సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు పి. చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి క‌న్నుమూత‌

ప్రముఖ సినీ దర్శకుడు పి.చంద్ర శేఖర్ రెడ్డి ఈ రోజు ఉదయం 8.30 లకు చెన్నైలో మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. సుమారు 80 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అయితే.. సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు ఆయన ఎక్కువగా దర్శకత్వం వహించారు.

భలే అల్లుడు, మానవుడు దానవుడు, కొడుకులు, జగన్నాయకుడు, బడిపంతులు, విచిత్ర దాంపత్యం, రగిలే గుండెలు, నవోదయం, పాడిపంటలు, బంగారు కాపురం, రాజకీయ చదరంగం, అన్నా వదిన, పెద్దలు మారాలి, పట్నవాసం, అన్నా చెల్లెలు తదితర విజ‌య‌వంత‌మైన‌ చిత్రాలకు పి.సి.రెడ్డి దర్శకత్వం వహించారు.

పి.సి.రెడ్డి పూర్తి పేరు పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి. ఆయన 1933వ సంవత్స‌రంలో అక్టోబర్ 15వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అనుమసముద్రం గ్రామంలో పందిళ్లపల్లి నారపరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. 1959లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీరంగ ప్రవేశం చేశారు. వి.మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయ దర్శకుడిగా, సహ దర్శకుడిగా పని చేశారు. అనూరాధ అనే సినిమాకు మొదటి సారి దర్శకత్వం వహించారు. ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.

Related Posts