రక్తం చిందించిన అల్లరి నరేష్

అల్లరి నరేష్ అనే తన కామెడీ ఇమేజ్ ను మెల్లమెల్లగా పోగొట్టుకుంటున్నాడు. ఫస్ట్ మూవీనే ఇంటి పేరుగా పెట్టుకున్నా.. కామెడీ హీరో అన్న ట్యాగ్ వచ్చినా.. తన వరకూ వచ్చిన ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ లోనూ సత్తా చాటాడు. అయితే కొన్నాళ్లుగా అతని సినిమాలేవీ పెద్దగా ఆడటం లేదు. మరోవైపు కామెడీ సినిమా అన్న మాటకు ప్రేక్షకుల్లో రకరకాల అర్థాలు వచ్చాయి. ఇటు ఒకప్పటి జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఎస్వీ కృష్ణారెడ్డి, ఇవివి సత్యనారాయణల్లాగా కామెడీ చిత్రాలు తీసే ప్రత్యేక దర్శకులు లేరు పరిశ్రమలో. దీంతో అనివార్యంగా తన ఇమేజ్ ను దాటి కొత్త కథలు చెప్పడానికే సిద్ధమయ్యాడు నరేష్‌. ఆ క్రమంలో వచ్చిందే నాంది. న్యాయవ్యవస్థలోని ఓ ముఖ్యమైన సెక్షన్ ను అత్యంత సీరియస్ గా డిస్కస్ చేసిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా బాగా ఆకట్టుకుంది. ఇకపైనా సీరియస్ కథలే అని కాకుండా కంటెంట్ కు పెద్ద పీట వేసే దర్శకులకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు నరేష్. అలా వస్తోన్న మరో సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా నరేష్‌ కు 59వది.

ఏఆర్ మోహన్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం.దాదాపు రెండె నెలల పాటు మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరిపారట. అందుకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ఆ అడవుల్లో వారు ఎంత శ్రమ పడ్డారు.. ఎన్ని అవరోధాలు దాటుకున్నారు.. మంచి లొకేషన్స్ కోసం కిలోమీటర్ల కొద్దీ అడవుల్లో ఎలా నడిచారు అనే వివరాలతో ఉన్న ఈ వీడియో చివర్లో ఓ చెట్టు నుంచి కొమ్మ జారి నరేష్‌ మొహం పై పడింది. అయితే సీన్ కాదు. నిజంగానే జరిగింది. నరేష్‌ కంటికి దగ్గరలో పెద్ద గాయం కూడా అయింది. దాన్ని క్లాత్ తో తుడిచేస్తున్నట్టుగా కనిపించిన ఈ వీడియో చూస్తే.. వీళ్లు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారు అనేది తెలుస్తుంది. ముఖ్యంగా నరేష్‌ తన పాత్ర కోసం ఈ సినిమాల నిజం రక్తం చిందించాడన్నది అర్థమౌతుంది.నరేష్‌ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా ప్రవీణ్‌, వెన్నెల కిశోర్, సంపత్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఓ సీరియస్ ఇష్యూను సినిమాటిక్ గా డిస్కస్ చేస్తూ సాగే కథగా ఈ చిత్రాన్ని చెబుతున్నారు. మరి ఇది కూడా నాందిలా మంచి విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి. మరోవైపు నరేష్‌ ఈ మూవీతో పాటు సభకు నమస్కారం అనే చిత్రంలోనూ నటిస్తున్నాడు. బట్ ఆ సినిమాకు సంబంధించిన వివరాలు పెద్దగా తెలియడం లేదు. తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేక.. ఇంకేదైనా రీజన్ ఉందా అనేది తెలియాల్సి ఉంది.

Related Posts