ఎన్టీఆర్ కి భారతరత్న రావాలని ఆకాంక్షించిన చిరంజీవి

భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషి చేసిన వారికి భారతరత్న ప్రదానం చేస్తారు. ఇక.. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటడమే కాకుండా.. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని విశ్వ వ్యాప్తం చేసిన నటుడు, రాజకీయ నాయకుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు కి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ ఎలాంటి వారో.. తమిళులకు అలాంటి ఆరాధ్యుడు ఎమ్.జి.ఆర్. ఎమ్.జి.రామచంద్రన్ చనిపోయిన తర్వాత ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చారు. అలాగే తెలుగు వారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ కి కూడా భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఈమధ్య మరింత జోరందుకుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న తర్వాత చిరంజీవి.. ఎన్టీఆర్ కి భారతరత్న రావాలని తాను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పారు. ఎమ్.జి.ఆర్ గారికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారికి కూడా రావటం ఎంతో సముచితం, ఆనందదాయకం.. తాను ఆ తరుణం కోసం ఎదురుచూస్తున్నట్టు చిరంజీవి తెలిపారు.

Related Posts