హ్యాండ్సమ్ హీరో శ్రీకాంత్ బయోగ్రఫీ

మూడు దశాబ్దాలకు పైగా నట ప్రస్థానం. అందులో రెండు దశాబ్దాల పాటు కథానాయకుడిగా అలరించిన తీరు. అది హ్యాండ్సమ్ హీరో శ్రీకాంత్ సినీ జర్నీ. మార్చి 23, శ్రీకాంత్ పుట్టినరోజు.

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో రాణించడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. అలాగే ఏ నటుడైనా వంద సినిమాల్లో నటించడం అంటే చిన్న విషయం కాదు.. కానీ.. చాలా చిన్న పాత్రలతో పరిచయమై.. విలన్ గా మెప్పించి.. ఆ తర్వాత హీరోగా రాణించి.. ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ లో శెభాష్ అనిపించుకుని సెంచరీ కొట్టడం ఆషామాషీ విషయం కాదు.

ఆ రోజుల్లో అందరు కుర్రాళ్లలాగే శ్రీకాంత్ కూడా చిరంజీవి డ్యాన్సులు చూసి చిన్నప్పటి నుంచే సినిమా నటుడై పోవాలని ఫిక్స్ అయిపోయాడు. డిగ్రీ తర్వాత హైదరాబాద్ వచ్చి మధు ఫిలిం ఇనిస్టిట్యుట్ లో జాయిన్ అయ్యాడు. శిక్షణ పూర్తయిన తరవాత ఆవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఉషాకిరణ్ మూవీ నిర్మిస్తున్న చిత్రంలో 15 మంది కొత్త వాళ్ళు కావాలని అని తెలిసి వెళ్తే దర్శకుడు మోహన్ గాంధీ శ్రీకాంత్ ను ఎంపిక చేసాడు. ఆ విదంగా ‘పీపుల్స్ ఎన్ కౌంటర్’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు.

వెంటనే ‘మధురానగరిలో’ లో హీరోగా ఆవకాశం రావటంతో ఆ తరవాత కూడా హీరో అవకాశాలువస్తాయేమో అని ఎదురు చూసాడు కాని లాభం లేక పోయింది. అదే సమయంలో ఇ.వి.వి. సత్యనారాయణ విలన్ గా నటించమని కోరడంతో ‘వారసుడు’ సినిమాలో నటించాడు. ఆ తరవాత దాదాపు 13 సినిమాలలో విలన్ గా నటించాడు. వచ్చిన ప్రతి పాత్రతోనూ నటుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేశాడు.

ఫైనల్ గా వన్ బై టూ చిత్రంతో మళ్లీ హీరోగా ప్రమోట్ అయ్యాడు. వన్ బై టూ హీరోగా పెద్ద బ్రేక్ ఇవ్వలేదు. కానీ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన తాజ్ మహల్ మంచి విజయం సాధించి శ్రీకాంత్ ను హీరోగా నిలబెట్టింది. తాజ్ మహల్ కంటే ముందు కొన్ని సినిమాలు చేసినా అవంత పెద్ద విజయం సాధించలేదు. దీంతో హీరోగా శ్రీకాంత్ తొలి హిట్ తాజ్ మహల్ అనే చెప్పాలి. అయితే ఊహ తో చేసిన ఆమె సినిమా ఆ తర్వాత, అతని జీవితంలోకీ ఆమెను తీసుకువచ్చేసింది..

ఇండస్ట్రీలో విజయాలు రావడం కంటే ఆ విజయాలు మెమరబుల్ గా మిగలడం ఇంపార్టెంట్. అంటే తిరుగులేని బ్రేక్ అన్నమాట. అది రావడానికి కొంత టైమ్ పట్టినా శ్రీకాంత్ ను హీరోగా తిరుగులేని స్థానంలో నిలబెట్టాడు రాఘవేంద్రరావు. పెళ్లి సందడితో శ్రీకాంత్ కెరీర్ కు గొప్ప బ్రేక్
ఇచ్చాడు. దీని తర్వాత తను ఎలా ఉంటే ఆడియన్స్ కు ఇష్టం అన్న విషయం కూడా శ్రీకాంత్ కు అర్థమైంది. అందుకే ఆ తర్వాత ఈ తరహా ఫ్యామిలీ ఓరియంటెడ్ పాత్రలకే ఫిక్స్ అయిపోయి.. సూపర్ సక్సెస్ అయ్యాడు..

