ఉప్పొంగే స్వరతరంగం దేవీశ్రీ ప్రసాద్ బర్త్ డే స్పెషల్

పసి వయసులోనే సంగీతంపై మక్కువ పెంచుకుని.. నూనూగు మీసాల వయసులోనే సంగీత దర్శకుడుగా అరంగేట్రం చేసిన అత్యంత ప్రతిభావంతమైన కుర్రాడు దేవీ శ్రీ ప్రసాద్. దేవి సినిమాతో సంగీత దర్శకుడుగా ప్రయాణం మొదలుపెట్టి ఆ తొలి చిత్రాన్నే ఇంటిపేరుగా మలచుకుని.. టాప్ మ్యూజిక్ డైరెక్టగా సౌత్ మొత్తాన్ని తన సంగీత సాగరంలో ఓలలాడిస్తోన్నదేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడే కాదు సింగర్, లిరిసిస్ట్, కొరియోగ్రాఫర్ కూడా. ఇవాళ ఈ ఉత్తుంగతరంగం పుట్టిన రోజు.

దేవీ శ్రీ ప్రసాద్ .. పారే సెలయేరులా స్వచ్ఛమైన సంగీతానికి కేరాఫ్ లా ఉంటాడు. ఉప్పొంగే తరంగాలు .. ఉరకలెత్తే ఉత్సాహం ఆ జోష్ కు ఆశ్చర్యపోతాయి. తెరవెనక సంగీత దర్శకుడిగా ఎంత గొప్పగా పనిచేస్తాడో.. వేదికపై రాక్ స్టార్ లా అంత రెచ్చిపోతాడు. అసలతని జోష్ చూసి హీరోలే కుళ్లుకుంటారంటే అతిశయోక్తి కాదు. అందుకే అతనెప్పుడు హీరోగా అరంగేట్రం చేస్తున్నాడనే వార్తలు వచ్చిన జనం ఆసక్తిగానే చూస్తారు. సంగీత దర్శకుడిగా దక్షిణాదిలో తనదైన ముద్రవేసి, స్టార్ హీరోలందరి ఫస్ట్ ఛాయిస్ గా మారిన మన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. కొందరికి కళ సహజంగా అబ్బుతుంది. దేవీ శ్రీ ప్రసాద్ కూ సంగీతం అలానే అబ్బింది. శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కూడా కావడంతో చిన్న వయసులోనే అతనికీ రాగాలపై ఆసక్తి ఏర్పడింది. అతని ఆసక్తిని గమనించిన తండ్రి సత్యమూర్తి మాండోలిన్ శ్రీనివాస్ వద్ద సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. అలా సంగీతంపై పట్టు సాధించి.. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు దేవీ శ్రీ ప్రసాద్.


సంగీత దర్శకుడు కావాలంటే ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎంత అనుభవం సంపాదించాలి.. ఎంత మంది వద్ద శిష్యరికం చేయాలి.. అనుకుంటారు. ఆ రోజుల్లో సినిమా పరిస్థితిని బట్టి చూస్తే అది నిజమే. కానీ ఆ ట్రెండ్ ను బ్రేక్ చేసింది మాత్రం దేవీ శ్రీనే. ఇంటర్ పూర్తి చేసిన టైమ్ లో వారి ఇంటికి వెళ్లిన నిర్మాత ఎమ్మెస్ రాజు దేవీ గదిలో నుంచి వచ్చిన మ్యూజిక్ విన్నాడు. అంతే మీ వాణ్ని మ్యూజిక్ డైరెక్టర్ ను చేస్తున్నానని చెప్పాడు. కానీ అతను చాలా చిన్నవాడు కదా అని తండ్రి సత్యమూర్తి అంటే, టాలెంట్ కు వయసుతో పనేంటని ఎమ్మెస్ రాజు పట్టుబట్టి మరీ తన దేవి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ను చేశాడు. ఎమ్మెస్ రాజు నమ్మకం వమ్ము కాలేదు. టీనేజ్ లోనే దేవి లాంటి పెద్ద సినిమాకు సంగీతం ఇవ్వడమే కాదు.. పరిశ్రమ మొత్తం ఆశ్చర్యపోయే బాణీలూ ఇచ్చాడు. దేవి సినిమా 1999లో వచ్చింది. ఆడియో తో పాటు బ్యాక్ గ్రౌండూ సూపర్ హిట్. తర్వాత అదే యేడాది నీకోసం సినిమాలో ఓ పాట చేశాడు. మిగతా సంగీతం ఆర్పీ పట్నాయక్ అందించడం విశేషం. నీకోసం సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. దీంతో శ్రీను వైట్లకు గ్యాప్ వచ్చింది. ఈ లోగా జెడి చక్రవర్తి హీరోగా దేవీ దర్శకుడు కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన నవ్వుతూ బతకాలిరా సినిమాకు సంగీతం అందించాడు. పాటలు ఆకట్టుకున్నా.. సినిమా ఆడలేదు.. ఇందులోని నోరారా నవ్వేద్దాం పాట ట్రాక్ తర్వాత కొన్ని సినిమాల్లో వాడినట్టుగా అనిపించడం విశేషం.

