నిర్మాతపై అలిగిన హీరోయిన్..

ఒకప్పుడు నిర్మాతలన్నా.. నిర్మాణ సంస్థలన్నా నటీ నటులకు భయం, భక్తీ ఉండేవి. ఇప్పుడు అలాంటివేం లేవు. అలాగని మరీ నిర్లక్ష్యంగా ఉంటారా అంటే లేదు అని కూడా చెప్పొచ్చు. కాకపోతే తమకు ప్రామిస్ చేసిన విషయాల్లో మాట తప్పితే మాత్రం ఆర్టిస్టులు పబ్లిక్ లోనే అడిగేస్తున్నారు. అలా రీసెంట్ గా భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్తా మీనన్ కు తన కొత్త సినిమా ప్రొడక్షన్ హౌస్ పై కోపం వచ్చింది. అంతే వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ కోపానికి కారణాలేంటో చెబుతూ.. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం చేసిందంటూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పడేసింది. అంటే తన కోపానికి కారణం ఏంటో తెలుసా..?


సంయుక్తా మీనన్ భీమ్లా నాయక్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఫస్ట్ మూవీలో రెగ్యులర్ హీరోయిన్ కాకపోయినా తర్వాత బింబిసారతో హిట్ కొట్టింది. రీసెంట్ గా సార్ తో మరో విజయం వచ్చేసింది. అరంగేట్రంతోనే హ్యాట్రిక్ అందుకున్నా.. ఎందుకో అమ్మడికి రావాల్సినంత క్రేజ్ రాలేదు అనే చెప్పాలి. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సరసన విరూపాక్ష సినిమాలో నటించి ఉంది సంయుక్త. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడు. అన్నట్టు ఈ చిత్ర కథ కూడా సుకుమార్ అందించిందే కావడం విశేషం.

ఈ మూవీ ఏప్రిల్ 21న విడుదల కాబోతోంది. అయితే విరూపాక్ష మూవీ నుంచి ఉగాది పండగ సందర్భంగా తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తాం అని చెప్పారట మేకర్స్. మరి ఆ విషయం తను అందరికీ చెప్పుకుందో ఏమో.. తీరా చూస్తే తన లుక్ ను విడుదల చేయలేదు.. నిర్మాణ సంస్థ. దీంతో ఈ విషయంపై అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సంయుక్త. మరి ఉగాది రోజు ఎందుకు కుదరలేదో కానీ.. మొత్తంగా అమ్మడి కామెంట్ కు స్పందించారు.

తనతో పాటు సాయితేజ్ తో కలిసి ఉన్న ఫోటోను విడుదల చేస్తూ తన పాత్ర పేరు నందినిగా పరిచయం చేశారు. అంతే కాదు.. ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. మొత్తంగా హీరోయిన్ ఇలా అలిగిందో లేదో.. అలా ఆమె అలక తీర్చేశాడు బివిఎస్ఎన్ ప్రసాద్. అయితే ఏ మాటకామాట.. ఇలాంటి విషయాలను హీరోయిన్లు ఇంత ధైర్యంగా అడగడం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేదు కదా.?

Related Posts