మెల్లగా తన పేరు ముందు ఉన్న అల్లరి ఇమేజ్ నుపూర్తిగా చెరిపేసుకుంటున్నాడు నరేష్. ఒకప్పుడు కామెడీ హీరోగా రాణించినా.. ఇప్పుడు ఆ పోస్ట్ కు కాలం చెల్లింది. అందుకే తనదైన శైలిలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా వచ్చిన నాంది బాగా వర్కవుట్ అయింది. ఇప్పుడు ఉగ్రం కూడా కొత్తగానే చూపించింది.
అయితే ఉగ్రంతో పాటు విడుదలైన రామబాణం చిత్రానికి ఏ మాత్రం పాజిటివ్ టాక్ రాలేదు. అటు మౌత్ టాక్ కూడా గొప్పగా ఏం లేదు. దీంతో ఉగ్రం మరీ గొప్ప సినిమా కాకపోయినా అనుకోకుండా రామబాణం నెగెటివ్ టాక్ వీరికి అదనంగా కలిసొచ్చింది. అంతే కాక ఈ చిత్రంలో ఉన్న మరికొన్ని ప్లస్ లు కూడా ఉగ్రంను బాక్సాఫీస్ వద్ద నిలబెట్టే అవకాశాలున్నాయి.
ప్రధానంగా అల్లరి నరేష్ నటన ఈ చిత్రానికి చాలా పెద్ద హైలెట్. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎక్కడా అతని గత ఇమేజ్ కనిపించలేదు. సినిమాగా మరీ గొప్పగా లేకపోయినా కొన్ని సన్నివేశాలు మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. హాస్టల్ లో అమ్మాయిల ఎపిసోడ్.. నలుగురు కుర్రాళ్లను ఎన్ కౌంటర్ చేసే ఎపిసోడ్ తో పాటు ఇంటర్వెల్ తర్వాత కథనం ఆకట్టుకుంది. ఇక ఎప్పుడైతే హిజ్రాల మేటర్ ఎంటర్ అవుతుందో .. అక్కడి నుంచి మరింత ఇంట్రెస్టింగ గా మారుతుంది. ఇవన్నీ ఎపిసోడ్స్ గా ఉగ్రం కు ఎసెట్ అవుతున్నాయి.
దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం ఏమంత కొత్తది కాదు. ఆల్రెడీ వచ్చిన యశోద చిత్రంలో ఇంచుమించు ఇదే థీమ్ కనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ ఫైట్ మాత్రం రక్తం ఏరులై పారేలా చేసింది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ను కాస్త ఇబ్బంది పెట్టొచ్చేమో కానీ.. ఓవరాల్ గా రామబాణంతో పోలిస్తే ఉగ్రం కొంత వరకూ బెటర్ అనిపించుకుంది.
అలాగే నరేష్ ఏదైతే తన పాత ఇమేజ్ ను వదిలించుకోవాలని చూస్తున్నాడో.. అందుకు నాంది తర్వాత ఉగ్రం బాగా హెల్ప్ అవుతుంది. ఇకపై అతనూ మాస్ మూవీస్ చేయొచ్చు. అలాగే బిగ్ స్టార్స్ సినిమాల్లో ప్రధానమైన పాత్రలూ చేయొచ్చు అనేలా ఈ ఉగ్రం కొత్త ఇమేజ్ ను తెచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి.