800 చరిత్ర సృష్టించబోతోందా..

బయోపిక్ అనగానే చాలామంది విజయ గాథలే చూస్తారు. లేదా వారు సాధించిన విజయాల వెనక ఎంత కృషి ఉంది అనేది చూపిస్తారు. ఏవో కొన్నిసార్లు మాత్రం వారి సంఘర్షణ కనిపిస్తుంది. అనుకున్నది సాధించడానికి వారు దాటిన అవరోధాలు కనిపిస్తాయి. అలాంటి కోణంలో వచ్చే సినిమాలు అరుదు. అలాంటి అరుదైన చిత్రంగానే కనిపిస్తోంది “800”. ఇది ఒక బౌలర్ గా సాధించిన వికెట్ల సంఖ్య. శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్ దేశవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే ముత్తయ్య జీవితం గురించి ఇప్పటి వరకూ తెలియని ఎన్నో కోణాలు కనిపిస్తున్నాయి.

ఏసియన్ క్రికెట్ హిస్టరీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన క్రికెటర్ మరొకరు లేరేమో అనేంత గొప్పగా కనిపిస్తోందీ ట్రైలర్. నిజంగా అతని నేపథ్యం ఇంత దారుణంగా ఉందన్న విషయం చాలామందికి తెలియదు. అలాంటి ఎన్నో కోణాలను నిజాయితీగా ఆవిష్కరించే ప్రయత్నం ఈ సినిమాతో కనిపిస్తున్నట్టుగా ఉంది. ముత్తయ్య పాత్రలో మధుర్ మిట్టల్ నటించారు. అతను ముత్తయ్య పోలికలకు చాలా దగ్గరగా ఉన్నాడనే చెప్పాలి.ఎమ్ఎస్ శ్రీపతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ముత్తయ్య మురళీ ధరన్ సమగ్ర జీవిత కథలా కనిపిస్తోంది.


బయోపిక్ అంటే బాల్యం నుంచీ ఉంటుంది కదా.. అలా తమిళనాడు నుంచి శ్రీలంకకు వలస వెళ్లిన కుటుంబం ముత్తయ్య వారిది. అక్కడ వీరిని బానిసలకన్నా దారుణంగా చూస్తారు. ఒక క్యాంప్ లో ఉంటూ క్రికెట్ పై మక్కువ పెంచుకున్న అతను ఆ తర్వాత దేశమే గర్వించే క్రికెటర్ గా ఎలా ఎదిగాడు అనేది కథ. కానీ ఈ కథలో అల్లర్లు ఉన్నాయి, బాంబ్ పేలుళ్లు ఉన్నాయి, అతనిపై ‘చక్కర్’ అని అకారణంగా ముద్రవేసిన ఆస్ట్రేలియన్ ల దురాగతం ఉంది.. శ్రీలంక తమిళుల కోసం పోరాడిన ప్రభాకరణ్ ఎపిసోడ్ కూడా కనిపిస్తోంది. మొత్తంగా ఇది కేవలం శ్రీధరన్ విజయగాథ మాత్రమే కాదు. అతను జీవితంలో చూసిన, అనుభవించిన అనేక చారిత్రక సంఘటనలకు రికార్డ్ రూపంగానూ కనిపిస్తోంది. అన్నిటికీ మించి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ తో పాటు హృదయాలను ద్రవింప చేసే ఎమోషన్ ఉంది.

మరి ఇండియాలో క్రికెట్ బయోపిక్స్ లో ధోనీ మాత్రమే ఆకట్టుకుంది. ఇండియన్ కాకపోయినా.. క్రికెటర్ గా ముత్తయ్య మురళీధరన్ కథ ఇండియాలోనూ ఓ చరిత్ర సృష్టించబోతోంది అనేలా ఉంది ట్రైలర్.

Related Posts