సుకుమార్ సినీ ప్రస్థానానికి ఇరవై ఏళ్లు

ప్రతి దర్శకుడికీ ఓ శైలి ఉంటుంది. అది అందరికీ నచ్చాలనేం లేదు. బట్.. కొందరు దర్శకులుంటారు.. వాళ్లు ఏం చేసినా ఆడియన్స్ కు నచ్చుతుంది. కారణం.. కొత్తదనం. కొత్తగా ఆలోచించడమే కాదు.. కొత్తగా ప్రజెంట్ చేయడం ఆ దర్శకులకు ఎంతోమంది అభిమానులను తెస్తుంది.

అలాంటి దర్శకుల్లో తెలుగు నుంచి ఖచ్చితంగా మొదటి వరుసలోనే ఉంటాడు సుకుమార్. మేటి దర్శకులతో కూడా క్రియేటివ్ జీనియస్ అనిపించుకున్న ఈ లెక్కల మాస్టారు సినీ ప్రస్థానానికి నేటితో (మే 7) ఇరవై ఏళ్లు.

మే 7, 2004.. ‘ఆర్య’ సినిమా విడుదలైన రోజు. ఒన్ సైడ్ లవ్ అనగానే గంభీరమైన హీరోను చూసిన మనకు ఒన్ సైడ్ లవ్ లోని మజాను చూపించిన చిత్రం ‘ఆర్య’. ఒకవిధంగా లవ్ స్టోరీస్ లోనే ‘ఆర్య’ ఓ ట్రెండ్ సెట్టర్. అప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో బన్నీ ని చూపిస్తూ.. సినిమా ఆద్యంతం తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడు సుకుమార్. ఈ సినిమాలోని ఆర్య, గీతా పాత్రలను ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాడు.

‘ఆర్య’ సినిమాకి దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఈ సినిమాలోని ప్రతీ పాట హిట్టే. నేపథ్య సంగీతం మరో హైలైట్. ‘ఆర్య’తో మొదలైన సుకుమార్, దేవిశ్రీప్రసాద్ ల బంధం.. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తోనూ సుకుమార్ ఆ తర్వాత పలు సినిమాలు చేయడానికి దోహదం చేసిన చిత్రం ‘ఆర్య’. తొలిరోజుల్లో దిల్‌రాజుకి నిర్మాతగా భరోసా ఇచ్చిన చిత్రం ‘ఆర్య’.

‘ఆర్య’ సినిమా తెలుగులో మాత్రమే కాదు.. అనువాద రూపంలో మలయాళం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ గా ఓన్ చేసుకున్నారు మలయాళీ ప్రేక్షకులు. హిందీలోనూ ‘ఆర్య’ చిత్రం ‘ఆర్య కీ ప్రేమ్ ప్రతిగ్య’ పేరుతో డబ్ అయ్యింది. తమిళంలో ‘కుట్టీ’ పేరుతో ధనుష్ హీరోగా రీమేక్ అయ్యింది. ఇంకా.. పలు భాషల్లో ఈ చిత్రం రీమేక్ రూపంలో అలరించింది. ‘ఆర్య’ సినిమాకి సీక్వెల్ గానే ‘ఆర్య 2’ తెరకెక్కించాడు సుకుమార్.

Related Posts