పెళ్లి సందడి సూపర్ హిట్ తర్వాత శ్రీకాంత్ వరుసగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. మరోవైపు జగపతి బాబు లాంటి హీరోలు కాంపీటీషన్ గా ఉన్నా.. తనకంటూ ప్రత్యేకత చూపించాడు. ముఖ్యంగా ఇవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకులు శ్రీకాంత్ ను బాగా ఎంకరేజ్ చేశారు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఆడియన్స్ లో ఈ కాంబినేషన్ పై క్రేజ్ ఉండేది.

శోభన్ బాబు తర్వాత ఇద్దరు భార్యల హీరోగా జగపతి బాబు సెటిల్ అయితే, అతనికి
దీటుగా లవర్ బాయ్ గా ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్ కూడా ఎదిగాడు.. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఎగిరే పావురమా శ్రీకాంత్ కు మరింత మంది అభిమానులను తీసుకువచ్చింది. జెడి చక్రవర్తితో కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మొత్తంగా హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిన ఎగిరే పావురమా శ్రీకాంత్ కెరీర్ ను మరో మెట్టు పైకి తీసుకువెళ్లింది.

?????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????

కెరీర్ పరంగా ఆహ్వానం, తారకరాముడు, మా నాన్నకు పెళ్లి, పండగ, గిల్లి కజ్జాలు ఇలా వరుస విజయాలతో దూసుకుపోయాడు. మధ్యలో కొన్ని యావరేజ్ సినిమాలున్నా.. మొత్తంగా శ్రీకాంత్ సినిమా అంటే సేఫ్ ప్రాజెక్ట్ అని నిర్మాతలు, శ్రీకాంత్ సినిమా అంటే చూడాల్సిందే అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు.

ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఎప్పుడూ ఆ చట్రంలోనే ఆగిపోలేదు. ట్రెండ్ ను బట్టి కథల్ని మార్చాడు.. కొన్నిసార్లు ఇమేజ్ ను కాదనుకునీ వెళ్లాడు. అలా చేసినవే చాలా బాగుంది, అమ్మో ఒకటో తారీఖు, తిరుమల తిరుపతి వెంకటేశా, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి సినిమాలు. ఇవన్నీ ఆయా ట్రెండ్స్ ను బట్టి శ్రీకాంత్ సెలెక్ట్ చేసుకున్న సినిమాలని చెప్పొచ్చు. అలాగే ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఆదరణ తగ్గడం కూడా ఓ కారణం అనుకోవచ్చు.

శ్రీకాంత్ తన సమకాలీకులైన హీరోలతో మల్టీస్టారర్స్ చేశాడు. అప్ కమింగ్ హీరోలతోనూ నటించాడు.. అలాగే సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు. ఓ రకంగా తనకంటూ ఓ ఇమేజ్ ఉన్న తర్వాత ఇలా విభిన్నమైన సినిమాల్లో వేర్వేరు హీరోలతో కలిసి నటించడం అంటే సాహసమే. కానీ శ్రీకాంత్ డేర్ చేశాడు. అందుకే అతని ఖాతాలో ఇన్ని డిఫరెంట్ మూవీస్ ఉన్నాయి.

వేగంగా సినిమాలు చేయడం వల్ల ఓ దశ దాటిన తర్వాత శ్రీకాంత్ ఎంచుకునే సబ్జెక్ట్స్ మొనాటనీగా మారాయి. దీంతో వరుసగా ఫ్లాపులు చుట్టుముట్టాయి. సినిమాలు చేయడం ఆగలేదు.. అలాగని వచ్చిన ఏ సినిమా కూడా ఎక్కువ రోజులు థియేటర్స్ లో ఆడలేదు. దీవించండి, కలిసి నడుద్దాం, మనసిస్తారా, ప్రేమసందడి, చూసొద్దాం రండి, డార్లింగ్ డార్లింగ్, ఓ చినదానా, ఆడుతూ పాడుతూతో పాటు మోహన్ బాబుతో చేసిన తప్పు చేసి పప్పుకూడుతో సహా 2001లోనే విడుదలైతే ఒకటీ అరా తప్పా అన్నీ ఫ్లాపులే..

