నాని.. తెలుగు హీరోలను అవమానించాడా..

కొన్నిసార్లు యధాలాపంగా అన్నమాటలు యదార్థాన్ని దాస్తాయి. కావాలని అనకపోయినా కాంట్రవర్శీగా మారతాయి. ఇప్పుడు నాని మాటలు కూడా అలాగే అవుతున్నాయి. దేశంలో ఏ పరిశ్రమలో ఎవరిని అడిగినా ఇండియాస్ బిగ్ ప్యాన్ ఇండియన్ స్టార్ ఎవరూ అంటే వెంటనే ప్రభాస్ అన్న పేరు వినిపిస్తుంది. బాహుబలి తర్వాత అతను ఇండియాస్ బిగ్ స్టార్ అయిపోయాడు.

అలాగే రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా ప్యాన్ ఇండియన్ స్టార్స్ గా.. ఆ మాటకొస్తే గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు. అలాగే పుష్పతో అల్లు అర్జున్ సైతం ప్యాన్ ఇండియన్ స్టార్ అన్న ట్యాగ్ తెచ్చుకున్నాడు. పుష్ప2తో ఆ రేంజ్ లోనే సత్తా చాటబోతున్నాడు. ఇంతమంది తెలుగు హీరోలు ఉండగా.. నాని మాత్రం అసలైన ప్యాన్ ఇండియన్ స్టార్ అంటే దుల్కర్ సాల్మనే అన్నాడు.

ఈ మాటలు ఇప్పుడు టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. ఈ మాటలు నాని కావాలని అనలేదు అనుకోవడానికి లేదు.రీసెంట్ గా దుల్కర్ సాల్మన్ నటించిన కింగ్ ఆఫ్ కోతా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా అటెండ్ అయ్యాడు నాని. ఈ ఫంక్షన్ లో మాట్లాడుతూ.. దుల్కర్ ను ఆకాశానికెత్తేశాడు. అతను తెలుగులో గుర్తింపు తెచ్చుకోవడానికి నా గొంతే కారణం అన్నాడు. తర్వాత అతనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. అయితే అన్ని భాషల దర్శకులు దుల్కర్ తో సినిమా చేయాలనుకుంటారనీ.. అందువల్ల అతనే అసలైన ప్యాన్ ఇండియన్ స్టార్ అన్నాడు.

ఇదే కాంట్రవర్శీకి కారణమవుతోంది. నాని ఆ మాటలు ఎలా అంటాడు అంటూ ఆయా హీరోల ఫ్యాన్స్ మండి పడుతున్నారు. కనీసం ప్రభాస్ అయినా కనిపించలేదా అతనికి అని విరుచుకుపడుతున్నారు. దుల్కర్ సాల్మన్ మంచి నటుడే. అందులో డౌటే లేదు. కానీ అతనికి ఏ మాత్రం తగ్గని నటన చూపించే ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు అతని లైఫ్ లో సాధ్యం కానంత గ్రేట్ డ్యాన్సర్స్ కూడా కదా.. వీళ్లూ గుర్తుకు రావాలి కదా అంటూ నానిపై విమర్శలు సంధిస్తున్నారు.

నిజానికి నాని అలా మాట్లాడి ఉండకూడదు అని అతని ఫ్యాన్స్ కూడా ఫీలవుతున్నారు. ఎందుకంటే దుల్కర్ సాల్మన్ ఇప్పటి వరకూ ప్యాన్ ఇండియన్ రేంజ్ లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ అంటూ ఏం సాధించలేదు.జస్ట్ అన్ని భాషల్లో అందరు దర్శకులు అతని కోసం కథలు రాసుకుంటారు అంటే.. ఎన్టీఆర్ డేట్స్ ఇస్తానంటే, అల్లు అర్జున్ ఓకే అంటే టాప్ డైరెక్టర్స్ అంతా క్యూ కట్టరా.. దుల్కర్ తన భాషను వదిలి దేశమంతా తిరుగుతూ సాధిస్తున్న ఇమేజ్ ను వీళ్లు సొంత భాషలోనే ఉండి సాధిస్తున్నారు. అప్పుడు తోపులు వీళ్లా అతనా.. ఏదేమైనా తెలుగు పరిశ్రమలో నాన్ కాంట్రవర్శీయల్ అనిపించుకున్న నాని ఆ మధ్య టికెట్ రేట్స్ ఇష్యూను కిరాణా దుకాణంతో పోల్చి అభాసు పాలయ్యాడు. ఇప్పుడు అందరు హీరోల అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. అందుకే కొన్నసార్లు యధాలాపంగా అన్న మాటలే ఎక్కువ డామేజ్ చేస్తాయి.

Related Posts