరవకోన’ ఎలా ఉంది? ఆడియన్స్ అంచనాలను అందుకుందా? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.

కథ
బసవ (సందీప్ కిషన్), జాన్ (వైవా హర్ష) ఓ దొంగతనం చేసి అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి వెళతారు. వీరికి గీత (కావ్య థాపర్) కూడా జత కలుస్తుంది. ఈ ముగ్గురికీ భైరవకోనలో భయానకంతో కూడిన మిస్టీరియస్ పరిస్థితులు ఎదురవుతాయి. అసలు భైరవకోన చరిత్ర ఏంటి? గరుడ పురాణంలో మిస్సైన నాలుగు పేజీల్లో భైరవకోన గురించి ఏం చెప్పారు? భూమి (వర్ష బొల్లమ్మ) ఎవరు? బసవ ఎందుకు దొంగగా మారాడు? భైరవకోనతో అతని అనుబంధం ఏంటి? అనేదే మిగతా కథ.

విశ్లేషణ
వి.ఐ.ఆనంద్ సూపర్ హిట్ మూవీ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లైన్లోనే ‘ఊరుపేరు భైరవకోన’ సినిమాని తీర్చిదిద్దాడు. మనకు సాయిధరమ్ ‘విరూపాక్ష’ ఛాయలు కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. సినిమా మొత్తం నిడివి 2 గంటల 16 నిమిషాలు. ఈ సినిమాలో లవ్, కామెడీ, హారర్, థ్రిల్లర్ అన్ని ఎలిమెంట్స్ ను రంగరించాడు దర్శకుడు వి.ఐ.ఆనంద్. మిస్టీరియస్ థ్రిల్లర్స్ అంటేనే సీట్ ఎడ్జ్ న కూర్చోబెట్టి ఎలిమెంట్స్ ఉండాలి. అవి ఈ చిత్రంలోనూ కొన్ని ఉన్నాయి. కానీ.. అవంతలా ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేలా లేవు.

ఫస్టాప్ అంతా కామెడీ, మిస్టరీతో సాగే సినిమా సెకండాఫ్ లో హారర్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. సెకండాఫ్ లో ఒక్కో మిస్టరీని విడమర్చి చెప్పే సన్నివేశాలు బాగా డిజైన్ చేసినా.. ఆసక్తికరంగా అనిపించవు. కొన్ని సన్నివేశాలు ప్రిడిక్టబుల్ గా ఉన్నాయి. మిస్టరీ ఎలిమెంట్స్ పై దర్శకుడు ఇంకాస్త కసరత్తు చేస్తే బాగుండేది. వెన్నెల కిషోర్, వైవా హర్ష కామెడీ వర్కవుట్ అయ్యిందని చెప్పొచ్చు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
సందీప్ కిషన్ ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగలడు. ఈ సినిమాలోని బసవ పాత్రకు సందీప్ న్యాయం చేశాడు. హీరోయిన్స్ ఇద్దరిలోనూ వర్ష బొల్లమ్మ నటనకే మంచి మార్కులు పడతాయి. ఎక్కువ షేడ్స్ ఉన్న రోల్ లో వర్షం బొల్లమ్మ పాత్ర ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష తమదైన శైలిలో కామెడీని పండించి ఈ సినిమాకి హెల్ప్ అయ్యారని చెప్పొచ్చు.

విలక్షణమైన కథలను వెండితెరపై ఆవిష్కరించడంలో ఇప్పటికే తన విలక్షణతను చాటుకున్న వి.ఐ.ఆనంద్ ఈ సినిమాతోనూ ఓ కొత్త పాయింట్ ను డీల్ చేశాడు. స్క్రీన్ ప్లే పరంగా ఇంకాస్త బిగువు ఉంటే బాగుండేది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్యాక్ బోన్స్ అని చెప్పాలి. రాజ్ తోట విజువల్స్, శేఖర్ చంద్ర బి.జి.ఎమ్. చక్కగా కుదిరాయి. ‘నిజమేనా చెబుతున్న’ పాట బాగుంది.

మొత్తంగా.. ఫస్టాఫ్ లో సందీప్, వర్ష బొల్లమ్మ నటనతో పాటు.. వెన్నెల కిషోర్, వైవా హర్ష కామెడీ బాగుంది. సెకండాఫ్ లో ఎమోషన్ మిస్సవ్వడం.. వీక్ క్లైమాక్స్ ‘ఊరు పేరు భైరవకోన’కి మైనస్.

Related Posts