జీవిత మళ్లీ నటిస్తోందా..?

జీవిత హీరోయిన్ గా ఎనభై దశకంలో కెరీర్ మొదలుపెట్టింది. తెలుగులో పెద్ద స్టార్డమ్ రాలేదు కానీ.. కొన్నాళ్ల పాటు తమిళ్ లో స్టార్ హీరోయిన్ గానే వెలిగింది. అక్కడ ఒక్క యేడాదిలోనే 12 సినిమాల్లో నటించిన రికార్డ్ ఉంది. ఆ స్టార్డమ్ తోనే తెలుగులో డామిట్ కథ అడ్డం తిరిగింది సినిమాతో ఎంటర్ అయింది. తర్వాత వరుసగా తలంబ్రాలు, ప్రజాస్వామ్యం సినిమాల్లో నటించింది.

ఇవేవీ విజయం సాధించలేదు. ప్రజాస్వామ్యం టైమ్ లోనే రాజశేఖర్ తో పరిచయం. తర్వాత ఈ ఇద్దరూ కలిసి తెలుగులో ఆహుతి, అంకుశం, మగాడు వంటి చిత్రాల్లో కలిసి నటించారు. 1989లో విడుదలైన అంకుశం తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు జీవిత. అంటే ఇప్పటికి 34యేళ్లవుతోంది. ఇన్నేళ్లలో ఎప్పుడూ మళ్లీ యాక్టింగ్ వైపు రాలేదు.

కానీ దర్శకురాలుగా శేషు, సత్యమేవ జయతే, మహంకాళి, శేఖర్ వంటి చిత్రాలు రూపొందించింది. బట్ ఇవన్నీ పోయాయి. అయినా తన భర్త రాజశేఖర్ కు చేదోడుగా ఉంటూ అప్పుడప్పుడూ నిర్మాతగానూ మెప్పించింది. ప్రస్తుతం వారి ఇద్దరు కూతుళ్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ టైమ్ లో వారికి తోడుగా ఉండాల్సిన జీవిత ఇన్నేళ్ల తర్వాత మళ్లీ యాక్టింగ్ వైపు రావడం ఆశ్చర్యమే.


సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న లాల్ సలామ్ సినిమాతో జీవిత మళ్లీ మొహానికి మేకప్ వేసుకుని లైట్స్ ముందుకు వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రజినీకాంత్ చేస్తోన్న ఓ పాత్ర షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ ఓ ఫోటో విడుదల చేసింది టీమ్.

ఆ ఫోటోలో జీవిత కూడా కనిపిస్తోంది. దీంతో విషయమేంటా అని ఆరా తీస్తే.. జీవిత ఈ చిత్రంలో ఓ పాత్రలో నటిస్తోందన్న విషయం తెలిసింది. మరి ఈ పాత్ర వరకేనా లేక తర్వాత నటనను కొనసాగిస్తుందా అనేది చూడాలి. ఏదేమైనా తెలుగులో కూడా నటించదలచుకుంటే జీవితకు మంచి పాత్రలు పడే అవకాశం లేకపోలేదు.

Related Posts