మళ్లీ మొదలైన రీ-రిలీజుల సందడి

ఒకప్పుడైతే సినిమా హాళ్లు మాత్రమే వినోద సాధనాలుగా ఉండేవి. భారీ విజయాలు సాధించిన చిత్రాలను మళ్లీ రీ-రిలీజులు చేసేవారు. కొన్ని సినిమాలైతే మొదటిసారి విడుదలకు మించిన రీతిలో రీ-రిలీజుల్లోనూ అదరగొట్టేవి. కొన్నైతే రీ-రిలీజుల్లోనే వందేసి రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి.చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఈమధ్య తెలుగులో రీ-రిలీజుల సంప్రదాయం జోరందుకుంది. అగ్ర కథానాయకుల పుట్టినరోజు వస్తుందంటే ఆయా హీరోలకు సంబంధించిన సూపర్ హిట్ మూవీస్ ను మళ్లీ థియేటర్లలోకి వదులుతున్నారు. ఈకోవలోనే ఈవారంలో థియేటర్లోకి రాబోతున్న సినిమాల సంఖ్య భారీగా ఉంది.

మార్చి 27న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చరణ్ నటించిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ‘మగధీర‘ మళ్లీ విడుదలవుతుంది. మార్చి 26న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు రిలీజ్ చేస్తున్నారు.

రామ్ చరణ్ మరో మెగా హిట్ ‘నాయక్‘ కూడా రీ-రిలీజ్ కు రెడీ అవుతుంది. చరణ్ డ్యూయల్ రోల్ లో మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా 2013 సంక్రాంతి బరిలో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. తమన్ అందించిన సంగీతం ‘నాయక్’కి మరో అదనపు ఆకర్షణ. ‘నాయక్’ మళ్లీ మార్చి 23న చరణ్ బర్త్ డే స్పెషల్ గా థియేటర్లలోకి దిగుతోంది.

దివంగత ఉదయ్ కిరణ్ సూపర్ హిట్ మూవీస్ లో ‘నువ్వు నేను’ది ప్రత్యేక స్థానం. అప్పటికే ఉదయ్ కి ‘చిత్రం’ వంటి హిట్ ఇచ్చిన తేజ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కి జోడీగా అనిత నటించింది. 2001వ సంవత్సరంలో విడుదలైన ‘నువ్వు నేను’ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆర్.పి.పట్నాయక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలోని ప్రతీ పాట సూపర్ హిట్టే. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతోన్న రీ-రిలీజుల ట్రెండ్ లో భాగంగా ‘నువ్వు నేను‘ సినిమాని మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ‘నువ్వు నేను’ చిత్రాన్ని మార్చి 21న రీ-రిలీజ్ చేయబోతున్నారు.

లేటెస్ట్ రీ-రిలీజెస్ లిస్టులో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ రూపొందించిన ‘ప్రేమికుడు‘ కూడా ఉంది. ప్రభుదేవా, నగ్మా జంటగా రూపొందిన ఈ సినిమా 30 ఏళ్ల క్రితం విడుదలై అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లో మంచి విజయాన్ని సాధించింది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతానికి ప్రభుదేవా డ్యాన్సులు ‘ప్రేమికుడు’కి ప్రత్యేక ఆకర్షణ. త్వరలోనే ఈ సినిమా కూడా రీ-రిలీజ్ కు రెడీ అవుతుంది.

Related Posts