హ్యాపీ బర్త్ డే మారుతి

ఏ దర్శకుడైనా తనదైన ముద్ర వేస్తేనే ఎక్కువ కాలం నిలబడతాడు. అలాగని అదే ముద్ర కొనసాగించినా ఇబ్బంది తప్పదు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకుంటూ పరిశ్రమలో దర్శకుడుగా ఓ వైవిధ్యమైన ముద్రవేశాడు మారుతి. తొలినాళ్లలో కాస్త విమర్శలకు తావిచ్చే సినిమాలు చేసినా.. చాలా త్వరగానే ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి హారర్ కామెడీ అనే సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. అటుపై స్టార్ హీరోలకూ పెద్ద విజయాలు ఇస్తూ సక్సెస్ ఫుల్ జర్నీ సాగిస్తోన్న మారుతి బర్త్ డే అక్టోబర్ 8.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి దాసరి మారుతి. స్వయంకృషితో ఎదిగాడు. మొదట్లో ఆర్టిస్ట్ గా, టూడీ యానిమేటర్ గా కెరీర్ ప్రారంభించాడు. బన్నీవాస్ పరిచయంతో ‘ఆర్య‘ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా మారాడు. అటుపై ‘ప్రేమిస్తే, ఏ ఫిల్మ్ బై అరవింద్‘ వంటి చిత్రాలకు కో ప్రొడ్యూసర్ గానూ ఉన్నాడు. రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన 5డీ కెమెరాతో దర్శకుడుగా మారాడు. చాలా చిన్న బడ్జెట్ తో అతను డైరెక్ట్ చేసిన తొలి సినిమా ‘ఈ రోజుల్లో‘ పెద్ద విజయం సాధించింది.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో వెళుతోన్న తెలుగు సినిమాకు ఓ కొత్త జానర్ గా పరిచయమైంది ‘ఈ రోజుల్లో‘ సినిమా. కాస్త అడల్ట్ డైలాగ్స్ ఎక్కువైనా ఈ జానర్ ప్రత్యేకత అదే. అది యూత్ కు నచ్చినా విమర్శకులకు నచ్చలేదు. అయినా తర్వాత ‘బస్టాప్‘ సినిమాతో మరోసారి విజయం అందుకున్నాడు. ఇలాంటి విజయాలు ఎవరికైనా కిక్ ఇస్తాయి. ఆశ్చర్యం ఏంటంటే.. మారుతి క్రియేట్ చేసిన ఈ ట్రెండ్ లో ఆ తర్వాత డజన్ల కొద్దీ సినిమాలు వచ్చాయి.

రెండు సినిమాలకే మారుతికి సెపరేట్ బ్రాండ్ క్రియేట్ అయింది. ఆ బ్రాండ్ ను వాల్యూ చేస్తూ.. తనే రాసి, నిర్మించిన ‘ప్రేమకథా చిత్రమ్‘ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. సినిమా సక్సెస్ తర్వాత దర్శకుడు కూడా తానే అని చెప్పడం విశేషం. అప్పటి వరకూ హారర్ సినిమాలంటే అర్థంపర్థం లేని మేకప్ తో కనిపించిన మన సినిమాకు హారర్ కామెడీ అంటూ అంతులేని నవ్వుల్ని, కొద్దిగా భయాన్ని చూపించి బాక్సాఫీస్ ను కొల్లగొట్టాడు.

మనం రెగ్యులర్ గా చూసే సమాజాన్నే కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్నో కథలు పుట్టుకొస్తాయి. అలా మతిమరపు కుర్రాడి కథతో ఓ అందమైన ప్రేమకథను చెబుతూ మారుతి చేసిన ‘భలేభలే మగాడివోయ్‘ సంచలన విజయం సాధించింది. పూర్తి వైవిధ్యంగా కనిపించిన ఈ కథకు నాని ఒప్పుకోవడం పెద్ద ప్లస్ అయింది. తర్వాత మారుతి రైటప్ తో ఎంటర్టైన్మెంట్ తో అదరగొట్టాడు.

