ఇలా ఆగుతాడా మళ్లీ మాస్ అంటాడా..?

కొందరు హీరోలకు ఓ ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ తో చేసే సినిమాలే విజయం సాధిస్తాయి. కానీ వారికి వేరే కోరిక ఉంటుంది. ఆ ఇమేజ్ ను దాటి మాస్ హీరో అనిపించుకోవాలనేదే ఆ కోరిక. ఆ కోరిక తీర్చుకునే ప్రయత్నాలు చేసిన ప్రతిసారీ ఫ్లాపులు చూస్తుంటారు.

ఇలాంటి హీరోల లిస్ట్ లో ఖచ్చితంగా ఉండే పేరు శ్రీ విష్ణు. ఇతనికి క్లాస్ హీరోగా మంచి పేరు ఉంది. ఆ పేరుకు తగ్గ సినిమాలు చేసినప్పుడల్లా మంచి విజయాలు సాధించాడు. బట్ అప్పుడప్పుడూ అతనికీ మాస్ పురుగు కుడుతుంది. అటు పరుగులు పెడుతుంటాడు. అంతే.. అవి ఫ్లాప్ అవుతుంటాయి. ఉన్న మార్కెట్ దెబ్బతింటుంది.

శ్రీ విష్ణు విషయంలో ఇది ప్రతిసారీ జరుగుతుంది. ఓ క్లాస్ హిట్ పడగానే మాస్ కథలు సెలెక్ట్ చేసుకుంటాడు. లాస్ అవుతుంటాడు. సామజవరగమనా.. వంటి క్లాస్ హిట్ అతని కెరీర్ కే పెద్ద హిట్. ఇప్పటి వరకూ ఈ రేంజ్ కమర్షియల్ హిట్ చూడలేదు శ్రీ విష్ణు. అంటే తన బలమేంటో ఇప్పటికైనా అర్థం అయితే మంచిది. లేదంటే మళ్లీ మాస్ అన్నాడో ఇక అంతే సంగతులు అవుతుంది.


నిజానికి శ్రీ విష్ణు విక్టరీ వెంకటేష్‌ అభిమాని. ఆయనలా ఇమేజ్ తెచ్చుకోవాలన్నదే తన టార్గెట్ అని కూడా చెప్పాడు. అలా చేయాలంటే మరీ ఊరమాస్ కథలంటే కుదరదు. వెంకీ కూడా అలా ఎప్పుడూ చేయలేదు. చేసినా.. తన ఇమేజ్ ను దాటి వెళ్లలేదు. ఆ జాగ్రత్త ఉంది కాబట్టే ఇన్నేళ్లుగా ఆ ఇమేజ్ ను అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు.

ఇక మరో అవకాశం ఏంటంటే.. ఆ నలుగురు తరం హీరోలను ఫుల్ ఫిల్ చేసే ఇమేజ్ ఉన్న హీరోలు ఈ తరంలో చాలామంది ఉన్నారు. కానీ వెంకటేష్‌ ను రీ ప్లేస్ చేసేవారు లేరు. ఆ అవకాశం శ్రీ విష్ణుకు ఉంది. అందుకే ఇకనైనా మాస్ హీరోగా ప్రయత్నాలు చేసి లాస్ కాకుండా ఇలా క్లాస్ మూవీస్ తో శభాష్ అనిపించుకుంటే అతనికే మంచిది. లేదంటే ప్రేక్షకులు కూడా మరీ ఎక్కువ అవకాశాలేం ఇవ్వరు.

Related Posts