టాలీవుడ్ హల్క్ గా చెప్పుకునే రానా అంటే ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీ అని అందరికీ తెలుసు. తను స్వయంగా నిర్మాతల కుటుంబం నుంచి రావడంతో పాటు తనూ నిర్మాతగా సినిమాలు చేస్తున్నాడు. అయితే అతను తనను మోసంచేశాడు అని ఇన్ డైరెక్ట్ గా చెబుతూ తాజాగా దర్శకుడు గుణశేఖర్ చేసిన ట్వీట్ తో పాటు వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి.
గుణశేఖర్ దర్శకత్వంలో రానా హీరోగా హిరణ్యకశ్యప్ అనే సినిమా ఉండబోతోందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని రానా ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు కానీ ఎక్కడా నేరుగా ఈ సినిమా చేస్తున్నా అని చెప్పలేదు అంటారు.
అయితే గుణశేఖర్ మాత్రం తన హీరో రానానే అంటూ వస్తున్నాడు. ఈ మేరకు 2018 నుంచి స్క్రిప్ట్ రెడీ చేసుకుని పక్కా స్క్రీన్ ప్లేతో సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి పెద్ద బడ్జెట్ సినిమాలు చేయాలంటే పెద్ద నిర్మాణ సంస్థలే కావాలని.. ఫాక్స్ స్టూడియోస్ ను సంప్రదించారు. అతని కంటెంట్ నచ్చి ఫాక్స్ స్టార్ వాళ్లు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో ఇది లార్జ్ స్కేల్ లో తీయాలని భావించాడు గుణశేఖర్.
అయితే రానా తాజాగా ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నట్టు ప్రకటించాడు. త్రివిక్రమ్ కథ మాత్రమే ఇస్తాడు. దర్శకత్వం వేరేవాళ్లు చేస్తారు. అమర్ చిత్ర కథలు అనే సంపుటి నుంచి ఈ కథను తీసుకున్నట్టు కూడా చెప్పాడు. ఇదో సిరీస్ లా ఉంటుందని హింట్ ఇచ్చాడు. కట్ చేస్తే ఇదే విషయాన్ని కోట్ చేస్తూ.. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఎవరూ ఎవరినీ ఎక్కువ కాలం మోసం చేయలేరు..అనే అర్థం వచ్చేలా ఎవరి పేరూ చెప్పకుండా ట్వీట్ చేశాడు.
“2018 నుంచి నేను ఈ కథ రాసుకుంటున్నట్టు ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ స్క్రిప్ట్, కాన్సెప్ట్, డిజైన్, పోస్టర్ కోసం ఎంతో శ్రమించి పనిచేశాను. మరి ఇలా వేరేవారి ఐడియాను, హార్డ్ వర్క్ ను దొంగలించడం అనైతికం కాదా..” అని ప్రశ్నిస్తున్నాడు. మరోవైపు కథను తను స్క్రీన్ ప్లేతో సహా రిజిస్టర్ చేసుకున్నానంటున్నాడు.
ఇక ఈ విషయంపై అటు రానా కానీ, ఇటు త్రివిక్రమ్ కానీ స్పందించలేదు. అయితే హిరణ్యకశిప అనేది మన పౌరాణిక కథ. దానికి ఒకరికే హక్కులు ఉంటాయి అని చెప్పలేం. కానీ ఇలా తెలియకుండా కాక.. రానా కూడా ఈ మేటర్ స్మూత్ గా డీల్ చేసి ఉండాల్సింది.. త్రివిక్రమ్ కు కూడా ఈ విషయం తెలుసు కాబట్టి.. వీళ్లంతా మాట్లాడుకుని సెటిల్ చేసుకుని ఉండాల్సింది అనే కమెంట్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం రానా యూఎస్ఏలో ప్రాజెక్ట్ కే కామిక్ కాన్ ఫెస్ట్ లో ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏదైనా రియాక్ట్ అవుతాడేమో చూడాలి.