తెలుగులోకి మరో మలయాళం హిట్ మూవీ?

ఈమధ్య మలయాళం నుంచి తెలుగులోకి వస్తోన్న సినిమాల సంఖ్య బాగా పెరుగుతోంది. ‘ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్‘ తర్వాత మరో మలయాళీ హిట్ మూవీని తెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మలయాళంలో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఫహాద్ ఫాజిల్. పలు అనువాద చిత్రాలతో పాటు ‘పుష్ప‘ సినిమాతోనూ తెలుగు ప్రేక్షకులకూ ఇతను బాగా సుపరిచితం.

ఫహాద్ లేటెస్ట్ మలయాళం మూవీ ‘ఆవేశం‘ ఏప్రిల్ 11న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బెంగళూరులో చదువుకునే ముగ్గురు కాలేజీ కుర్రాళ్ళు.. సీనియర్ల ర్యాగింగ్ వేధింపులకు గురవుతారు. ప్రతీకారంతో రగిలిపోయి, నగరంలో పేరుమోసిన రౌడీ రంగా సహాయం తీసుకుంటారు. అక్కడి నుంచి వారి జీవితం ఎలా మారిందనేదే ఈ కథ.

ఫహద్.. రంగా పాత్రలో అదరగొట్టాడనే రివ్యూస్ వస్తున్నాయి. యాక్షన్ సన్నివేశాల్లో అతని డేరింగ్ స్టంట్స్, హాస్య సన్నివేశాల్లో అతని టైమింగ్ చాలా బాగున్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకొచ్చే సన్నాహాలు జరుగుతున్నాయట. కొంతమంది టాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Related Posts