నీకోసంతో కొంత నిరుత్సాహపడ్డ దర్శకుడు శ్రీను వైట్ల మళ్లీ పుంజుకున్నాడు. కంప్లీట్ కాలేజ్ లవ్ ఎంటర్టైనర్ ఆనందంతో వచ్చాడు. దీనికి ఈ సారి దేవీనే సంగీత దర్శకుడుగా తీసుకున్నాడు. ఈ మూవీలోని పాటలు ఎప్పుడు విన్నా ఫ్రెష్ గానే అనిపిస్తాయి. అన్ని పాటలూ సూపర్ హిట్. దేవీ పేరు మార్మోగిపోయింది. టీనేజ్ కుర్రాడు కాబట్టి ఆ యేజ్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. ఆనందం దేవీకే కాదు..ఆ సినిమా చేసిన ప్రతి ఒక్కరికీ హ్యాపీయొస్ట్ కెరీర్ నిచ్చింది.ఆనందం తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు దేవిశ్రీ ప్రసాద్. కుర్రాడు కదా అని ఎవరూ అనుకోలేదు. అతని టాలెంట్ ను మాత్రమే చూశారు. అతనూ అంతే పనిపై తప్ప వేరే దేనిపై ధ్యాస పెట్టలేదు. తనకెంతో ఇష్టమైన సంగీత ప్రపంచంలో ఒక్కో సినిమాను పేర్చుకుంటూ ఎదుగుతూ వెళుతున్నాడు. ఆ క్రమంలో వెండితెర సంగీతంపై ఖడ్గం దూశాడు. అప్పటి వరకూ ఉన్న, విన్న పాటలకంటే భిన్నమైన బాణీలిస్తూ మన్మథుడైనా, తొట్టిగ్యాంగ్ అయినా.. సంగీతమే తన సొంతం అన్న రేంజ్ లో దూసుకుపోయాడు.నాగార్జునతో ఫస్ట్ టైమ్ చేసిన సినిమా మన్మథుడు. న్యూ టాలెంట్ న ఎంకరేజ్ నాగ్ అంచనాల్ని కూడా దాటిపోయాడు దేవీ. ఈ సినిమాలో అన్ని పాటలూ వైవిధ్యమైనవే.

మెలోడీ, ఎమోషనల్, టీజింగ్, డ్యూయొట్.. ఇలా డిఫరెంట్ సిట్యుయేషన్స్ కు తగ్గట్టుగా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. తనే పాడిన మన్మథుడులోని అందమైన భామలు పాటను ఆ తర్వాత ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ఎన్నో మెట్రో సిటీస్ లోని అన్ని ఫ్యాషన్ షోస్ లో భాష తెలియకపోయినా ప్లే చేశారు. దటీజ్ దేవీ. సినిమా ఇండస్ట్రీలో కొన్ని సిగ్నేచర్స్ ఉంటాయి. ఆ సిగ్నేచర్ తర్వాత ఆ ఆర్టిస్ట్ ఎంత ఎత్తుకు ఎదిగినా ఈ సిగ్నేచర్ గుర్తుకురాకుండా పోదు. అలాంటిదే వర్షం. వర్షం మాత్రమే కాదు.. సుకుమార్ తో చేసిన ఆర్య కూడా దేవీ శ్రీలోని డిఫరెంట్ టాలెంట్ ను ఆవిష్కరించింది. ఈ రెండు సినిమాలు దేవీ కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లాయి. ఆ రెండు సినిమాల్లోని పాటలు కొన్నేళ్ల పాటు యువత పెదాలపై అలవోకగా హమ్ అయ్యాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతానికి అంత త్వరగా కనెక్ట్ కావడానికి కారణం అవి రాకింగ్ గా ఉంటూనే సంప్రదాయ సంగీతాన్నీ తలపిస్తాయి.

