మేజర్ సినిమా రివ్యూ మస్ట్ వాచ్

రివ్యూ : మేజర్
తారాగణం : అడవి శేష్, ప్రకాష్ రాజ్, రేవతి, సాయీ మంజ్రేకర్, శోభిత
కథ, స్క్రీన్ ప్లే : అడవి శేష్
సినిమాటోగ్రఫీ : వంశీ పచ్చిపులుసు
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
నిర్మాతలు : మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర
దర్శకత్వం : శశికిరణ్ తిక్క

రేటింగ్ : మస్ట్ వాచ్

టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న హీరో అడవి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు లాంటి చిత్రాలతో తన పేరును ఒక బ్రాండ్ గా మార్చుకున్నాడు. అతని సినిమా అంటే కొత్తగా, కాస్త ప్రత్యేకంగా ఉంటుందనే నమ్మకాన్ని కూడా ప్రేక్షకుల్లో కలిగించాడు. ఆ నమ్మకంతోనే ముంబయి ఉగ్రదాడుల్లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన, మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవిత కథ ఆధారంగా అడవి శేష్ అండ్ టీమ్ చేసిన మేజర్ మూవీ కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేశారు. పది రోజుల నుంచి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రీమియర్ షోలతో సందడి చేసింది టీమ్. ఇక సినిమా ఇవాళ విడుదలైంది. మరి ఈ మేజర్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడా… లేదా ఈ స్పెషల్ రివ్యూలో చూద్దాం.

మేజర్ కథ చూస్తే… ఇస్రోలో అధికారిగా పనిచేసే ఉన్ని కృష్ణన్ తనయుడు సందీప్. తన కొడుకు బాగా చదువుకుని డాక్టర్ కావాలనేది ఆయన కోరిక. తన తల్లేమో కొడుకు ఇంజినీర్ అవ్వాలనుకుంటుంది. కానీ సందీప్ మాత్రం నేవీలో చేరాలనుకుంటున్నాడు. అది తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. నేవీలో అవకాశం రాకపోయేసరికి ఆర్మీలో చేరతాడు. తర్వాత తను కాలేజీ రోజుల్లో ప్రేమించిన ఇషాను పెళ్ళి చేసుకుంటాడు. అయితే కుటుంబం కంటే కూడా సైనికుడుగా దేశాన్ని రక్షించడమే ముఖ్యం అనుకునే సందీప్ కి వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. తన భార్యకి దూరం కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో ముంబయిలోని తాజ్ హోటల్ మీద ఉగ్రవాదులు దాడులు జరిపుతున్నారనే ఇన్ఫర్మేషన్ తో తన NSG టీమ్ తో అక్కడ అడుగుపెట్టిన సందీప్ ఉగ్రవాదులతో ఎలా పోరాడాడు. ఈ పోరాటంలో అతను ఎలా వీరమరణం పొందాడన్నదే మేజర్ మూవీ కథ.
మేజర్ మూవీ పూర్తిగా ముంబయి ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో సాగిన సినిమా మాత్రమే కాదు. మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ బాల్య నుంచి ముంబయి ఎటాక్ట్ వరకు తన జీవితాన్ని ఫాస్ట్ ఫార్వాల్డ్ లో చేపించారు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఫస్ట్ హాఫ్ అంతా తన బాల్యం, చదువు, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ నే ఎక్కువగా చూపించారు. మధ్యలో సందీప్ ఆర్మీలో చేరడం ట్రైనింగ్ ఉంటుంది. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అయ్యేలా లేవనే చెప్పాలి. అవన్నీ ఫిల్లింగ్ లా అనిపిస్తుందే తప్ప ఆడియన్స్ కిఎగ్జైట్మెంట్ ఇవ్వలేదని చెప్పాలి. ప్రేమ కథ భాగానే ఉంది. అయితే సందీప్ సైన్యంలో చేరాక సినిమాలో స్పీడ్ పెరుగుతుంది. తన వృత్తిని, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేక ఎలా ఇబ్బంది పడతాడో… అతనెలాంటి త్యాగాలు చేయాల్సి వస్తుందో చక్కగా చూపించారు. ఈ సీన్స్ ని సందీప్ పాత్రతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేయగలిగాడు దర్శకుడు శశికిరణ్ తిక్క.

సెకండ్ హాఫ్ మొత్తం ఉగ్రదాడు నేపథ్యంలోనే సాగుతుంది. టెర్రరిస్టులు తాజ్ హోటల్ మీద దాడి చేసి అందులోని ప్రజల్ని విచక్షణారహితంగా చంపడం నుంచి, NSG కామాండోలు తాజ్ హోటల్ లోకి వెళ్ళి ప్రజల్ని కాపాడడం, టెర్రరిస్టులను చంపడం…ఈ సీన్స్ అన్నీ ఉత్కంఠభరితంగా చూపించారు. ఉగ్రవాదుల క్రూరత్వాన్ని, బందీలుగా చిక్కిన వారి బాధను, వారిని కాపాడేందుకు, ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు సైన్యం చేసిన పోరాటాన్ని ఎంతో ఆసక్తికరంగా చూపించారు. అయితే ఇది సందీప్ బయోపిక్ కావడంతో ఆద్యంతం అతణ్ణే ఎలివేట్ చేస్తు కథను నడిపారు. ఆ టైమ్ లో ఒక్కరినే ఎలివేట్ చేయడం తప్పేమో అనిపించినా…. సన్నివేశాల్లోని ఉత్కంఠ మనల్ని ఆ వైపుగా ఆలోచించనీయలేదు. చివిరికి ముగింపు ఎలా ఉంటుందో తెలిసినా.. చూస్తున్న ప్రేక్షకుల గుండెలు బరువెక్కేలా దాన్ని తీర్చిదిద్ది మేజర్ కి వారి గుండెల్లో చోటిచ్చేలా చేయగలిగింది చిత్ర యూనట్.

పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే… అడవి శేష్ ఈ సినిమాతో ఆడియన్స్ లో చెరగని ముద్ర వేశాడనే చెప్పొచ్చు. సందీప్ పాత్రలో అడవి శేష్ ఒదిగిపోయాడు. ఒక సైనికుడు ఎలా ఉంటాడో అలానే కనిపించాడు. సటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో అడవి శేష్ మెప్పించాడు. ఇక హీరోయిన్ సయీ మంజ్రేకర్ కూడా ఇషా పాత్రలో కొత్తగా కనిపించింది, ఆకట్టుకుంది. సందీప్ తల్లిదండ్రుల పాత్రల్లో ప్రకాష్ రాజ్, రేవతి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తాజో హోటల్ చిక్కుకున్న ఓ అమ్మాయి పాత్రలో శోభిత ధూళిపాళ కూడా ఆకట్టుకుంది. ఇక మేజర్ కి టెక్నికల్ టీమ్ చాలా ప్లస్ అయ్యింది. దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వ ప్రతిభ ఆకట్టుకుంది. కథ, స్క్రీన్ ప్లే అందించిన అడవి శేష్ రచయితగానూ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం మేజర్ సినిమాకి పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి. బ్యాగ్రౌండ్ స్కోర్ కారణంగా ఆడియన్స్ సినిమాకి మరింతగా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. సినిమాని మేకర్స్ రిచ్ గా తీశారు. ఫైనల్ గా ప్రజలకోసం ప్రాణాలర్పించిన ఓ సైనికుడుకి ఈ సినిమాతో ఘన నివాళి దక్కిందని చెప్పొచ్చు. రేటింగ్స్ తో సంబంధం లేకుండా అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా మేజర్.

– యశ్వంత్

Related Posts