పక్కా కమర్షియల్ రివ్యూ..

రివ్యూ :పక్కా కమర్షియల్
తారాగణం :గోపీచంద్, రాశిఖన్నా, సత్యరాజ్, రావు రమేష్‌, ప్రవీణ్, శియా గౌతమ్, వైవా హర్ష, సప్తగిరి, అజయ్ ఘోష్
సంగీతం : జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: కరమ్ చావ్లా
నిర్మాత :బన్నీ వాసు
దర్శకత్వం :మారుతి

మేచో స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు గోపీచంద్. కానీ కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులు చూస్తున్నాడు. చాలా డిఫరెంట్ స్టోరీస్ ట్రై చేశాడు. అయినా ఆశించిన విజయం దక్కడం లేదు. చివరగా వచ్చిన సీటీమార్ కొంత వరకూ కమర్షియల్ గా ఫర్వాలేదు అనిపించుకుంది. ఇక చిన్న పాయింట్స్ చుట్టు తనదైన శైలిలో మసాలాలు అద్ది.. ఎంటర్టైన్ చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు దర్శకుడు మారుతి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ అనే టైటిల్ అనౌన్స్ అయినప్పుడే అందరి దృష్టినీ ఆకర్షించింది. మంచి ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలూ పెంచి ఆడియన్స్ ముందుకు వచ్చారు. మరి ఈ పక్కా కమర్షియల్ టైటిల్ కు తగ్గ విజయం అందుకుంటుందా లేదా అనేది చూద్దాం..

కథ :
సూర్య నారాయణరాజు(సత్యరాజ్) సెషన్స్ కోర్ట్ జడ్జ్. నిజాయితీపరుడు. ఓ కేస్ లో తన తీర్పు వల్ల ఓ అమాయకురాలైన ఆడపిల్ల చనిపోతుంది. ఆ బాధతో తన పదవికి రాజీనామా చేసి.. కిరాణా కొట్టు పెట్టుకుంటాడు. అతని కొడుకు లక్కీ( గోపీచంద్) తండ్రి బాటలో లా చదువుకుని లాయర్ అవుతాడు. కానీ తండ్రికి భిన్నంగా అతను నిజాయితీల్లాంటివేం పెట్టుకోకుండా పక్కా కమర్షియల్ గా ఉంటాడు. ప్రతి కేస్ లోనూ విపరీతమైన డబ్బులు దండుకుంటూ అన్యాయాన్ని గెలిపిస్తుంటాడు. ఎంతోమందిని చంపిన ఓ బిజినెస్ మేన్ వివేక్(రావు రమేష్‌) వద్ద చేరి అతని కేస్ లన్నీ వాదిస్తూ అతని అవినీతికి అండగా ఉంటాడు. ఈ విషయంలో తండ్రి వారించినా వినడు. దీంతో సూర్యనారాయణరాజు తన వద్దకు వచ్చిన ఓ పెద్ద కేస్ ను వాదించేందుకు పాతికేళ్ల తర్వాత మళ్లీ లాయర్ గా వస్తాడు..? అటువైపు లక్కీ ఉంటాడు. మరి ఈ తండ్రి కొడుకుల వార్ లో విన్నర్ ఎవరు..? అసలు లక్కీ తండ్రి పాతికేళ్ల తర్వాత మళ్లీ కోర్ట్ మెట్లు ఎందుకు ఎక్కాడు..? లక్కీ అంత అవినీతిగా ఎందుకు ఉన్నాడు.. అనేది మిగతా కథ.

