సీఎమ్ జ‌గ‌న్ ని క‌ల‌వ‌నున్న ఎన్టీఆర్.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు త‌గ్గించ‌డం.. దీని వ‌ల‌న సినీ ఇండ‌స్ట్రీకి భారీగా న‌ష్టం వ‌స్తుంద‌ని.. అందుచేత టిక్కెట్ల రేట్లు పెంచాలంటూ గ‌త కొన్ని రోజులుగా సినీ పెద్ద‌లు ఏపీ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేస్తూనే ఉన్నారు. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జ‌గ‌న్ ను క‌లిసి మాట్లాడ‌డం జ‌రిగింది. ఆ సంద‌ర్భంగా చిరంజీవి స్పందిస్తూ… త్వ‌ర‌లోనే సినీ ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు జ‌గ‌న్ సానుకూలంగా స్పందించార‌ని.. మ‌రోసారి సీఎం గారితో మీటింగ్ ఉంటుంది. అందుచేత అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ కూడా ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌ద్దు అని చిరంజీవి చెప్ప‌డం జ‌రిగింది.

అయితే.. ఆరోజు రానే వ‌చ్చింది. ఈ రోజు సీఎం వైఎస్ జ‌గ‌న్ తో సినీ పెద్ద‌లు భేటీ కానున్నారు. ఈ మీటింగ్ లో సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్, సూప‌ర్ స్టార్ మహేష్‌ బాబు, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి, బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొరటాల శివ భేటీ కానున్నారని స‌మాచారం. ఇప్పటికే సినీ పరిశ్రమకు సంబంధించిన‌ అంశాల పై సీఎం జగన్‌తో మంత్రి పేర్ని నాని చర్చించి పూర్తి స‌మాచారం అందించారు. సినిమా టికెట్ల ధర పెంపు, సినీ పరిశ్రమకు రాయితీల పై, సినిమా థియేటర్లలో వసతులు, సదుపాయాల కల్పన పై కీలక చర్చ జరిగింది.

ఇదిలా ఉంటే… ఏపీ సీఎం జ‌గ‌న్ తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ భేటీ కానుండ‌డం ఆస‌క్తిగా మారింది. ఇలాంటి వాటికి మ‌హేష్ బాబు, ప్ర‌భాస్, ఎన్టీఆర్ దూరంగా ఉంటారు. అయితే.. రానున్న రోజుల్లో ఈ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుండ‌డం.. సినీ పెద్ద‌లు ఈ స్టార్ హీరోలు కూడా వ‌స్తే బాగుంటుంద‌ని చెప్ప‌డంతో మ‌హేష్‌, ప్ర‌భాస్ ల‌తో పాటే ఎన్టీఆర్ కూడా సీఎంతో మీటింగ్ కి వ‌చ్చేందుకు ఎస్ అన్నార‌ని టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా విజ‌య‌వాడ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామ‌క‌ర‌ణం చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎన్టీఆర్.. జ‌గ‌న్ ని క‌లుస్తుండ‌డం ఆస‌క్తిగా మారింది.

Related Posts