టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్‘. మూడేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ విడుదలైంది కేవలం టైటిల్ టీజర్ మాత్రమే. ఇక.. తమన్ స్వరాలందిస్తోన్న ‘గేమ్ ఛేంజర్‘ నుంచి ఫస్ట్ సింగిల్ ‘జరగండి..‘ రాబోతుందంటూ గత ఏడాదే ప్రకటించింది టీమ్.
గత సంవత్సరం దసరా కానుకగా.. ఆ తర్వాత దీపావళి కానుకగా ఈ పాటను విడుదల చేద్దామనుకున్నారు. కానీ.. మ్యూజిక్ రైట్స్ తీసుకున్న సంస్థతో బిజినెస్ విషయంలో తేడాలొచ్చి పాటను విడుదల చేయడకుండా ఆపారానే ప్రచారం జరిగింది. ఇక.. ‘గేమ్ ఛేంజర్‘ నుంచి ఆ మోస్ట్ అవైటింగ్ ‘జరగండి.. ‘ పాటకు ఇప్పుడు సమయం ఆసన్నమైంది. రేపు (మార్చి 27) ఉదయం 9 గంటలకు ‘జరగండి..‘ పాటను విడుదల చేయబోతున్నారు. 150 థియేటర్స్‌లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.
శంకర్ సినిమాల్లోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శంకర్ తీర్చిదిద్దే ఒక్కో పాటతో ఓ మినీ బడ్జెట్ మూవీనే తీయొచ్చు. అలాగే.. ఈ సినిమాలోని ‘జరగండి‘ పాటను ఎంతో కలర్ ఫుల్ గా భారీ బడ్జెట్ తో చిత్రీకరించాడట శంకర్. ఈమధ్య కాలంలో మోస్ట్ ఎక్స్ పెన్సివ్ సాంగ్ గా ప్రచారంలో ఉన్న ‘జరగండి‘ పాట విడుదల తర్వాత ఎలాంటి అప్లాజ్ తెచ్చుకుంటుందో చూడాలి.