సమంత యశోద మూవీ రివ్యూ

రివ్యూ : యశోద
తారాగణం : సమంత, ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, సంపత్ రాజ్, మురళీశర్మ, శతృ, రావు రమేష్‌ తదితరులు
ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్‌
సినిమాటోగ్రఫీ : ఎమ్ సుకుమార్
సంగీతం : మణిశర్మ
నిర్మాత : శివలెంక కృష్ణ ప్రసాద్
దర్శకులు : హరి – హరీష్‌

కొన్నాళ్లుగా సమంత ఏం చేసినా హాట్ టాపిక్ అవుతోంది. అందుకు కారణాలేంటో అందరికీ తెలుసు. ఇక సినిమాల పరంగా జాను తర్వాత తను మళ్లీ కొత్త మూవీ ఏదీ చేయలేదు. దీంతో ఇప్పుడు వచ్చిన యశోద చిత్రంపై అందరి దృష్టి ఉంది. థ్రిల్లర్ మూవీ అని ముందే చెప్పడం.. సరిగ్గా రిలీజ్ కు వారం రోజుల ముందే సమంత తనకు ఓ అరుదైన వ్యాధి వచ్చిందని చెప్పడం అంతా కలిపి ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే అని ఫిక్స్ అయ్యేలా చేసింది. బట్.. సినిమాను నిలబెట్టేది కంటెంట మాత్రమే. మరి ఆ కంటెంట్ యశోదలో ఉందా.. వాళ్లు చెప్పినంత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయా లేదా అనేది చూద్దాం.

కథ :
యశోద(సమంత) ఓ బస్తీలో నివసిస్తూ డెలివరీ గాళ్ గా పనిచేస్తుంది. తనకో చెల్లి ఉంటుంది. ఆమెకు ఓ పెద్ద వ్యాధిసోకుతుంది. అది నయం కావాలంటే చాలా డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం చూస్తోన్న టైమ్ లో కొందరు సరోగసీకి ఒప్పుకుంటే భారీ అమౌంట్ ఇస్తామని చెబుతారు ఈవా అనే ఓ సరోగసీ ఏజెన్సీ వారు. చెల్లి కోసం పెళ్లికాకుండానే తల్లి కావడానికి ఒప్పకుంటుంది. అయితే సరోగసి తీసుకువెళ్లేవారు.. డెలివరీ అయ్యే వరకూ తమతోనే ఉండాలన్న రూల్ పెడతారు. ఒప్పుకుని అక్కడికి వెళుతుంది. అక్కడ తనతో పాటు తనలాగే డబ్బు అవసరం ఉన్న చాలామంది కనిపిస్తారు. వారితో స్నేహం చేస్తూనే అక్కడ ఇంకేదో జరుగుతుందన్న విషయం కనిపెడుతుంది యశోద. అది తెలుసుకునే క్రమంలో కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తాయి..? అవేంటీ..? ఈవా కంపెనీని ఎవరు రన్ చేస్తున్నారు..? దీని వెనక ఇంకేదైనా మోటివ్ ఉందా..? యశోద తనతో పాటు ఉన్నవారిని కాపాడిందా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ :
థ్రిల్లర్ సినిమా అనగానే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. వాటిని దాటకుండానే రాసుకున్న కథ ఇది. కథనం కూడా అంతే గ్రిప్పింగ్ గా కనిపిస్తుంది. ఓ సాధారణ యువతిగా వెళ్లిన యశోద అసాధారణమైన పోరాటంతో ఓ పెద్ద మాఫియాను పట్టుకోవడం అనే పాయింట్ లో స్క్రీన్ ప్లే గ్రాఫ్ పెరుగుతూనే పోతుంది. కానీ.. వాళ్లు చెప్పినంత గొప్ప థ్రిల్స్ కానీ, అనూహ్యమైన మలుపులు కానీ కనిపించవు. అయినా సినిమా ఏ మాత్రం బోర్ కొట్టకుండా సాగిపోతుంది.


