భయపెడుతున్న ‘పొలిమేర 2‘ ట్రైలర్

కంటెంట్ ఉన్న చిత్రాలకు తారా బలంతో పనిలేదు. కథలో విషయం ఉంటే ఆ సినిమాని ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అలా రెండేళ్ల క్రితం ఓటీటీలో రిలీజైన చిత్రం ‘మా ఊరి పొలిమేర‘. సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శీను ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది.

ఇప్పుడు ‘మా ఊరి పొలిమేర‘కి సీక్వెల్ గా వస్తోన్న చిత్రమే ‘పొలిమేర 2‘. అప్పట్లో కరోనా టైములో వచ్చిన ‘మా ఊరి పొలిమేర‘ ఓటీటీలో రిలీజైతే. ఇప్పుడు సీక్వెల్ డైరెక్ట్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. నవంబర్ 3న థియేటర్లలో విడుదలకు ముస్తాబైన ‘పొలిమేర 2‘ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

అసలు చేతబడులు అనేవి నిజంగా ఉన్నాయా?.. ఒకే చితిలో రెండు శవాలు.. అంటూ గ్రామీణ ప్రాంతాల్లో జరిగే క్షుద్రపూజలతో ట్రైలర్ ప్రారంభమయ్యింది. ఒక ఊరు.. ఆ ఊరిలో మిస్టరీగా మారిన గుడి చుట్టూ సాగే ‘పొలిమేర 2‘ ట్రైలర్ ఆద్యంతం భయపెడుతూ ఆకట్టుకుంటోంది. మొదటి భాగంలో నటించిన నటీనటులే సీక్వెల్ లోనూ సందడి చేయబోతున్నారు.

ఇక.. ఫస్ట్ పార్ట్ ను తెరకెక్కించిన అనిల్ విశ్వనాథ్ సీక్వెల్ కి కూడా కథ, మాటలు, దర్శకత్వం వహించాడు. శ్రీకృష్ణా క్రియేషన్స్ బ్యానర్ పై గౌర్ క్రిష్ణా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మొత్తంమీద.. ‘విరూపాక్ష‘ వైబ్స్ తో వస్తోన్న ‘పొలిమేర 2‘ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుందని ఆశిద్దాం.

Related Posts