మహేష్ మారలేదు.. గుంటూరు కారం డౌటే

సూపర్ స్టార్ మహేష్‌ బాబు నుంచి ఓ సినిమా వస్తోందంటే ఆయన ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తారు. అది అతనికి ఉన్న ఛరిష్మా. ముఖ్యంగా లేడీస్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉందీ స్టార్ కు. ఒక స్టార్ హీరోగా మహేష్ పై గతంలో పెద్దగా కంప్లైంట్స్ లేవు. కానీ ఫస్ట్ టైమ్ గుంటూరు కారం సినిమా విషయంలో వినిపిస్తున్నాయి.

ఈ సినిమా పట్ల ఆయన నిర్లక్ష్యం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రూపొందబోతోన్న ఈ చిత్రం కోసం ఏకంగా ఒక షెడ్యూల్ అయిన తర్వాత కథనే మార్చేయమన్నాడు. ఆ షెడ్యూల్ కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు చేశారు. అయినా స్టార్ హీరో కాబట్టి ఆయన కోరినట్టుగా కథ మార్చాడు త్రివిక్రమ్. ఈలోగా మహేష్‌ ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. వీటిని దాటుకుని గుంటూరు కారం సెట్స్ పై అడుగుపెట్టింది.

అప్పటి నుంచి దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడు మహేష్‌ బాబు. సినిమా కోసం ఇచ్చిన డేట్స్ లో షూటింగ్ లో పార్టిసిపేట్ చేయడం లేదు. ఆ టైమ్ లో ఇతర యాడ్స్ చేస్తూ కాలయాపన చేస్తూ వస్తున్నాడు. తనకు ఇంత ఇమేజ్ రావడానికి కారణమైన సినిమాలను కాదని కేవలం యాడ్స్ కు ప్రాధాన్యం ఇవ్వడంపైనా అప్పట్లో విమర్శలు వచ్చాయి. మహేష్‌ ధోరణి నచ్చక సినిమా నుంచి ఫైట్ మాస్టర్స్ తప్పుకున్నారు. సినిమాటోగ్రాఫర్ కూడా తప్పుకున్నాడు. అటు సంగీత దర్శకుడు తమన్ ను కూడా తప్పించాలని.. మహేష్‌ చెప్పాడు. బట్ త్రివిక్రమ్ అతనికి సర్ది చెప్పాడు.


ఇక గత నెలలో తన కూతురుతో పాటు తన బర్త్ డే స్పెషల్స్ అంటూ లాంగ్ వెకేషన్ కు వెళ్లాడు. షూటింగ్స్ ను వదిలేసి వెకేషన్స్ కు వెళ్లడం మహేష్‌ కు మామూలే. కానీ ఈ చిత్రం విషయంలో కావాలనే చేస్తున్నాడు అనే కమెంట్స్ ఉన్నాయి. ఇక వెకేషన్ నుంచి రాగానే ఈ 16 నుంచి గుంటూరు కారం షూటింగ్ లో జాయిన్ అవుతాడు అనుకున్నారు. బట్ ఆయన యధా ప్రకారం మళ్లీ ఓ యాడ్ షూటింగ్ చేస్తున్నాడు. ఈ యాడ్ కు సంబంధించి ప్రెస్ మీట్ కు కూడా అటెండ్ కాబోతున్నాడు. మరి ఈ ప్రెస్ మీట్ లో గుంటూరు కారం గురించిన ప్రశ్నలను అనుమతిస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ అనుమతిస్తే.. ఆయన సమాధానాలు ఎలా ఉంటాయి అనే ఆసక్తి కూడా జనాల్లో ఉంది.


ఏదేమైనా ఈ సినిమా ఏ ముహూర్తంలో మొదలైందో కానీ.. ఆరంభం నుంచి అన్నీ ఆటంకాలే వస్తున్నాయి. మరి వీటికి అడ్డుకట్ట వేసి అనుకున్నట్టుగా సంక్రాంతికి విడుదల చేయడం అసాధ్యం అనే అంటున్నారు. సంక్రాంతికి ఇంకా నాలుగున్నర నెలల టైమ్ ఉంది. ఈ సినిమా షూటింగ్ కు ఇంకా మూడు నెలలు పడుతుందట. అది కూడా అస్సలు బ్రేక్ లేకుండా చేస్తేనే అంటున్నారు. మహేష్‌ నుంచి బ్రేక్ లేకుండా అనే మాటను ఊహించలేం. ఈ కారణంగానే గుంటూరు కారం సంక్రాంతి రేస్ నుంచి దాదాపు అవుట్ అనే అంటున్నారు.

Related Posts