తెలుగు క్లాసిక్ సినిమా అన్న పదానికి పర్యాయ పదంలా.. శ్రావ్యమైన సంగీతం , అర్ధవంతమైన కథ, ఆహ్లాదకరమైన కథనం, సామాజిక స్పృహను శాస్త్రీయ, సాహితీ సౌరభాలు గుభాళించే సినిమాలు.. వేనోళ్ల పొగిడేలా.. వేయేళ్లు నిలిచేలా సినిమాలు తీసిన ప్రతిభావంతులు లెజెండ్రీ డైరెక్టర్ కళాతపస్వి కాశీనాధుని విశ్వనాధ్ గారు. వారు ఔత్సాహిక దర్శకులకు ఓ ఎన్‌సైక్లోపీడియా. ఆదర్శప్రాయులు. అలాంటి విశ్వనాధ్ గారి పేరిట ఓ అవార్డ్ ఏర్పాటు చేసారు విశ్వనాధ్ గారి కుమారుడు నాగేంద్రనాథ్. ఈ అవార్డ్‌ను అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా నుంచి ఇద్దరు అత్యంత ప్రతిభను చూపిన యంగ్ ఫిల్మ్ మేకర్స్‌కు ఈ అవార్డ్‌ను ప్రదానం చేయనున్నారు. ఇకనుంచి ఈ అవార్డ్‌ను ప్రతీ ఏటా అందించనున్నట్టు తెలిపారు.
ప్రభావవంతమైన, అర్థవంతమైన సినిమాని రూపొందించడానికి స్ఫూర్తిని ఇచ్చే లక్ష్యంతో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకు చెందిన ఇద్దరు విద్యార్థులకు ఈ అవార్డును అందిస్తున్నారు. పరిశ్రమ ప్రముఖులచే నిర్దేశించబడిన ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబిస్తూ సౌండ్ డిజైన్, డైరెక్షన్ రంగాలలో అసాధారణమైన నైపుణ్యాన్ని ప్రదర్శించే ఇద్దరు విద్యార్థులను సత్కరిస్తున్నారు. ప్రతి సంవత్సరం, ఈ అవార్డు ద్వారా ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.25,000/- చొప్పున మొత్తం 50 వేల రూపాయల నగదు బహుమతిగా అందజేస్తారు.