‘యానిమల్’లో ఆ సెంటిమెంట్ హైలైట్

‘అర్జున్ రెడ్డి‘ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర సృష్టించుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆ తర్వాత అదే సినిమాని హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ గా చేసి అక్కడా సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ముచ్చటగా తన మూడో సినిమా ‘యానిమల్’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈసారి ఈ చిత్రం పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ రాబోతుంది. డిసెంబర్ 1న ‘యానిమల్’ విడుదలకు ముస్తాబవుతోంది.

ఇప్పటికే ‘యానిమల్’ నుంచి టీజర్, రెండు సాంగ్స్ వచ్చాయి. లేటెస్ట్ గా మరో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇంతకుముందు రిలీజైన రెండు పాటలు హీరోహీరోయిన్లు రణ్ బీర్, రష్మిక లపై రొమాంటిక్ గా సాగితే.. మూడో గీతం ‘నాన్న నువ్ నా ప్రాణం’ తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఉంది. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతంలో అనంత్ శ్రీరామ్ రాసిన ఈ గీతాన్ని సోనూ నిగమ్ ఆలపించాడు. తండ్రి పాత్రలో అనిల్ కపూర్, అతన్ని అమితంగా ప్రేమించే కొడుకుగా రణ్ బీర్ కపూర్ ల అనుబంధం ఈ పాటలో కనిపిస్తుంది. ఇక.. ఈ సినిమా మెయిన్ థీమ్ కూడా ఇదే అనిపిస్తుంది. ఆమధ్య టీజర్ లో కూడా తన తండ్రిని ఎవరు ఏమన్నా ఊరుకోని కొడుకుగా రణ్ బీర్ ని చూపించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి.

మొత్తంమీద.. తన మొదటి రెండు సినిమాలలోనూ రొమాంటిక్ లవ్ స్టోరీని హైలైట్ చేసిన సందీప్.. ఇప్పుడు మూడో సినిమాలో ఆ ఎలిమెంట్స్ తో పాటు.. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ను ఎక్కువగా చూపించబోతున్నాడన్నమాట. మరి.. ఈ సినిమాతో సందీప్ హ్యాట్రిక్ హిట్స్ కొడతాడేమో చూడాలి.

Related Posts