టాలీవుడ్ నుంచి మరో ప్యాన్ ఇండియన్ స్పై

స్పై అనగానే సై అంటూ ఎగేసుకుని ఓకే చెబితే కాదు. అందులో స్పైసీ కంటెంట్ కూడా ఉందా లేదా అనేది చూసుకోవాలి. లేకపోతే రీసెంట్ ‘స్పై’ లా అయిపోతుంది పరిస్థితి.

అంటే నిఖిల్ సిద్ధార్థ్ కూడా చేశాడు కదా స్పై అనే సినిమా. అట్టా అన్నమాట. అంతకు ముందు అక్కినేని బుల్లోడు అఖిల్ కూడా ఏజెంట్ అన్నాడు. ఏజెంట్ లో యాక్షన్ ఉంది కానీ.. దాన్ని కలిపే కథే లేదు. ఆ ఏజెంట్ ను కూడా అబ్బే అనేశారు ఆడియన్స్.

అయినా ఇప్పుడు మరో స్పై వస్తున్నాడు. అది కూడా ప్యాన్ ఇండియన్ డ్రీమ్స్ తోనే. పైగా రీసెంట్ గానే ఈ డ్రీమ్ తో వెళ్లి దెబ్బయిపోయాడు. అయినా ఈ సారి ఏజెంట్ అవతారం ఎత్తి.. ప్యాన్ ఇండియన్ మార్కెట్ ను ఎత్తికుదేస్తా అనే రేంజ్ లో రాబోతున్నాడు. అతనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్.


కెరీర్ ఆరంభం నుంచి మాస్ హీరో అనిపించుకోవడమే లక్ష్యంగా కథలు కదుపుతూ వస్తున్నాడు సాయిశ్రీనివాస్. బట్ ఏదీ కలిసి రావడం లేదు. ఆ మధ్య రాక్షసుడు అనే రీమేక్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ వెంటనే మళ్లీ ఫ్లాపులు పడ్డాయి. అయినా తెలుగు ఛత్రపతిని హిందీలో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. బట్ ఈ సారి బలమైన కంటెంట్ తో వస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు.

అందుకే కామ్ గా పనిచేసుకుంటూ వెళుతున్నాడు. పని చెయ్.. రిజల్ట్ అదే వస్తుంది అనే కాన్సెట్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు, భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నభా నటేష్‌ హీరోయిన్.

ఈవిడితో ఇంతకు ముందు అల్లుడు అదుర్స్ అనే సినిమాలో నటించాడు శ్రీనివాస్. ఈ మూవీతో పాటు మరో ప్యాన్ ఇండియన్ లుక్ కథకు సైన్ చేశాడు. ఇంతకు ముందు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో పరంపర అనే వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది.

ఇది ఓ స్పై థ్రిల్లర్ అని చెబుతున్నారు. కంప్లీట్ ప్యాన్ ఇండియన్ లుక్ ఉన్న కథట ఇది. అందుకే వెంటనే ఎస్ చెప్పాడట సాయి శ్రీనివాస్. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ చిత్రం ఉండబోతోంది. త్వరలోనే ఈ స్పై ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. మరి ఈ స్పై అయినా ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తాడా లేదా అనేది చూడాలి.

Related Posts