విశ్లేషణ :
ముందు ఇదో పాత కథ. క్లైమాక్స్ లో ఇచ్చిన చిన్న ట్విస్ట్ వల్ల కొత్తదనం వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ అంతకు ముందు నడిపించిన కథనం అంతా చీప్ గా కనిపిస్తుంది. మారుతి తొలి రోజుల నాటి చీప్ కామెడీతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో తన టేస్ట్ ఇదే అని మరోసారి నిరూపించుకున్నాడు. అందుకు ఏ మాత్రం మొహమాటపడకుండా గోపీచంద్ కూడా సహకరించాడు. అసలు సాక్ష్యాలను బట్టే తీర్పులు ఉంటాయని.. అందుకు తాను బాధ్యుడిని కాదు అన్న మినిమం సెన్స్ లేని జడ్జి పాత్ర రాసుకోవడంతోనే మారుతి వైఫల్యం కనిపిస్తుంది. తన వృత్తిలో అలాంటివి సహజమే అనేది తెలియకపోవడం ఆ పాత్ర ఔచిత్యాన్ని కించపరిచింది. లేదూ అతనో నిజాయితీ పరుడు అనేందుకు అంతకు ముందు ఏ సీన్(కోర్ట్ లోనే) కనిపించలేదు. అప్పుడు అతను రాజీనామా చేసినా ప్రేక్షకుడు పెద్దగా ఫీల్ అయ్యేది లేదు. కిరాణా కొట్టు పెట్టుకున్నా.. ఇంకేం చేసినా ఆ పాత్రపై జాలి కలగదు. ఇది దర్శకుడి మొదటి వైఫల్యం. దాన్ని సినిమా అంతా కంటిన్యూ చేయడంలో మాత్రం బాగా సక్సెస్ అయ్యాడు మారుతి. తర్వాత వరుసగా వచ్చే పాత్రలన్నీ పూర్తి సినిమాటిక్ గా ఉంటాయి తప్ప.. ఓ కథ.. దానికి తగ్గ కథనం కనిపించదు. పోనీ హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడానికే అనుకున్నప్పుడు దాన్ని క్లైమాక్స్ కు లింక్ చేయాలంటే ఆ పాత్రలోని మరో కోణాన్ని కూడా అప్పుడప్పుడూ చూపించాలి. లేదూ చివర్లోనే ట్విస్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు బలమైన కథనం రాసుకోవాలి. అవేం లేకుండా అడల్ట్ డైలాగ్స్, ఆకట్టుకోని పాటలతో కాలక్షేపం చేస్తే చూసే ప్రేక్షకుడి టైమ్ లాస్.. తీసిన నిర్మాతకు మనీ లాస్ తప్ప మరోటి రాదు.హీరో ఎన్ని తప్పులు చేసినా.. చివర్లో వాటికి ఏదో ఒక రీజన్ చెప్పడం తెలుగు సినిమా పుట్టిన దగ్గర్నుంచీ చూస్తున్నాం. ఇదీ అందుకు మినహాయింపేం కాదు. గోపీచంద్ కావాలనే అలా చేస్తున్నాడని, దానికి క్లైమాక్స్ లో ఓ రేంజ్ లో నీతులు చెబుతూ కౌంటర్స్ ఉంటాయని కనిపెట్టడం కామన్ ఆడియన్స్ కు పెద్ద కష్టమేం కాదు.

