తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు దర్శకుల ప్రయత్నం

‘ఆచార్య‘ ముందు వరకూ తెలుగులో అపజయమెరుగని దర్శకుల లిస్టులో ఉండేవాడు కొరటాల శివ. అయితే.. మెగా మల్టీస్టారర్ ‘ఆచార్య‘ కొరటాల కిట్టీలో ఫస్ట్ ఫ్లాప్ తీసుకొచ్చింది. సినిమా అంటేనే టీమ్ వర్క్. మరి.. ఎక్కడ తేడా కొట్టిందో తెలీదు కానీ.. ‘ఆచార్య‘తో కొరటాల శివ ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. మళ్లీ ఇప్పుడు ‘దేవర‘తో ఫుల్ ఫామ్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ‘ఆచార్య‘ విషయంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ ‘దేవర‘తో పాన్ ఇండియా హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

సౌతిండియాస్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో ముందు వరుసలో నిలిచే దర్శకుడు శంకర్. 2018లో రజనీకాంత్ తో ‘2.0‘ తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమా విడుదల చేయలేదు. అయితే.. ఈ ఏడాది చాలా తక్కువ సమయంలోనే రెండు సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు శంకర్. ఇక.. తన గత చిత్రం ‘2.0‘ ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో.. శంకర్ ఇప్పుడు తన ఆశలన్నీ ‘ఇండియన్ 2, గేమ్ ఛేంజర్‘పైనే పెట్టుకున్నాడు.

‘అల.. వైకుంఠపురములో‘ చిత్రంతో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అందుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ‘గుంటూరు కారం‘ మిశ్రమ ఫలితాన్నందించింది. దీంతో.. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా తన అప్ కమింగ్ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో నాల్గవ సారి కలిసి పనిచేయడానికి సినిమా కూడా అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఒకవేళ బన్నీతో సినిమా ఆలస్యమయితే.. ఈలోపులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేయనున్నాడట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

తొలి సినిమా ‘రన్ రాజా రన్‘తో మంచి హిట్ కొట్టిన సుజీత్ కి.. సెకండ్ మూవీ ‘సాహో‘ బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇచ్చింది. అయితే.. ఈ మూవీతో స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా ప్రశంసలు పొందాడు. అదే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘ఓజీ‘ సినిమా చేసే ఛాన్స్ అందించింది.

ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘ఓజీ‘ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ 27న రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ‘సాహో‘తో అందుకోలేని ఘన విజయాన్ని ‘ఓజీ‘తో సంపాదించాలనుకుంటున్నాడు సుజీత్.

Related Posts