విరాటపర్వం కల్ట్ క్లాసిక్ అవుతుందా..?

14యేళ్ల వనవాసం తర్వాత పాండవులు ఒక యేడాది పాటు చేసింది అజ్ఞాతవాసం.. అదే విరాటపర్వం. ఆ విరాటపర్వంలోనే ఐదుగురు భర్తలు ఉన్నా.. ద్రౌపది కీచకుడి చేతిలో దారుణ అవమానానికి గురైంది. ఆ నేపథ్యం కాదు కానీ.. అరణ్యంలో సాగే అన్నల కథగా వస్తోన్న సినిమా విరాటపర్వం. నీదీనాదీఒకేకథ చిత్రంలో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన వేణు ఊడుగుల డైరెక్షన్ లో రూపొందిన సినిమా ఇది. ఈ నెల 17న విడుదల కాబోతోంది. సాయి పల్లవి, రానా, ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీపై ముందు నుంచీ భారీ అంచనాలున్నాయి. విడుదల అనుకున్నదానికంటే చాలా చాలా ఆలస్యం అయినా ఆ అంచనాలు తగ్గకుండా మెయిన్టేన్ చేయడంలో మూవీ టీమ్ సక్సెస్ అయింది. కొన్నాళ్లుగా సాగుతోన్న ప్రమోషన్స్ కూడా మరింత హైప్ పెంచాయి. ఈ నేపథ్యంలో అసలు సినిమా ఎలా ఉండబోతోంది అనేది ఓ అంచనాకు రావొచ్చు అనేలా ఉన్నాయి ఈ ప్రమోషన్స్.

సాయి పల్లవి వెన్నెల పాత్రలో కనిపించబోతోన్న ఈ మూవీ ఓ రకంగా బయోపిక్ లాంటిది అని చెప్పొచ్చు. 1990లలో ఖమ్మం జిల్లా నుంచి నక్సలిజం ప్రేమతో ఆ సాహిత్యానికి, కళలకు ఆకర్షితురాలైన సరళ అనే అమ్మాయి కథ ఇది. ఆ కథను సినిమాటిక్ గా మలచి కమర్షియల్ యాంగిల్స్ ను జోడించారు. సరళ( సినిమాలో వెన్నెలగా మార్చారీ పేరును) ప్రేమలో పడ్డ సాహిత్యానికి ప్రతినిధిగా రానా నటించాడు. అలా అతని సాహిత్యంతో పై ప్రేమతో అడవికి వెళ్లిన ఆమె అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసింది. నక్సలైట్స్ వరకూ చేరడానికి ఎన్ని సమస్యలు ఎదుర్కొంది అనేది ఇంట్రెస్టింగ్ గా సాగే కథ అని చెబుతున్నారు. అయితే ఎన్నో ఆశలు, ఆశయాలతో అడవిలో అడుగుపెట్టిన వెన్నెలకు అక్కడ అంత గొప్ప ఆదరణ దక్కదు. దీంతో ఇటు పోలీస్ లు, అటు నక్సల్స్ మధ్య మానసికంగా నలిగిపోతున్నా.. తను ప్రేమించిన సాహితీకారుడు రవన్న ను అట్టిపెట్టుకుని ఉంటుంది. అయినా చివర్లో ఆమ జీవితం విషాదాంతం అవుతుంది. అదెలా.. ఎందుకు విషాదం అయింది అనేది వెండితెరపైనే చూడాల్సిన అంశం.

ఇప్పటికే కొన్ని ప్రివ్యూస్ వేశారీ చిత్రానికి. అందరి నుంచి అద్భుతమైన అప్లాజ్ వస్తోంది. ముఖ్యంగా దర్శకుడు వేణు ఊడుగుల తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించబోతోన్న దర్శకుడు అవుతాడు అనే మాటలు బాగా వినిపిస్తున్నాయి. తమిళ్ లో ఓ పా రంజిత్, వెట్రిమారన్, మారి సెల్వరాజ్ స్థాయిలో సరికొత్త సంచలనం సృష్టించే సత్తా ఉన్న దర్శకుడు అవుతాడు అని మాత్రం అందరూ చెబుతున్నారు. నిజమే.. జీవితాలను కథలుగా చెప్పడం అందరికీ చేత కాదు. చెప్పగలిగే వాళ్లను ఖచ్చితంగా ప్రోత్సహించాలి. అలాంటి అర్హత వేణు ఊడుగులలో కనిపిస్తోంది. అందుకే నా వ్యక్తిత్వమే నా సినిమా అని చెప్పగలిగేంతటి పరిణతితో అతను మాట్లాడుతున్నాడు. మరి ఈ విరాటపర్వం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో కానీ.. వేణు మాత్రం సెన్సేషన్ అవుతాడు అంటున్నారు.

Related Posts