‘భలేభలే మగాడివోయ్‘ విజయం మారుతికి ప్రమోషన్ ఇచ్చింది. అప్పటివరకూ వరుస ఫ్లాపులతో ఉన్న వెంకటేష్ తో సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. సితార బ్యానర్ లో వచ్చిన ‘బాబు బంగారమ్‘ చాలా పెద్ద హిట్ కాదు. కానీ కమర్షియల్ గా ప్రాఫిట్ వెంచర్. అలాగే ఫ్లాపుల నుంచి వెంకీకీ కాస్త రిలాక్స్ నిచ్చిందీ చిత్రం.

ఓసీడీ. ఓవర్ క్లీనింగ్ డిజార్డర్. ఇలాంటి వాళ్లు చాలామందే ఉన్నారు. మరి అలాంటి కుర్రాడి కథతో సినిమా చేయాలంటే కూడా ఖచ్చితంగా కంటెంట్ పై కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ విషయంలో ఏ మాత్రం తక్కువ కాదని ఎప్పుడో ప్రూవ్ చేసుకున్న మారుతి శర్వానంద్ హీరోగా చేసిన ‘మహానుభావుడు‘ సైతం మెప్పించింది.

‘బాబు బంగారమ్‘ తర్వాత సితార బ్యానర్ లో మరోసారి చేసిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు‘. నాగచైతన్య, అనూ ఇమానుయేల్ జంటగా బాహుబలి తర్వాత రమ్యకృష్ణ చేసిన ఈ సినిమా కూడా కమర్షియల్ గా ఆకట్టుకుంది. కాకపోతే మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్ కొంత మిస్ కావడం మైనస్ అనిపించుకుంది.

2019 చివర్లో వచ్చిన ‘ప్రతిరోజు పండగే..‘ మారుతి నుంచి వచ్చిన మరో మంచి కథ. ఫ్యామిలీ రిలేషన్స్ మీద ఎన్ని సినిమాలు వచ్చినా ప్రతి రోజు పండగే కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఆ భిన్నత్వమే మారుతిని చాలా త్వరగా ఆడియన్స్ కు దగ్గర చేసిందని చెప్పాలి. చావుకు దగ్గరగా ఉన్న తండ్రిని అతని కుటుంబం చూసే విధానంలో సెంటిమెంట్ తో ఎంటర్టైన్మెంట్ నూ మిక్స్ చేసి హీరోయిజం కంటే పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఈ మూవీతో మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు.

కాంటెంపరరీ ఇష్యూస్ తో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడే మారుతి.. కరోనా టైములో కరోనా ఇతివృత్తాన్నే తీసుకుని కామెడీ ఎంటర్ టైనర్ గా ‘మంచి రోజులు వచ్చాయి‘ సినిమాని తెరకెక్కించాడు. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమా అంతగా ఆడకపోయినా.. మంచి ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకుంది.

ఆ తర్వాత ఎన్నో అంచనాలతో వచ్చిన గోపీచంద్ ‘పక్కా కమర్షియల్‘ మాత్రం మెప్పించలేకపోయింది. ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి.

ప్రస్తుతం మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ సినిమాని రూపొందిస్తున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. వరుసగా యాక్షన్ ప్యాక్డ్ మూవీస్ తో బిజీగా ఉన్న ప్రభాస్.. ఈ సినిమాలో ఫుల్ లెన్త్ ఫన్ పంచబోతున్నాడట.

వచ్చే యేడాది ప్రథమార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తంగా.. మినీ బడ్జెట్ నుంచి మీడియం బడ్జెట్ వరకూ సినిమాలు చేసి బడా హిట్స్ అందించిన మారుతి.. ప్రభాస్ తో చేస్తున్న మెగా మూవీ కూడా భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటూ మరోసారి ఈ ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్ కు బర్త్ డే విషెస్ చెబుదాం.

Related Posts