Ravi teja : రవితేజ దూకుడుకు కారణం ఏంటీ..?

సినిమా తీసి చూడు రిలీజ్ చేసి చూడు అన్నారు సినీ పెద్దలు. ఇవాళా రేపూ సినిమాలు తీయడం కంటే వాటిని రిలీజ్ చేయడమే పెద్ద టాస్క్. ముఖ్యంగా చిన్న సినిమాలకు. అయితే పెద్ద సినిమాలకు ప్రమోషన్స్ అనేవి పెద్ద టాస్క్ లు. సినిమా ఆరంభం నుంచే ఆసక్తిని పెంచాలి. మొదటి షెడ్యూల్ నుంచే కంప్లీట్ అప్డేట్స్ ఇస్తుండాలి. ఎప్పటికప్పుడు ఏదో ఒక లుక్ తో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో ఉంటుండాలి. లేదంటే ఎంద పెద్ద స్టార్ అయినా పట్టించుకునే పరిస్థితి లేదిప్పుడు. అందుకే మినీ హీరో అయినా మెగా హీరో అయినా ప్రమోషన్స్ కీలకం అయ్యాయి. ఈ క్రమంలోనే ఎప్పుడో దసరాకు రావాల్సిన తన సినిమా కోసం మాస్ మహరాజ్ రవితేజ ఇప్పటి నుంచే స్ట్రాంగ్ ప్రమోషన్స్ తో దూసుకుపోతున్నాడు.

ఇంతకు ముందు దొంగాట, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త అనే చిత్రాలు రూపొందించిన వంశీ డైరెక్షన్ లో రూపొందిన టైగర్ నాగేశ్వరరావు కోసం రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇది మాస్ రాజాకు ఫస్ట్ ప్యాన్ ఇండియన్ మూవీ కావడం విశేషం.


1970ల ప్రాంతంలో స్టూవర్ట్ పురం ఏరియాలో అత్యంత ప్రసిద్ధి చెందిన నాగేశ్వరరావు అనే దొంగ కథగా వస్తోన్న ఈ చిత్రాన్ని పరిచయం చేయడానికే పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసింది టైగర్ నాగేశ్వరరావు టీమ్. ఇందుకోసం ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో టైగర్ నాగేశ్వరరావు వాయిస్ ఓవర్ తో పరిచయం చేయించబోతున్నాడు. ఈ మొత్తం ఈవెంట్ ను రాజమండ్రిలో నిర్వహించబోతున్నారు.తమిళ్ లో కార్తీ, మళయాలంలో దుల్కర్ సాల్మన్, కన్నడలో శివరాజ్ కుమార్, హిందీలో జాన్ అబ్రహాంతో వాయిస్ ఓవర్ చెప్పించిన టీమ్ తెలుగులో విక్టరీ వెంకటేష్ తో సినిమా పరిచయం చేయబోతున్నారు. నిజానికి ఈ ప్రక్రియ కొత్తదేం కాదు. కానీ సినిమా రిలీజ్ కు చాలా రోజుల ముందే ఇలా చేయడం మాత్రం కొత్తే. రవితేజ సరసన గాయత్రి భరద్వాజ్, నూపుర్ సనన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రలో రేణూదేశాయ్ ఓ కీలక పాత్ర చేస్తుండట విశేషం.


మరి రవితేజ ఇంతలాఈ సినిమా గురించి జాగ్రత్త పడటానికి కారణాలు లేకపోలేదు. అతని గత చిత్రం రావణాసుర బాక్సాఫీస్ వద్ద దారుణంగా పోయింది. పైగా ఈ చిత్రానికి తనే ఓ నిర్మాత కూడా. అంతకు ముందే ధమాకా, వాల్తేర్ వీరయ్యతో మంచి విజయాలు అందుకున్న అతనికి రావణాసుర ఫ్లాప్ షాక్ ఇచ్చింది.

ఇక టైగర్ నాగేశ్వరరావును దసరా బరిలో అక్టోబర్ 20న విడుదల చేయబోతున్నారు. అయితే ఆ టైమ్ లో ఈ టైగర్ కు చాలా పోటీయే ఉంది. అక్టోబర్ 19న తమిళ్ సూపర్ స్టార్ విజయ్-లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన లియో వస్తోంది. 20న రామ్ – బోయపాటి సినిమాతోపాటు బాలయ్య – అనిల్ రావిపూడి మూవీ కూడా అదేటైమ్ కు విడదలవుతోంది. అంటే పోటీ భారీగానే ఉంటుంది. మరి ఈ భారీ పోటీని తట్టుకోవాలంటే ప్రమోషన్స్ ను కూడా ఇలా భారీగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా..? అందుకే రవితేజ చాలా ముందు నుంచే దూకుడుగా కనిపిస్తున్నాడన్నమాట.

Related Posts