ఇప్పటి వరూ సరోగసీ అంటే మనకో ఐడియా ఉంది. కానీ దీని వెనక అందంగా కనిపించాలి అనే ఆడవారి ఆరాటంతో సాగించే భారీ మాఫియా ఉంటుందనీ.. కేవలం కొంతమంది అత్యంత సంపన్న మహిళల అందాలను మెరుగు పరచుకోవడం కోసమే.. కొన్ని వందల మంది పేదల ప్రాణాలు పోతున్నాయని చెప్పడం మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది. ఇప్పటి వరకూ వచ్చిన సరోగసీ చిత్రాలకు పూర్తి భిన్నమైన పాయింట్ ఈ సినిమాలో ఇదే. అసలు ఈ కోణంలో రీసెర్చ్ చేసి.. ఓ బలమైన పాయింట్ ను కన్విన్సింగ్ గా చెప్పిన దర్శకుల ప్రయత్నం అభినందనీయం. అఫ్‌ కోర్స్ ఇలాంటి కథలను నమ్మాలంటే నిర్మాతకు గట్స్ ఉండాలి. ఆ విషయంలో శివలెంక కృష్ణ ప్రసాద్ గారి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.


విశేషం ఏంటంటే.. ఈ కథ కేవలం సరోగసీ, అందం అనే పాయింట్ చుట్టూనే కాదు.. సినిమా ఆరంభంలోనే జరిగే ఓ మర్డర్ మిస్టరీని ఛేదించే కోణంలో కూడా సాగుతుంది. అంటే ఇటు ఈవా సెంటర్ లో ఏం జరుగుతుందీ అనే సస్పెన్స్.. అటు మర్డర్ చేసింది ఎవరు అన్న ఇన్వెస్టిగేషన్ కలిపి.. ఫస్ట్ హాఫ్‌ మొత్తం వెరీ గ్రిప్పింగ్ గా సాగుతుంది. అసలు ఫస్ట్ హాఫ్‌ చూడగానే బ్లాక్ బస్టర్ అనే మైండ్ సెట్ కు వచ్చేస్తాం. అదే టైమ్ లో అసలు కథ మొదలుపెట్టడానికి కూడా ఫస్ట్ హాఫ్ అంతా టైమ తీసుకోవడం బాలేదు. ముఖ్యంగా ఈవా హౌస్ లో అమ్మాయిల మధ్య సాగే ర్యాగింగ్ తరహా సీన్స్ అస్సలు నప్పలేదీ కథకి. అక్కడ వచ్చే పాట కూడా స్పీడ్ బ్రేకర్ లా ఉంది.


ఇక సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలవుతుంది. ఈవా కేంద్రంలో ఏం జరుగుతుందీ అనే క్రమంలో యశోద పాత్ర ఒక్కొక్క అంశాన్నీ తెలుసుకుంటూ.. తనపై జరిగే దాడులను తిప్పి కొడుతూ.. ఓ మార్షల్ ఆర్ట్స్ తెలిసినదానిలా ఫైట్స్ చేస్తుంటే.. అప్పటికే తన పాత్రపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అయితే సెకండ్ హాఫ్‌ లో వచ్చే వరలక్ష్మి శరత్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ ఈ సినిమాకు ప్రాణం. ఆమె పాత్ర, నటన భయం కలిగిస్తాయి. మనుషులు ఇలా కూడా ఉంటారా అని కాదు.. ఉన్నారు కదా అని తెలిసిపోతుంది. అందంగా కనిపించాలనుకునేవారి ఆరాటాన్ని డబ్బు చేసుకోవాలని అత్యంత క్రూరమైన మాఫియాకు తెరలేపిన కొందరి కథే ఈ యశోద.


