డబుల్ హ్యాట్రిక్ దిశగా నాగచైతన్య

వరుసగా విజయాలు రావడం అనేది సినిమా పరిశ్రమలో అరుదుగానే జరుగుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని.. ఎంత పకడ్బందీగా కథలు ఎంచుకున్నా.. వైఫల్యాలను ఎవరూ ఆపలేరు. అది స్మాల్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ వర్తిస్తుంది. కకాపోతే కొన్నిసార్లు మాత్రమే కంటిన్యూస్ హిట్స్ సాధ్యమవుతాయి. అలాంటి వారిని లక్కీ స్టార్స్ అనలేం కానీ.. ఈ హిట్లు వారి రేంజ్ ను మారుస్తాయి. అలాగే ఇప్పుడు బంగార్రాజు కూడా వరుస హిట్స్ తో రేంజ్ మార్చుకుంటున్నాడు.. వరుసగా సినిమాలు చేయడం వరకే హీరోల చేతిలో పని. అవి అదే స్థాయిలో విజయాలు సాధిస్తున్నాయా లేదా అనేది కథల్లో ఉండే కెపాసిటీని బట్టి ఉంటుంది. ఒక్కోసారి కథలు బావున్నా.. కథనమో.. మరేదో ఇబ్బంది పెడుతుంది. ఖచ్చితంగా హిట్ కొడతాం అన్న నమ్మకం కూడా అలాంటప్పుడు వమ్మవుతుంది. ఇవన్నీ దాటుకుని వరుసగా విజయాలు సాధించడం అనేది అరుదు. ఆ అరుదైన లిస్ట్ లోనే చేరాడు అక్కినేని బంగార్రాజు నాగచైతన్య. చైతూ లేటెస్ట్ బంగార్రాజు తో వరుసగా నాలుగు విజయాలు అందుకుని సత్తా చాటుతున్నాడు.
2019లో వచ్చిన మజిలీ చిత్రంతో నాగచైతన్య విజయయాత్ర మొదలైంది. నిజానికి ఈ మూవీకి ముందు అతనివన్నీ రెగ్యులర్ కథలే. అందుకే కొన్ని డిజాస్టర్అయితే.. మరికొన్ని యావరేజ్ అనిపించుకున్నాయి. బట్ ఫస్ట్ టైమ్ తనలోని డిఫరెంట్ యాంగిల్ ను నటనలోనూ చూపించాడు చైతన్య. లవ్ ఫెయిల్ అయిన కుర్రాడిగా.. పనీపాటా లేకుండా పెళ్లాం డబ్బులతో మందు తాగే వ్యక్తిగా బాగా నటించాడు. శివ నిర్వాణ డైరెక్షన్ లో వచ్చిన మజిలీ తర్వాత చైతూకు చాలామంది కొత్త అభిమానులు ఏర్పాడ్డారంటే అతిశయోక్తి కాదు.
మేనమామ వెంకటేష్ తో కలిసి చేసిన వెంకీమామ సైతం కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. బాబీ డైరెక్షన్లో వచ్చిన వెంకీమామలో రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ కార్తీక్ శివరామ్ గా ఆకట్టుకున్నాడు. వెంకీ లాంటి టాప్ స్టార్ ఉన్నా.. తనదైన శైలిలో మెప్పించి సత్తా చాటాడు. వెంకీమామ సాధించిన విజయం చైతూలో మరింత కాన్ఫిడెన్స్ ను నిపించింది. గతేడాది వచ్చిన లవ్ స్టోరీ నిజంగా నాగచైతన్య నుంచి ఊహించని సినిమా. అతను ఇలాంటి కథను ఎంచుకుంటాడని ఎవరూ భావించలేదు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లవ్ స్టోరీలోని రేవంత్ అనే పాత్ర తనకోసమే పుట్టిందా అన్న స్థాయిలో అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. సాయిపల్లవి వంటి మోస్ట్ టాలెంటెడ్ డ్యాన్సర్ తో పోటీ పడి మరీ జుంబా డ్యాన్స్ లోనూ మెప్పించాడు.
ఇక సంక్రాంతి బరిలో నిలిచిన బంగార్రాజు ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ మూవీలో చిన బంగార్రాజుగా ఫస్ట్ టైమ్ పల్లెటూరి పైలా పచ్చీస్ లాంటి కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. తండ్రిని తలపిస్తూ.. తనదైన ముద్ర వేస్తూ ఆ పాత్రలో జీవించాడు. మొత్తంగా వరుస విజయాలు అనేది కథలను మారిస్తేనే సాధ్యం అవుతుంది. ఒక కథకు మరో కథకు సంబంధం లేకుండా చూసుకోవడం ప్రధానం. చైతూ సాధించిన ఈ నాలుగు సూపర్ హిట్స్ కూడా పూర్తిగా భిన్నమైన కథలే. అందుకే ఇంత సక్సెస్ అందుకున్నాడు. మరి మరో రెండు హిట్స్ అందుకుంటే డబుల్ హ్యాట్రిక్ కొట్టినట్టవుతుంది.

Related Posts