సీన్ కూ సిట్యుయేషన్ కూ తగ్గట్టుగా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తాయి. యూత్ ఫుల్ మూవీ అయితే ఆర్యలా అదరగొడతాడు..లవ్ స్టోరీ అయితే సంగీత వర్షం కురిపిస్తాడు. ఇదే అతన్ని మిగతా సంగీత దర్శకుల నుంచి వేరు చేస్తుంది.. 2000ల తర్వాత తెలుగులో సాహిత్యాన్ని చంపే వాయిద్యాల హోరు కొంత పెరిగింది. చాలామంది సంగీత దర్శకులు ఇందుకు కారణం. కానీ దేవీశ్రీ ప్రసాద్ కు సాహిత్యం విలువ తెలుసు. ఆయన తండ్రి సత్యమూర్తి రచయిత కదా. పైగా తనూ అప్పుడప్పుడూ కలం కదిలిస్తుంటాడు. అందుకే ఎంత రాకింగ్ గా ఉన్నా దేవీ పాటల్లో లిరిక్ కు వచ్చే ఇబ్బందేమీ ఉండదు. ఇక మంచి సాహిత్యం కూడా ఉన్న పాటలైతే అతని సంగీతంలో పులకించిపోతాయి.

దేవీ శ్రీ ప్రసాద్ తరం కుర్రాళ్లందరికీ ఓ డ్రీమ్ ఉండేది. మెగాస్టార్ చిరంజీవితో పనిచేయాలని. దేవీ కూడా అంతే చిరు ఫ్యాన్. ఆయన సినిమాకు సంగీతం చేయాలన్న తన కోరిక ఆర్య వల్ల తీరింది. యస్.. ఆర్య సంగీతానికి ఫిదా అయ్యే తర్వాత శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ చిత్రానికి ఛాన్స్ ఇచ్చాడు మెగాస్టార్. మరి తన ఆరాధ్య నటుడే అవకాశం ఇస్తే ఊరుకుంటాడా.. శంకర్ దాదా పాటలు మాస్ ను ఎంత ఊపాయో వేరే చెప్పాలా.. మెగాస్టార్ సైతం సరికొత్త జోష్ తో స్టెప్పులు వేసి మరీ ఉర్రూతలూపాడు.. అంతేకాదు ఈ మూవీలో చైల చైలా అనే పాట కూడా రాశాడు.హీరోల ఇమేజ్, డైరెక్టర్స్ టేస్ట్, రచయితల సాహిత్యం ఇవన్నీటినీ శాటిస్ ఫై చేస్తూ సాగే దేవీ సంగీతం నిజంగా ఓ అద్భుతం. కళ ఎప్పుడూ అవతలి వారికి నచ్చేలా ఉండాలి. అప్పుడే అది రాణిస్తుంది. ఆ విషయంలో దేవీ ఎప్పుడూ ది బెస్ట్ అనిపించుకున్నాడు. అందుకే కొత్తతరం కుర్రాళ్ల నుంచి మెగా తరం స్టార్స్ వరకూ దేవీ మ్యూజిక్ అంటే ఫిదా అయిపోతున్నారు.


ఎమ్మెస్ రాజు అంటే దేవీకి ప్రత్యేకమైన అభిమానం. తనెవరో ఎవరికీ పెద్దగా తెలియని టైమ్ లోనే తన కళను నమ్మి సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడనే కృతజ్ఞత కూడా కావొచ్చు. అందుకే ఎమ్మెస్ రాజు సినిమాలకు దేవీ వాయిద్యాలు మరింత హుషారుగా పనిచేస్తాయి. అందుకు కారణమూ లేకపోలేదు. ఎమ్మెస్ రాజుకు మ్యూజిక్ సెన్స్ ఎక్కువ. దగ్గరుండి మరీ మంచి సంగీతం చేయించుకుంటారు. దేవీ నుంచి పౌర్ణమి వరకూ వీరి కాంబోలో వచ్చిన అన్ని సినిమాల ఆల్బమ్స్ ఎవర్ గ్రీన్ మెలోడీసే.దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాలిక్యులేటెడ్ గా ఉంటుంది. ఓ రెండు మెలోడీస్. కథలోఉంటే శాడ్ సాంగ్, ఐటమ్ సాంగ్, డ్యూయొట్స్.. ఇలా.. దేనికదే స్పెషల్ గా సాగిపోతుంది. కొన్నిసార్లు ఐటమ్ సాంగ్స్ విషయంలో రిపీటెడ్ గా వింటున్న ఫీలింగ్ కలిగినా.. ఆ ఫీలింగ్ ను అణచుకుని మరీ ఎంజాయ్ చేస్తాం. ఇదో మ్యాజిక్. ఆడియన్స్ పల్స్ తెలిసిన వారికి మాత్రమే సాధ్యం.


