చిరంజీవికి జోడీగా అనుష్క?

‘బాహుబలి‘ సిరీస్ తర్వాత సినిమాల జోరు మరీ తగ్గించేసింది అనుష్క. అందుకు ముఖ్య కారణం ‘సైజ్ జీరో‘ సినిమాకోసం బాగా లావవ్వడమే. ‘సైజ్ జీరో‘ కోసం లావు అయితే అయ్యింది కానీ.. ఆ తర్వాత తగ్గడంలో మాత్రం విఫలమయ్యింది. అందుకే.. ‘బాహుబలి‘ తర్వాత కేవలం ‘భాగమతి, నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ చిత్రాలు మాత్రమే చేసింది.

అనుష్క మరోసారి సినిమాల స్పీడు పెంచబోతుందట. ఇప్పటికే మలయాళంలో ఒక సినిమాకి కమిటైంది. మాలీవుడ్ స్టార్ జయసూర్య నటిస్తున్న ‘కథనార్‘ సినిమాలో కథానాయికగా నటిస్తుంది.

పీరియడ్ ఫాంటసీ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాతో పాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవితోనూ నటించే ఆఫర్ అందుకుందట అనుష్క.

గతంలో చిరంజీవి ‘స్టాలిన్‘ మూవీలో ఒక పాటలో మెరిసిన అనుష్క.. ఆ తర్వాత ‘సైరా.. నరసింహారెడ్డి‘లో కేమియోతో మురిపించింది. ఇప్పుడు చిరంజీవి-వశిష్ట కాంబోలో రూపొందుతోన్న మెగా 156 లో అనుష్క ఒక నాయికగా నటించబోతుందట.

ఈ చిత్ర నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ తో అనుబంధం రీత్యా కూడా ఈ మూవీలో నటించడానికి ఓ.కె. చెప్పిందట. అనుష్క తో పాటు ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, కాజల్ వంటి కథానాయికల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ముహూర్తాన్ని జరుపుకున్న మెగా 156 మూవీకి ‘విశ్వంభర‘ అనే టైటిల్ దాదాపు ఖాయమట.

Related Posts