వరుస ఫ్లాపుల టైమ్ లో కృష్ణ వంశీ ఖడ్గం శ్రీకాంత్ లోని కొత్త యాంగిల్ ను చూపించింది. అందరూ చెప్పుకునేదే అయినా ప్రేయసిని పోగొట్టుకున్న అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ గా శ్రీకాంత్ నటనకు ఫిదా కాని వారు లేరు. కంప్లీట్ సీరియస్ రోల్ ను సెటిల్డ్ గా పర్ఫార్మ్ చేసి శెభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత అతని కెరీర్ కొత్త టర్న్ తీసుకుంటుంది.

ఖడ్గం తర్వాత మళ్లీ కామెడీ, ఫ్యామిలీ అంటూ మరోసారి రొటీన్ రూట్ లోకే వెళ్లాడు. వాటిలో కొన్ని విజయాలున్నా.. మెల్లగా శ్రీకాంత్ లాంటి హీరోల హవాకు వారస హీరోలు బ్రేకులు వేస్తూ వచ్చారు. అప్పటి వరకూ నలుగురు స్టార్ హీరోలుంటే వారి తర్వాత శ్రీకాంత్, జగపతిబాబు లాంటి హీరోలుండేవారు.. కానీ ఈ ప్లేస్ ను కూడా వారస హీరోలు ఆక్రమించుకోవడంతో ఇమేజ్ కు తగ్గ కథలే కాదు.. ఓపెనింగ్స్ కూడా రావడం తగ్గింది..

హిట్లూ, ఫ్లాపులూ పక్కనబెడితే శ్రీకాంత్ మంచి ఆర్టిస్ట్. ఎన్నో సినిమాల్లో అతనిలోని అద్భుతమైన నటుడ్ని చూశాం. వ్యక్తిగానూ ఎవరి విషయంలోనూ టంగ్ స్లిప్ కావడం అనేది శ్రీకాంత్ కెరీర్ లో చూసి ఉండం. తొలినాళ్లలో ఎలా ఉన్నా శ్రీకాంత్ అంటే వివాదరహితుడు.. నటుడుగా తేడా వచ్చిన ప్రతిసారీ ప్రయోగం చేశాడు. అతను వైవిధ్యమైన ప్రయత్నాలు చేసిన ప్రతిసారీ ఆడియన్స్ ఆదరించారు. ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన, మహాత్మా అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్..

శ్రీకాంత్ లోని యాంగ్రీనెస్ ను ఆడియన్స్ కు చూపించిన కృష్ణవంశీ అతని వందో సినిమాకోసం మరో వైవిధ్యమైన కథతో వచ్చాడు. మహాత్మ సినిమాలో వీధి రౌడీ నుంచి మహాత్మున్ని ఆదర్శంగా తీసుకుని ఆ బాటలో సాగాలనుకునే యువకుడి పాత్రలో అతని నటన అసామాన్యం.

సెంచరీ తర్వాత రిలాక్స్ కాకుండా తనకు నచ్చిన, తనకోసం వచ్చిన కథల్లో హీరోగా నటిస్తున్నాడు.. హీరోగా చేస్తూనే.. గోవిందుడు అందరివాడేలే తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు.. తర్వాత సరైనోడులోనూ మంచి పాత్ర చేశాడు. ఫైనల్ గా తానూ జగపతిబాబు రూట్ లోకి వచ్చాడు. యుద్ధం శరణం సినిమాతో విలన్ గా మారాడు. కానీ సినిమా ఫ్లాప్ కావడంతో శ్రీకాంత్ విలనీ రిజిస్టర్ కాలేదు.

విలన్ గా కొత్త టర్న్ తీసుకున్న తర్వాత ఇతర భాషల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి శ్రీకాంత్ కు. మళయాలంలో మోహన్ లాల్ హీరోగా నటించిన విలన్ అనే సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటించాడు. అఖండ చిత్రంతో విలన్ రోల్స్ లోనూ శ్రీకాంత్ తనకు తానే సాటి అనిపించుకున్నాడు.

కోటబొమ్మాలి పి.ఎస్ సినిమాతో మరోసారి హీరోగా సత్తా చాటిన శ్రీకాంత్ ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. సో శ్రీకాంత్ హీరో అనే కాకుండా మంచి పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ సాగాలని మనమూ కోరుకుందాం.

Related Posts