తన సంగీతం విషయంలో స్టార్స్ కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు అనే విమర్శలూ లేకపోలేదు. తనోస్టార్ అయ్యాక ఆ విమర్శలు సహజం. ఎవరిని కాదన్నా కష్టమే. కానీ కమిట్ అయితే మాత్రం చిన్నపెద్ద చూడ్డం ఉండదు. తనకు కావాల్సింది సిట్యుయేషన్, లిరిక్స్, అండ్ డైరెక్టర్ టేస్ట్.. చాలు చిన్న సినిమా అయినా మెప్పించేస్తాడు. అందుకే నేను శైలజ సినిమాలోని క్రేజీ క్రేజీ సాంగ్ మూడుకోట్లకు పైగా వ్యూస్ సంపాదించుకుంది.ఇప్పటి వరకూ తెలుగులో తమిళ సంగీత దర్శకుల హవా ఎక్కువగా ఉండేది.

ఆ ట్రెండ్ ను బ్రేక్ చేశాడు దేవీ. కోలీవుడ్ లోనూ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతానికి లక్షలాది అభిమానులున్నారు. అక్కడి స్టార్ హీరోలు కూడా దేవీ కోసం వెయిట్ చేసే పరిస్థతి కల్పించాడు. అదే సందర్భంలో కోలీవుడ్ లో చాలా సినిమాలు చేసిన దేవీ సంగీతంలో ఇప్పుడు తెలుగులోనూ ఒక్కోసారి అరవ వాసన వస్తోందనేవారూ ఉన్నారు. అవన్నీ ఎలా ఉన్నా.. తన పనిని ఆస్వాదించడం మాత్రమే అతనికి తెలుసు.
2005లోనే కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు దేవీ. సచిన్, వర్షం రీమేక్ మలై తో పాటు ఆరు సినిమాలకు ఆ యేడాది సంగీతం అందించాడు. ఇవన్నీ మ్యూజికల్ గా మంచి హిట్సే. తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ వెళ్లాడు. అయినా అక్కడి ఆడియన్స్ కు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ఆరు సినిమా దర్శకుడు హరితో ఉన్న అనుబంధంతో మళ్లీ సింగం సినిమా ఛాన్స్ వచ్చింది. సింగం సంగీతానికి కోలీవుడ్ ఫిదా అయింది.

ముఖ్యంగా ఆర్ఆర్. సింగం-2కూ అతనే సంగీతం. కానీ మూడో భాగానికి వేరే వారిని తీసుకున్నారు. సినిమా ఓకే అనిపించుకున్నా అక్కడి క్రిటిక్స్ అంతా మ్యూజిక్ లో దేవీ మ్యాజిక్ మిస్ అయిందని చెప్పారు. తెలుగులో మెగా హీరోల సినిమాలకు దేవీ సంగీతం మరీ ఉరకలు వేస్తుంది. బన్నీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా అందరి సినిమాలకూ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. అయితే ఇవన్నీ కమర్షియల్ ఆల్బమ్స్ కావడం విశేషం. మొత్తంగా దేవీ మ్యూజిక్ అంటే సినిమా సగం హిట్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఫీలవుతోన్న విషయం. బాలయ్యతో లెజెండ్ చేసిన దేవీకి ఎన్టీఆర్ తో ప్రత్యేక అనుబంధమూ ఉంది. ఊసరవెల్లి నుంచి జనతా గ్యారేజ్ వరకూ ఆయా సినిమాల విజయాల్లో దేవీ సంగీతమూ ఓ హైలెట్. నాన్నకు ప్రేమతో చేస్తోన్న టైమ్ తో తన తండ్రి చనిపోయినా ఆ బాధను దిగమింగుకుని పనికి ప్రాధాన్యమిచ్చిన ప్రొఫెషనల్ దేవీ. ఆ సినిమాలోని టైటిల్ సాంగ్ కూడా తనే రాశాడు.


మొత్తంగా పుష్ప సినిమాతో మరోసారి దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ మూవీకి సీక్వెల్ తో పాటు సూర్య హీరోగా ప్యాన్ ఇండియన్ సినిమాగా వస్తోన్న కంగువాకు అతనే మ్యూజిక్. ఏదైనా దేవీ సంగీతంలో కాపీ ట్యూన్స్ కనిపించవు. ఉన్నా.. ఎప్పుడో ఒకసారి తప్ప తెలియవు. అందుకే అతని మ్యూజిక్ కు ఇంతమంది అభిమానులున్నారు.ఈ అభిమానం మరింత రెట్టింపయ్యేలా అతన్నుంచి ఇంకా బెస్ట్ ఆల్బమ్స్ రావాలని కోరుకుంటూ ఈ రాక్ స్టార్ కు తెలుగు 70ఎమ్ఎమ్ హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది.

                                    - దేవీ శ్రీ ప్రసాద్

Related Posts