రివ్యూ – గూడుపుఠాణి

సప్తగిరి, నేహా సోలంకి, రఘు కుంచె, అనంత్ తదితరులు న‌టించిన చిత్రం గూడుపుఠాణి. ఈ చిత్రానికి కుమార్ కె.ఎం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప‌రుపాటి శ్రీనివాస్ రెడ్డి, క‌టారి ర‌మేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. క‌మెడియ‌న్ గా త‌న‌దైన స్టైల్ లో న‌టిస్తూ.. అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌ర‌చుకున్న స‌ప్త‌గిరి హీరోగా స‌క్స‌స్ సాధించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు. తాజాగా గూడుపుఠాణి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్పుడు స‌ప్త‌గిరి గూడుపుఠాణి ప్రేక్ష‌కుల్ని మెప్పించిందో..? లేదో..? తెలుసుకుందాం.

కథ

దేవాలయంలో ఓ యువ జంట హత్య కలకలం రేపుతుంది. ఇన్వెస్టిగేషన్ కోసం రంగంలోకి దిగుతారు పోలీసులు. ఇదిలా ఉంటే మరో ప్రేమ జంట గిరి (సప్తగిరి), సిరి (నేహా సోలంకి) పెళ్లి చేసుకునేందుకు ఊరి చివర గుడిలోకి వెళ్తారు. దైవ దర్శనం చేసుకుంటుంటే వీళ్లను గమనించకుండా పూజారి గుడి తలుపులు మూసేసి వెళ్లిపోతాడు. గుడిలో చిక్కుకున్న గిరి, సిరికి అక్కడి అమ్మవారి ఆభరణాలు దొంగిలించేందుకు వచ్చిన దుండగులు కనిపిస్తారు. టెంపుల్ కమిటీ మెంబర్ (రఘు కుంచె), పోలీసు ఆఫీసర్ సహాయంతో ఈ నేరాలకు పాల్పడుతుంటాడు. ఈ దొంగలకు పట్టుబడుతుంది సిరి. తనకు కాబోయో భార్యను గిరి ఆ దుండగుల బారి నుంచి ఎలా కాపాడుకున్నాడు.? అసలీ దొంగలకు గతంలో జరిగిన ఆలయ హత్యలకు సంబంధం ఏంటి.? గిరి, సిరి ఈ ముఠాకు ఇచ్చిన అదిరిపోయే ట్విస్ట్ ఏంటి.? ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు..? అనేదే మిగిలి క‌థ‌.

విశ్లేష‌ణ

స‌ప్త‌గిరి త‌న పాత్ర‌ను స‌రిగా అర్ధం చేసుకోలేద‌నుకుంటా. కొత్త యాక్ట‌ర్ చేసిన‌ట్టుగా న‌టించాడు త‌ప్పా.. ఒక్క సీన్ లో కూడా ఆక‌ట్టుకోలేక‌పోయాడు. క‌థానాయిక నేహా సోలంకి కూడా అంతే. ప్రథమార్థం ఎలాంటి డ్రామా లేకుండా.. బోరింగ్ గా సాగుతుంది. హీరో హీరోయిన్స్ గుడిలోకి ఎంటర్ కాగానే అసలు క‌థ మొద‌ల‌వుతుంది.

సినిమా ప్రారంభంలోనే రఘు కుంచెను క్రూరంగా చూపించి సినిమా పై ఆస‌క్తి క‌లిగించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ర‌ఘ కుంచె విల‌న్ గా మెప్పించ‌లేక‌పోయాడు. విల‌నిజాన్ని కావాల‌ని తెచ్చిపెట్టుకున్న‌ట్టుగా ఉంది త‌ప్పా.. ఎక్క‌డా స‌హ‌జంగా అనిపించ‌లేదు. యువ జంట హ‌త్య‌, పోలీసుల ఇన్వెస్టిగేష‌న్ స్టార్ట్ కావ‌డంతో త‌ర్వాత ఏం జ‌రుగుతుందో అనే క్యూరియాసిటినీ క‌లిగించాడు. అయితే.. ఆడియ‌న్స్ లో ఆ ఆస‌క్తిని ఎంతో సేపు ఉంచ‌లేక‌పోయాడు ద‌ర్శ‌కుడు. గిరి, సిరి పెళ్లి చేసుకోవ‌డం కోసం గుడికి వెళ్లేంత వ‌ర‌కు బాగానే ఉంటుంది. ఇక అక్క‌డ నుంచి క‌థ ఎంత‌కి ముందుకి క‌ద‌లదు. ఆత‌ర్వాత నుంచి క‌థ అంతా గుడిలోనే.

ఇలా ఒక క‌థ‌ను ఒకే లోకేష‌న్ లో చెప్పాల‌నుకుంటే.. క‌థ పై చాలా క‌స‌రత్తు చేయాలి. అది ఈ సినిమాలో మిస్ అయ్యింది. దీని ఫ‌లితం ప్రేక్ష‌కుల‌కు స‌హ‌న ప‌రీక్ష‌లా అనిపిస్తుంటుంది. ఒక్క సీన్ కూడా థ్రిల్లింగ్ గా అనిపించ‌లేదు. మ్యూజిక్, ఎడిటింగ్, కెమెరా వ‌ర్క్ బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా బ‌ల‌మైన‌ క‌థ‌నం రాసుకోక‌పోవ‌డం అనేది పెద్ద మైన‌స్ అని చెప్పచ్చు. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. గూడుపుఠాణి.. స‌ప్త‌గిరికి మ‌ళ్లీ నిరాశే.

రేటింగ్ 2/5

Related Posts