పట్టు వదలని సుదీప్ కల నెరవేరుతుందా..?

సుదీప్.. కన్నడలో సూపర్ స్టార్ గా వెలుగుతున్నాడు. కంటెంట్ బావుంటే ఇతర భాషల్లో విలన్ అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. శాండల్ వుడ్ లో హయ్యొస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్స్ లో సుదీప్ ముందుంటాడు.

కిచ్చా సుదీప్ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే ఈ హీరోకు ప్యాన్ ఇండియన్ హీరో కావాలన్న కోరిక పుట్టింది. అది కూడా కేజీఎఫ్ తర్వాతే. అందుకే ఆ మధ్య ఓ సినిమా చేశాడు. విక్రాంత్ రోణ అనే టైటిల్ తో వచ్చిన ఈ మూవీ ట్రైలర్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కానీ.. సినిమాగా తేలిపోయింది. రీసెంట్ గా ఉపేంద్ర హీరోగా నటించిన కబ్జా లోనూ ఓ కీలక పాత్ర చేశాడు.

ఈ కబ్జా డిజాస్టర్. విక్రాంత్ రోణ పోయినా.. సుదీప్ మాత్రం పట్టు వదలకుండా ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను అలరించాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ క్రమంలో ప్రస్తుతం తన కెరీర్ లో 46వ సినిమా చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ ప్రోమో విడుదలైంది. ”కే 46 డిమోన్ వార్ బిగిన్స్” అంటూ వచ్చిన ఈ ప్రోమో చూస్తే ఈ సారి సుదీప్ కల నెరవేరేలానే ఉంది.


ఒకానొక అర్థరాత్రిపూట.. ఓ బస్ వెళుతూ ఉంటుంది. ఆ బస్ లోనే ఉన్న హీరో తన భుజానికి దిగిన బుల్లెట్ ను తొలగించి పక్కనే ఉన్న విస్కీ గ్లాస్ లో వేస్తాడు. ఆ బస్ డ్రైవర్ ప్రాణభయంతో డ్రైవ్ చేస్తుంటాడు. కట్ చేస్తే మెల్లగా బస్ అంతా రివీల్ అవుతూ.. అన్ని సీట్స్ పై తెగిపడిన మనుషుల అవయవాలు, రక్తం, శవాలతో నిండి ఉంటుంది.

చివర్ లో ఆ బస్ డ్రైవర్ ను కూడా కాల్చేసి ఆ విస్కీని సిప్ చేస్తాడు హీరో.. తర్వాత “జాలి, దయ, క్షమ చూపించడానికి నేను మనిషిని కాదు.. దెయ్యాన్ని” అంటూ సుదీప్ చెప్పిన డైలాగ్ హైలెట్.
ఇదీ ఈ ప్రోమోలో ఉన్న సీన్. అప్పుడే చెప్పడం తొందరే అవుతుందేమో కానీ.. ఈ ప్రోమో చూస్తుంటే శాండల్ వుడ్ నుంచి మరో ప్యాన్ ఇండియన్ మూవీ వస్తున్నట్టే అనిపిస్తోంది.

ఆ రేంజ్ లో ఉంది మేకింగ్. ప్రతి షాట్ నెక్ట్స్ లెవెల్. హీరోయిజం పీక్స్ లో కనిపిస్తోంది. బస్ లో మాత్రమే కనిపించిన ఈ ప్రోమోతో సుదీప్ తన ఫ్యాన్స్ కు అద్భుతమైన ట్రీట్ ఇచ్చాడనే చెప్పాలి. విజయ్ కార్తికేయా డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి శాండల్ వుడ్ టాప్ కంపోజర్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.

ఇతను రీసెంట్ గా తెలుగులో విరూపాక్షతో విజయం అందుకున్నాడు. మొత్తంగా ఈ ప్రోమోకు వందశాతం ప్యాన్ ఇండియన్ కలర్ ఉంది. మరి కంటెంట్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటే.. ప్యాన్ ఇండియన్ స్టార్ అనిపించుకోవాలనుకున్న సుదీప్ కల నెరవేరుతుంది.

Related Posts