నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకి నారాయణ్, సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, శుభలేక సుధాకర్ తదితరులు
సినిమాటోగ్రఫి: మది
సంగీతం: సంతోష్ నారాయణన్
నిర్మాత: శివ మేక
రచన, దర్శకత్వం: మహి వి. రాఘవ్
విడుదల తేదీ: 08-02-2024
టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ పొలిటికల్ బయోపిక్ ‘యాత్ర 2’. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ చిత్రం రూపొందితే.. దానికి కొనసాగింపుగా ‘యాత్ర 2’ తెరకెక్కింది. 2019 ఫిబ్రవరి 8న ‘యాత్ర‘ విడుదలైతే.. సరిగ్గా ఐదేళ్లకు ఈ ఫిబ్రవరి 8న ‘యాత్ర 2‘ విడుదలైంది. వైఎస్సార్ మరణం.. ఆ తర్వాత జగన్ ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు.. 2009 నుంచి 2019 వరకు ఏపీలో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర 2‘ ఎలా ఉంది? అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తోందా? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.
కథ
వైఎస్ రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) తన కొడుకు జగన్ (జీవా)ని 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా నిలబెడుతున్నాను అని ప్రజలకు పరిచయం చేయడంతో ఈ కథ మొదలవుతుంది. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అవ్వడం.. ఆ తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరుగుతుంది. వైఎస్సార్ మరణం అనంతరం ఆయన తనయుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చేసిన ఓదార్పు యాత్ర ఎలా సాగింది? తదనంతర పరిణామాలు ఏంటి? అనేదే ‘యాత్ర 2‘ కథాంశం.
విశ్లేషణ
బయోపిక్స్ విషయంలో ఫిల్మ్ మేకర్స్ ఉన్నది ఉన్నట్టు చూపించే కంటే.. దాన్ని తెరపైన ప్రేక్షకులకు రక్తి కట్టించే విధంగా చిత్రీకరించడంలోనే విజయం ఉంటుంది. అదే ఈ చిత్రంకోసం డైరెక్టర్ మహి వి.రాఘవ్ పాటించాడు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుగా వై.ఎస్.జగన్ రాజకీయాల్లోకి రావటానికి కారణమేంటనే అంశాన్ని చిన్నహార్ట్ టచింగ్ సన్నివేశంతో చూపించాడు.
అయితే.. జగన్ రాజకీయ పార్టీకి బలం చేకూర్చేలా ఎక్కువ సన్నివేశాలను తీర్చిదిద్దారు. జగన్ ని ఎదగనివ్వకుండా చేయాలి? అని సోనియా అనుకొన్నట్టు, అక్రమ ఆస్తుల కేసులో జగన్ ని ఇరికించమని చంద్రబాబు సోనియాకే సలహా ఇచ్చినట్టు చూపించడం వంటి సన్నివేశాలు
వాస్తవికతను ప్రశ్నించేలా ఉన్నాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటుల విషయానికొస్తే.. మొదటి భాగం ‘యాత్ర‘లో వైఎస్సార్ గా ఆ పాత్రలో జీవించాడు మమ్ముట్టి. సీక్వెల్ లోనూ అదే పాత్రలో కనిపించాడు. కనిపించింది కాసేపే అయినా.. మమ్ముట్టి మరోసారి వైఎస్సార్ గా జీవించాడని చెప్పొచ్చు. వై.ఎస్.జగన్ గా జీవా సరిగ్గా సరిపోయాడు. జీవా బాడీ లాంగ్వేజ్ జగన్ పాత్రకు పర్ఫెక్ట్ గా సూటయ్యింది. ‘నేను విన్నాను-నేను ఉన్నాను’ అంటూ జగన్ పాత్రలో జీవా చెప్పే డైలాగ్స్ కి థియేటర్లో మంచి అప్లాజ్ వస్తోంది.
బయోపిక్ అంటేనే డాక్యుమెంటరీలా ఉంటుంది. అయితే.. ఈ సినిమాలో ఎమోషన్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు డైరెక్టర్ మహి. ప్రతీ సన్నివేశంలోనూ వైఎస్సార్ అభిమానులు కనెక్ట్ అయ్యేలా భావోద్వేగాలను పండించడంలో సఫలీకృతుడయ్యాడని చెప్పొచ్చు. ఈ సినిమాలోని డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటాయి. ‘నువ్వు మా వైఎస్సార్ కొడుకువన్న మాకు నాయకుడిగా నిలబడన్నా’ అంటూ ఓ అంధుడు చెప్పే మాటలు.. , చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాటని తపని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తు పెట్టుకుంటే చాలన్న’ అనే డైలాగ్స్ ఇంప్రెస్సివ్ గా ఉన్నాయి.
టెక్నికల్ గా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కూడా బాగున్నాయి. సంతోష్ నారాయణన్ అందించిన పాటలు.. నేపథ్య సంగీతం సినిమాని మరో మెట్టు ఎక్కించాయి. సినిమాటోగ్రాఫర్ మది విజువల్స్ బాగున్నాయి. సినిమా కాన్వాస్ కు తగ్గట్టుగానే నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
చివరగా
మొత్తంగా.. పొలిటికల్ బయోపిక్ ‘యాత్ర 2‘ వైఎస్సార్ అభిమానులకు, జగన్ అభిమానులకు ఓ విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. మరి.. మిగతా పార్టీలను అభిమానించే అభిమానులు ఈ చిత్రాన్ని ఎంతవరకూ ఆదరిస్తారనేది చూడాలి.