రివ్యూ – గమనం

నటీనటులు : శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్

సాంకేతిక బృందం : సంగీతం : ‘మాస్ట్రో’ ఇళయరాజా, డీఓపీ : జ్ఞానశేఖర్ వి.ఎస్, డైలాగ్స్ : సాయి మాధవ్ బుర్రా, నిర్మాతలు : రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సుజనా రావు.

కథేంటంటే

మూడు ఉప కథలతో కూడిన కథ గమనం. అలీ (శివ కందుకూరి) వర్థమాన క్రికెటర్. అతనికి భారత జట్టుకు ఆడాలన్న లక్ష్యం ఉంటుంది. అతన్ని ప్రేమించే పొరిగింటి అమ్మాయి జారా ( ప్రియాంక జవాల్కర్). అలీ కెరీర్ లో స్థిరపడితే ఇంట్లో వాళ్లకు తమ ప్రేమ పెళ్లికి అభ్యంతరం ఉండదని కోరుకుంటుంది జారా. క్రికెటర్ గా ఎదిగేందుకు అలీకి అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. చిన్న బిడ్డతో ఓ మురికివాడలో నివాసం ఉంటున్న కమల (శ్రియ) చెవులు వినబడని దివ్యాంగురాలు. ఆమె దుబాయ్ లో ఉన్న భర్త వచ్చి తనను బాగా చూసుకుంటాడని ఆశిస్తుంటుంది. ఒక బట్టల పరిశ్రమలో పనిచేస్తుండే శ్రియకు జీవితంలో అన్నీ కష్టాలే. ఇద్దరు వీధి బాలల బతుకు చిత్రం మరో కథ. ఈ మూడు కథలు సమాంతరంగా సాగుతూ ఒక ముగింపునకు వస్తాయి. ఆ ముగింపు ఏంటన్నది తెరపై చూడాలి.

ఫ్లస్ పాయింట్స్

కథ
ఒక పాట

మైనస్ పాయింట్స్

నత్తనడక కథనం
డాక్యుమెంటరీ తరహా సీన్స్
కరువైన వినోదం
కష్టాలు నిండిన పాత్రలు

విశ్లేషణ

సినిమాకు కొన్ని కొలమానాలు ఉంటాయి. అవి లేవంటే దాన్ని సినిమా అనలేం. నాటికనో, సీరియల్ అనో చెప్పాలి. గొప్ప సినిమా చేస్తున్నామని అనుకుని డాక్యుమెంటరీ తీస్తే దానికి రవీంద్రభారతి, త్యాగరాయ గానసభ కరెక్ట్ ప్రదర్శించేందుకు. గమనం లాంటి సినిమాలు చూస్తే ఇదే భావన కలుగుతుంది. వీటికి అవార్డ్స్ వస్తాయి అని ఓదార్చుకోవడం కూడా తప్పే. అవార్డ్స్ ఇచ్చే వాళ్లు కూడా ఆలోచిస్తారు కదా. ఓ నాలుగైదు పాత్రలు, వాటికి చాలా కష్టాలు, వాటిని పెంచే ఓ సమస్య, ఆ సమస్యకు సామాజిక నిర్లక్ష్యం కారణం. ఇదే స్థూలంగా గమనం కథ. భర్త వదిలేస్తే మురికివాడలో దివ్యాంగురాలైన కమల ఎన్నో కష్టాలు పడుతుంటుంది. క్రికెటర్ గా సెలెక్ట్ అయ్యేందుకు డబ్బులు పెట్టాలని, అవి లేవని బాధపడుతుంటాడు అలీ. అతనితో పెళ్లి కోసం ఆరాటపడే జారా. కేక్ కొనుక్కునేందుకు డబ్బులు పోగేసే వీధి బాలలు. ఈ పాత్రలే కథనిండా. వీటి సీన్స్ ను ఒకదాని కొకటి అతికించి దాన్నే కథ చూపించారు దర్శకురాలు సుజనారావు. అసలీ కథ ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నారో సినిమా పూర్తయ్యాక కూడా అర్థం కాదు. చెరువుల్లో అపార్ట్ మెంట్లు కట్టడం ద్వారా వరదలు వస్తున్నాయనే చెప్పాలనుకుంటే, దానికి ఇన్ని పాత్రలు, వాటికిన్ని కష్టాలు చూపించాల్సిన అవసరం లేదు. పైగా సినిమా అంటే కొంత డ్రామా, ఎంటర్ టైన్ మెంట్, ట్విస్టులు ఏవో ఎక్స్ పెక్ట్ చేస్తారు కదా ప్రేక్షకులు. అవేం లేకుండా సినిమా మొదటి సీన్ నుంచి ఈసురోమని కథ మొదలవుతుంది. ఈ సీన్ చూసే ప్రేక్షకులు సీట్లో పడుకోవచ్చు.

కథలోనే విషయం లేనప్పుడు నటీనటులు ఏం చేస్తారు. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, శ్రియ సరన్ అంతా ఈ నత్త నడక కథలో ఓ భాగమయ్యారు గానీ ఎక్కడా ప్రభావం చూపించలేకపోయారు. మనకున్న కష్టాలకు తోడు తెరపై ఇన్ని కష్టాలు చూడటం భరించరాని విషయం. పేరుకే ఈ సినిమాకు ఇళయరాజా పనిచేశారు గానీ, సినిమా ఇలా ఉంటే ఆయన మాత్రం ఏం చేస్తారు. ఇళయరాజా ట్రేడ్ మార్క్ అయిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సహా ఏదీ మెప్పించదు. పాటల్లో ఓ మేరే మౌలా పాట ఒక్కటే వినసొంపుగా ఉంది. చివరలో నిత్యామీనన్ గెస్ట్ రోల్ కూడా దండగే.

రేటింగ్ 1.5/5

Related Posts