రాజమౌళీ.. రఫ్పాడించావయ్యా ..

రాజమౌళి ప్రతిభపై ఎవరికీ అనుమానాలు లేవు. ఓ కమర్షియల్ సినిమాను జనరంజకంగా ఎలా చెప్పాలో బాగా అంటే బాగా తెలిసిన దర్శకుడు రాజమౌళి. అందుకే అతన్నుంచి ఓ సినిమా వస్తోందంటే కమర్షియల్ ఆ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో అనే విషయంలో ఆడియన్సెస్ కు కూడా ఓ అంచనా ఉంది. కొంత కాలం క్రితం వరకూ తెలుగుకే ఈ అంచనాలు పరిమితమైనా వాటిని.. మగధీర, ఈగ, బాహుబలి చిత్రాలతో డబుల్ త్రిబుల్ చేస్తూ వస్తున్నాడు. బాహుబలి తర్వాత జక్కన్న ఇండియాస్ టాప్ డైరెక్టర్ గా డిక్లేర్ అయిపోయాడు. అందుకే ఆర్ఆర్ఆర్ అనౌన్స్ అయినప్పుడు దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో అంచనాలు మొదలయ్యాయి. ప్రమోషనల్ గా ఎలా ఉన్నా.. ట్రైలర్ విషయంలో ఎలా ఉంటుందా అనే ఉత్కంఠ అందర్లో ఉంది. ఈ విషయంలోనూ ఎవరినీ డిజప్పాయింట్ చేయకుండా ట్రైలర్ తోనే వెండితెరపై అగ్నిధారలు కురిపించాడు రాజమౌళి.
ఒక్కో షాట్ ను ఓ ఎపిక్ లా మలిచాడు రాజమౌళి. ఇద్దరు హీరోలు కదా ఎవరైనా తగ్గుతారేమో అని చాలామంది అనుకున్నారు. బట్ ఎవరూ తగ్గలేదు.. జక్కన్న ఎవరినీ తగ్గించలేదు. నీరు నిప్పు అంటూ ఉప్పెనలా విరుచుకుపడిన హీరోలను చూసి అభిమానులే కాదు.. యావత్ సినీ అభిమానులకూ రోమాలు నిక్కబొడుచుకున్నాయంటే కూడా తక్కువే అవుతుంది. ఆ స్థాయిలో కట్ చేశాడు ట్రైలర్.
టైగర్ తో యంగ్ టైగర్ షాట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ ఇద్దరి స్నేహం కూడా ఆ స్థాయిలోనే ప్రెజెంట్ చేసినా.. రామ్ చరణ్ సైతం గొప్ప నటన చూపించాడు అనేలా ఉందీ ట్రైలర్. ఇక అలియాభట్.. పాత్ర బలంగా ఉండబోతోందని అర్థమౌతోంది. జనని సాంగ్ లో అజయ్ దేవ్ గణ్ ను చూసినప్పుడే ఈ చిత్ర ప్రధాన కథాంశానికి అతను చుక్కానిలా ఉంటాడనిపించింది. అదే నిజమనేలా ఈ ట్రైలర్ లోనూ అతని డైలాగ్ వినిపించింది. శ్రియ కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రే చేసినట్టు కనిపిస్తోంది.
ఇక చివరగా ఇద్దరు హీరోలు ఒకరిని ఒకరు రోప్ చేసుకుని బ్రిటీషర్ ను తన్నే సీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదేమైనా.. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇన్నాళ్లూ వెయిట్ చేసిన దానికంటే ఎక్కవే రాజమౌళి ప్రేక్షకులకు వినోదం పంచబోతున్నాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ ట్రైలర్ చూసిన ముఖ్యంగా ఇద్దరు హీరోల అభిమానులు జనవరి 7 ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తారేమో ఇంక.

Related Posts