‘తండేల్’.. శ్రీకాకుళంలో ఇక రాజులమ్మ జాతరే..

శ్రీకాకుళంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘తండేల్’. ఆద్యంతం మత్సకారుల ఇతివృత్తంతో రూపొందుతోన్న ఈ మూవీ ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. ‘కార్తికేయ 2’తో ఇప్పటికే పాన్ ఇండియా హిట్ అందుకున్న చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రతిష్ఠాత్మక సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ మూవీలో చైతన్య కి జోడీగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి నటిస్తుంది.

నడి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన హీరో.. అనుకోని పరిస్థితుల్లో పాకిస్తాన్ కు చిక్కడం.. అక్కడ అతను ఎదుర్కొన్న బాధలు.. చివరకు వాటి నుంచి బయటపడ్డాడా? లేదా? అనేదే ఈ సినిమా కథ. ఇక.. ఈ మూవీలో సముద్రం, వేట, ప్రేమకథ వంటి అంశాలతో పాటు.. శ్రీకాకుళంలోని రాజులమ్మ జాతర ఎపిసోడ్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందట. త్వరలోనే శ్రీకాకుళంలో ఆ ఎపిసోడ్ ను చిత్రీకరించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.

తాజాగా శ్రీకాకుళంలో రాజులమ్మ జాతర సందర్భంగా కొంతమంది అక్కినేని ఫ్యాన్స్.. ‘ఇక.. రాజులమ్మ జాతరే’ అంటూ ‘తండేల్’ చిత్రబృందానికి రాజులమ్మ ఆశీస్సులు ఉండాలని ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోని రీట్వీట్ చేసి.. త్వరలోనే ‘తండేల్’ చిత్రీకరణ కోసం శ్రీకాకుళం వస్తున్నామంటూ హింట్ ఇచ్చాడు హీరో నాగచైతన్య.

Related Posts