సెకండ్ వీక్ లో చతుర్ముఖ పోటీ

2023 సమ్మర్ టాలీవుడ్ కు బాగా నిరాశపరిచింది. అటు ప్రేక్షకులకు కూడా సరైన ఎంటర్టైన్మెంట్ దొరకలేదు. ఏ పెద్ద స్టార్ ఈ సమ్మర్ బరిలో లేపోవడం పెద్ద మైనస్ గా కనిపించింది. ఇక మే నెలతో సమ్మర్ సీజన్ దాదాపు ముగిసింది. పోనీ జూన్ అయినా ఆకట్టుకుంటుందా అంటే 2న వచ్చిన సినిమాలేవీ మెప్పించలేదు. ఇక సెకండ్ వీక్ లో కూడా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. వీటిలో రెండు సినిమాలు డబ్బింగ్ కావడం విశేషం. మిగిలిన రెండు స్ట్రెయిట్ మూవీస్ లో ఒకటి కంప్లీట్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అయితే మరోటి కంప్లీట్ ఎంటర్టైనర్. మరి ఈ జూన్ 2న విడుదలవుతోన్న ఆ చిత్రాలేంటో చూద్దాం..


విమానం
సముద్రఖని, మాస్టర్ ధృవన్ కీలక పాత్రల్లో నటించిన విమానం చిత్రంలో మీరా జాస్మిన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధన్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శివ ప్రసాద్ యానాల దర్శకుడు. వారాహి, జీ స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో మోస్ట్ ప్రామిసింగ్ అనిపించుకున్నారు. వికలాంగుడైన తండ్రి, బాలుడైన అతని కొడుకు మధ్య సాగే ఎమోషనల్ డ్రామాలా కనిపిస్తోందీ మూవీ. ట్రైలర్ మాత్రం చాలామందిని ఆకట్టుకుంది. ఈ విమానం జూన్ 9నుంచి థియేటర్స్ లో టేకాఫ్‌ కాబోతోంది.


అన్ స్టాపబుల్
బిగ్ బాస్ విన్నర్ విజే సన్ని, సప్తగిరి,నక్షత్ర, అక్షాఖాన్, పృథ్వీ, పోసాని, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా అన్ స్టాపబుల్. ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ తో వస్తోన్న సినిమా అని రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఒకప్పటి జంధ్యాల, ఇవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల్లోలాగా చాలామంది కమెడియన్స్ ఈ మూవీలో కనిపిస్తున్నారు. ట్రైలర్ మరీ గొప్పగా ఉందని చెప్పలేం కానీ.. చప్పగా మాత్రం లేదు. మంచి కామెడీ తోడైతే ఉన్న ఆర్టిస్టులంతా సత్తా ఉన్నవాళ్లే కాబట్టి ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఈ మూవీ కూడా 9నే విడుదల కాబోతోంది.


టక్కర్
ఒకప్పుడు లవర్ బాయ్ గా తెలుగు, తమిళ్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో సిద్ధార్థ్. బట్ కొన్నాళ్లుగా అతనికి సరైన హిట్టేలేదు. చివరగా తెలుగులో చేసిన మహా సముద్రం డిజాస్టర్ అయింది. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు టక్కర్ అనే చిత్రంతో వస్తున్నాడు. తమిళ్ లో రూపొందిన ఈ మూవీని తెలుగులో డబ్ చేశారు. కానీ అలా కాకుండా స్ట్రెయిట్ మూవీ అన్న ఫ్లేవర్ తెచ్చేందుకు ఎంటైర్ టీమ్ చాలా కష్టపడుతోంది. సిద్ధార్థ్ కూడా విపరీతమైన ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర చూస్తే మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సిద్ధూ ఇమేజ్ కు తగ్గట్టుగా లిప్ లాక్ లు, ఇంటిమేట్ సీన్స్ కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు కంటెంట్ కూడా ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ మూవీ రెండు తెలుగు సినిమాలకు పోటీగా జూన్ 9నే వస్తోంది.


ట్రాన్స్ ఫార్మర్స్ -రైజ్ ఆఫ్‌ ద బీస్ట్స్
వీటితో పాటు ట్రాన్స్ ఫార్మర్స్ -రైజ్ ఆఫ్‌ ద బీస్ట్స్ అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీ కూడా జూన్ 9నే విడుదలవుతోంది. ట్రాన్స్ ఫార్మర్స్ మూవీ సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి అభిమానులున్నారు. ట్రైలర్ సైతం ఆకట్టుకునేలానే ఉంది. అయితే ఇలాంటిసినిమాలు అర్బన్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి కాబట్టి మిగతా చిత్రాలకు పోటీ అనుకోలేం. బట్.. జూన్ సెకండ్ వీక్ లో నాలుగు సినిమాల మధ్య పోటీ ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. మరి ఈ పోటీలో విజేత ఎవరు అనేది చూడాలి.

Related Posts