మహా వీరుడు ట్రైలర్ ఎలా ఉంది..

శివకార్తికేయన్ హీరోగా రూపొందుతోన్న సినిమా మహా వీరుడు. ఇంతకు ముందు కమర్షియల్ గానూ, విమర్శియల్ గానూ మెప్పించిన మండేలా అనే తీసిన మడోన్నే అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.

తమిళ్ లో విడుదలైన ఒకరోజు తర్వాత తెలుగు ట్రైలర్ వచ్చింది. కొన్నాళ్లుగా తెలుగు మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు శివకార్తికేయన్. కోలీవుడ్ నేచురల్ స్టార్ అన్న ట్యాగ్ ఉన్న ఈ హీరో రీసెంట్ గా తెలుగులో ప్రిన్స్ అనే డైరెక్ట్ మూవీ కూడా చేశాడు. జాతిరత్నాలుఫేమ్ అనుదీప్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఇప్పుడు మహా వీరుడును తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. అందుకే తెలుగు ట్రైలర్ కూడా వచ్చేసింది.


ప్రెస్ లో పనిచేసే ఓ సాధారణ కార్టూనిస్ట్ కుర్రాడు. అక్కడ బొమ్మలు వేస్తూ వాటికి కథలు రాసుకుంటూ ఉంటాడు. సహజంగా పిరికివాడు. అతనికి లోకల్ పొలిటీషియన్స్ తో గొడవ అవుతుంది. అసలు బలవంతులైన పొలిటీషియన్స్ తో ఈ పిరికివాడు ఎలా పోరాటం చేశాడు అనే పాయిట్ తో అల్లుకున్న కథలా కనిపిస్తోంది ఈ మూవీ ట్రైలర్ చూస్తోంటే. అయితే ఓ సాధారణ వ్యక్తి తలచుకుంటే ఎంతటి పెద్ద సమస్యపైన అయినా పోరాటం చేయొచ్చు.. అప్పుడు అతనే ఓ మహావీరుడు అవుతాడు అనే సందేశం కూడా మిళితం అయింది. నిజానికి ఈ టైటిల్ అనౌన్స్ అయినప్పుడు చాలామంది చాలా ఊహించుకున్నారు. బట్ ట్రైలర్ అందుకు పూర్తి భిన్నంగా కనిపించడం విశేషం. అదే దర్శకుడికి మార్క్ గా చెప్పొచ్చు.


ట్రైలర్ చూస్తే.. అనుకోకుండా ఎంతోమంది పార్టీ కార్యకర్తలు చూస్తుండగా వారి నాయకుడి ఫోటో ఉన్న ఫ్లెక్సీని చింపేస్తాడు. దీనికి కార్యకర్తలు కోప్పడితే వారికి ఎదురు చెబుతాడు. దీంతో ఇది కాస్తా పెద్ద గొడవగా మారుతుంది. అప్పటి నుంచి వారు అతన్ని వెంటాడటం.. తను తప్పించుకోవడం.. ఇలా ఎంత కాలం.. అందుకే హీరోయిన్ చెప్పిన మాట విని ఒక ట్రిక్ ప్లే చేస్తాడు. వారిని ఎదురించే కథానాయకుడుగా తన కార్టూన్స్ తో ఓ హీరో పాత్రను క్రియేట్ చేస్తాడు. అప్పటి నుంచి వాళ్లు ఎదురైతే తనూ ఆ పాత్రలా మారతాడు. అంటే తిరుగుబాటు తను మొదలుపెడతాడు అన్నమాట. ఈ హీరో పాత్ర ఎంటర్ అయిన తర్వాత నుంచి అతను అదే పనిగా ఆకాశం వైపు చూస్తూ ఉండటం బలే ఫన్నీగా ఉంది.


ఇండియాస్ టాప్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో.. దర్శకుడి మొదటి సినిమా మండేలాలో హీరోగా నటించిన యోగిబాబు ఈ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళ్ లో దర్శకుడుగా తనకంటూ ఓ పేరున్న మిస్కిన్ ఈ మూవీతో విలన్ గా పరిచయం అవుతున్నాడు. ఒకప్పటి హీరోయిన్.. మరో చరిత్ర ఫేమ్ సరిత శివకార్తికేయన్ తల్లి పాత్రలో కనిపిస్తోంది. ఎలా చూసినా ఓ ప్రత్యేకమైన ప్యాక్ తో కనిపిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ మాత్రం ఆకట్టుకునేలానే ఉంది. ఇక ఈ మహా వీరుడు తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ నెల 14న విడుదల కాబోతున్నాడు.

Related Posts