ఇక క్లైమాక్స్ బాగా సాగదీసినట్టుగా ఉంది. చివర్లో పోకిరి చిత్రాన్ని గుర్తుకు తీసుకురావడంతో వారు సమంతకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది తెలిసిపోతుంది. సమంతను కేవలం స్లమ్ గాళ్ గానే ఉంచినట్టైతే పాత్ర ఔచిత్యం మరింత గొప్పగా కనిపించేది. దీనికి అనవసరంగా పోకిరి టైప్ లో మాస్ టచ్ ఇవ్వడంతో తేలిపోయింది. అక్కడక్కడా స్పీడ్ బ్రేకర్స్ లా కనిపించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్.. ఇది థ్రిల్లర్ సినిమాలను విపరీతంగా ఇష్టపడేవారికి అంత గొప్పగా నచ్చదు అని కూడా చెప్పొచ్చు.
యశోద పాత్రలో మరొకరిని ఊహించుకునే ఛాన్స్ ఇవ్వలేదు సమంత. లేడీ ఓరియంటెడ్ పాత్రలో రెచ్చిపోయింది. తన ఫైట్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఫ్యామిలీ మేన్2 సిరీస్ ఎక్స్ పీరియన్స్ ఈ పాత్రకు ఉపయోగపడినట్టుంది. ఇది తన కెరీర్ లోనే బెస్ట్ రోల్. జయమ్మ తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ కు ఇది మరో మెమరబుల్ రోల్. నటనతో అదరగొట్టింది. ఉన్నిముకుందన్ పాత్ర ఖచ్చితంగా షాక్ ఇస్తుంది. రావు రమేష్‌ తనదైన విరుపులతో సీరియస్ సీన్స్ లోనూ హ్యూమర్ పండించే ప్రయత్నం చేశాడు. మిగతా పాత్రల్లో సంపత్ పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. మురళీశర్మది రొటీన్ రోల్. ఆయనా బాగా చేశాడు. శతృ పాత్ర సైతం మెప్పిస్తుంది.

టెక్నికల్ గా మణిశర్మ నేపథ్య సంగీతం హైలెట్. అంతకు మించి సుకుమార్ సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అది చాలా పరిమితమైన లొకేషన్ లో చేసిన సినిమా. ఇలాంటప్పుడు సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ ప్రేక్షకుడికి రాకూడదు అంటే సినిమాటోగ్రాఫర్ కు సెన్స్ ఉండాలి. ఆ సెన్స్ లో సుకుమార్ లో చాలా ఉంది. ఇక ఆర్ట్ డైరెక్టర్ అద్భుతమైన పనితీరు వల్ల.. ఈవా కేంద్రలో మనం కూడా ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది. ఎడిటింగ్ పరంగా ఇప్పటికే చాలా కట్ చేశారు అన్నారు. బట్ ఇంకా ఎడిట్ చేయొచ్చు. ముఖ్యంగా యశోద చెల్లి పాత్రకు వచ్చే ఫ్లాష్ బ్యాక్. నిర్మాణ విలువలు చాలా చాలా రిచ్ గా ఉన్నాయి. కాస్ట్యూమ్స్, డైలాగ్స్ మెప్పించాయి.


హరి – హరీష్‌ ద్వయం దర్శకులుగా ఒక్కో సినిమాకు చాలా చాలా గ్యాప్ తీసుకుంటారు. ఇంతకు ముందు తమిళ్ లో మూడు సినిమాలు చేశారు. దాదాపు ఏడెనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఈ కథతో వచ్చారు. తెలుగులో తొలి సినిమా అయినా మనవారికి ఓ కొత్త కాన్సెప్ట్ ను సరికొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. ఇద్దరిదీ బెస్ట్ కో ఆర్టినేషన్ అని తెరపై కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇది కంప్లీట్ ఫ్యామిలీ మూవీ.

ఫైనల్ : సమంత ఒన్ విమెన్ షో

రేటింగ : 3.25/5

                - యశ్వంత్ బాబు. కె

Related Posts