అంటే దర్శకుడు తను ఏదైతే గొప్పగా ఉంటుందని భావించాడో అది ఆడియన్స్ ఆల్రెడీ ఊహించి ఉంటారు. అందువల్ల ఏ మాత్రం కొత్తదనం కనిపించదు. ఈ లాజిక్ ను మరిపించేందుకే అనవసరమైన సన్నివేశాలతో నెట్టుకువచ్చాడు.గోపీచంద్ పాత్రను ప్రెజెంట్ చేసిన విధానం బానే అనిపిస్తుంది. కానీ అది మితిమీరి కనిపించడంతో అతను హీరోనా విలనా అనే డౌట్ ఆడియన్స్ లో కనిపిస్తుంది. నిజమే.. ఈ విషయంలో గోపీచంద్ పాత ఇమేజ్ తోనే కథనం అంతా నడిపించాడు. అంటే గోపీచంద్ ఏ దశలోనూ హీరోగా ప్రవర్తించడు. ఎప్పుడో కెరీర్ ఆరంభంలో చేసిన విలన్ పాత్రలను ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇమేజ్ పైన ప్రెజెంట్ చేస్తే ఆ నష్టం గోపీచంద్ కే కానీ దర్శకుడికి కాదు. పైగా మేచో స్టార్ అంటూ తెగ హడావిడీ చేస్తున్నప్పుడు ఆ డిగ్నిటీని తను ఎంచుకునే పాత్రల్లో కూడా చూపించాలి ఈ హీరో. లేదంటే ఇదుగో ఇలాంటి చీప్ డైరెక్టర్స్ చేతిలో పడి.. హిట్ కోసం అనే భ్రమలో పడి.. అతను చెప్పిందల్లా చేసుకుపోవాలనిపిస్తుంది. ఈ విషయంలో గోపీచంద్ నే తప్పు బట్టాలి.సత్యరాజ్ పాత్రకు తగ్గట్టుగానే నటనలోనూ నీరసంగానే కనిపించాడు. ఇక రావు రమేష్‌ ను విమెనైజర్ గా చూపించారు. సినిమాలో మెయిన్ విలన్ కూడా అతనే. నాన్నకు ప్రేమతోలో జగపతిబాబు లాగా..

హీరో చిన్నతనం నుంచీ పెద్దయ్యేంత వరకూ అతనే విలన్ అన్నమాట. అతనితో పాటు ఉన్న అజయ్ ఘోష్‌ తో పాటు వచ్చే సన్నివేశాలు కొన్నిసార్లు నవ్వించినా.. మొత్తంగా మారుతి తొలినాళ్లలో తీసిన ఈ రోజుల్లో బస్ స్టాప్ వంటి చిత్రాల్లోని డైలాగ్స్ ను గుర్తుకు తెస్తాయి.సినిమాలో రాశిఖన్నా గురించి చెప్పుకోవాలి. ఆ మధ్య రెండు మూడు తమిళ్ సినిమాలు చేయడం వల్లో లేక మారుతి వద్ద ఎక్కువ చనువు కనిపించడం వల్లో కానీ.. ఆమె అతి నటనను అస్సలు భరించలేం. గోపీచంద్ ను కూడా డామినేట్ చేయాలనే తాపత్రయం(దర్శకుడే చెప్పినా) సీన్ సీన్ నా కనిపించింది. ఆ నటన చూస్తుంటే సీన్ ఎప్పుడు అయిపోతుందిరా బాబూ అనిపిస్తుంది.. అంత ఓవరాక్షన్ చేసింది మరి. తనతో పాటు కనిపించే వైవా హర్ష, సప్తగిరి పాత్రలు జూనియర్ ఆర్టిస్టుల్లాంటివే. ప్రవీణ్ ఓకే. శియా గౌతమ్ పాత్రతో సినిమాను టర్న్ చేశారు. అది ప్రిడిక్టబుల్ టర్నే.టెక్నికల్ గా ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ మ్యూజిక్. జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం 90ల కాలం నాటిది. ఒక్క పాటా బాలేదు. రిజిస్టర్ కూడా కాదు. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ పరంగా దర్శకుడితే ఫైనల్ డెసిషన్ కాబట్టి అతన్నేమనలేం. యాక్షన్, కాస్ట్యూమర్ వర్క్, ఆర్ట్ వర్క్, సెట్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గానే ఉన్నాయి. ఇక దర్శకుడుగా మారుతి తర్వాతి సినిమా ప్రభాస్ తో ఉండబోతోంది. ఈ సినిమా ప్రభావం ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ పై పడుతుందని చెప్పొచ్చు. ఆ స్థాయి టేస్ట్ తో తీశాడీ చిత్రాన్ని. ఇలాగే మరోసారి మారుతిపై విమర్శలు పెరుగుతాయి.

ఫైనల్ గా :పక్కా కష్టమే..

రేటింగ్ :2/5

– యశ్వంత్ బాబు.

Related Posts