తెలుగు పాటకు చిరునామా వేటూరి

తెలుగు పాటకు ఆయన చిరునామా.. తెలుగు పాటే ఆయనకు చిరునామా.. సంస్కృతభూయిష్టమైన సమాసాలను అందంగా పొదిగి, సరళమైన పాటగా మార్చి అందించినా.. లలిత శృంగార భావాలను మనోహరంగా కూర్చి అందమైన పాటగా మలచినా.. మొరటు పదాలకు జానపద పలుకులను నేర్పుగా అల్లి మసాలా కూర్చి మెప్పించినా… రాలిపోయే పూవుకు రాగాలెందుకంటూ శ్రోతల గుండెల్ని పిండి ఏడిపించినా .. అది వేటూరి కలానికే చెల్లింది. ఇవాళ వేటూరి సుందర రామ్మూర్తి జయంతి (జనవరి 29).

బాధల్నీ, విషాదాల్నీ, ఆనందాల్నీ గాయకుల స్వరాల్లో నింపి తెలుగు సినిమా పాటకు ఓ సొగసిరినీ, సౌందర్యాన్ని, పరిపూర్ణత్వాన్ని తెచ్చిన కలం వేటూరి సుందరరామ్మూర్తిది. సందర్భోచితమైన భావాలను సరళమైన పదాలతో పేర్చి శ్రోతల్ని తన సాహితీ రసజ్ఞతతో ముంచి వేయడం వేటూరి ప్రత్యేకత.

కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓ సీతకథ‘ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు వేటూరి. తనలోని పదసంపద అనే జ్ఞానానికి బాణీలు అద్ది, ఆ బాణీలతో తెలుగు పాటకు ఓణీలు వేయించారు. సంప్రదాయ కీర్తనలే కాదు, పురాణ సాహిత్యంలోని మాటలనూ తీసుకుని వాటిని అందమైన పాటలుగా మలచడంలో వేటూరిని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదేమో.

వేటూరి పాటల్లో క్లాస్ ఉన్నాయి మాస్ ఉన్నాయి. పండిత పామరులను మెప్పించిన ఉన్నత సాహితీ విలువలున్న పాటలూ ఉన్నాయి. భాషమీద పట్టుతో పాటు స్వరజ్ఞానం ఆయనకున్న వరం. శబ్ధానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి సినిమా పాటను రక్తి కట్టించారు. అవకాశాన్ని, సందర్భాన్ని బట్టి తెలుగు సినిమా పాటను లాలించి, పాలించి, శాసించిన సినీ కవితాగ్రేసరుడు వేటూరి. భౌతికంగా వేటూరి మనమధ్య లేకపోయినా.. తన అక్షరాలతో అనునిత్యం తెలుగు భాషతో మమేకమయ్యే ఉంటారు.

Related Posts