ఒకవైపు ‘ఇండియన్ 2‘.. మరోవైపు ‘గేమ్ ఛేంజర్‘

సందేశాత్మక కథాంశాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడు శంకర్. భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే శంకర్ ఎప్పుడూ ఒక సినిమా పూర్తైన తర్వాతే మరో చిత్రాన్ని పట్టాలెక్కించేవాడు. అయితే.. ఇప్పుడు మాత్రం ఒకవైపు ‘ఇండియన్ 2‘, మరోవైపు ‘గేమ్ ఛేంజర్‘ సినిమాలను పూర్తిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

‘ఇండియన్ 2‘ సస్పెన్స్ లో పడడంతో ‘గేమ్ ఛేంజర్‘ని మొదలుపెట్టిన శంకర్.. కోర్టు తీర్పుతో మళ్లీ ‘ఇండియన్ 2‘ని తిరిగి ప్రారంభించాడు. ముందుగా మొదలుపెట్టిన సినిమా కాబట్టి.. ‘ఇండియన్ 2‘ ముందుగా పూర్తిచేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘ఇండియన్ 2‘ డబ్బింగ్ పనులు మొదలుపెట్టుకుంది.

లేటెస్ట్ గా ‘ఇండియన్ 2‘ డబ్బింగ్ స్టార్ట్ అయినట్టు ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. అందులో కమల్, శంకర్ లు కారు దిగి డబ్బింగ్ స్టూడియోలోకి వెళ్లడం, ఇద్దరూ ముచ్చటించుకోవడం కనిపిస్తుంది.

మరోవైపు ‘గేమ్ ఛేంజర్‘ షూటింగ్ లో కూడా స్పీడు పెంచాడట శంకర్. ఆమధ్య జరిగిన పాత షెడ్యూల్ కి కొనసాగింపుగా షూటింగ్ ను ప్రారంభించారట. 10 రోజుల పాటు నిరవధికంగా ఈ షూటింగ్ జరగనుందట. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తండ్రి పాత్ర ఒక పొలిటికల్ లీడర్ గా.. కొడుకు పాత్రలో ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ గా చరణ్ కనువిందు చేయనున్నాడట. తండ్రి పాత్రలో చరణ్ సరసన అంజలి నటిస్తుంటే.. కొడుకు పాత్రకు కియారా అద్వానీ కథానాయిక.

Related Posts