పెద్ద సినిమాలను జగన్, చిన్న సినిమాలను కెసీఆర్ చంపేస్తున్నారు

పెద్ద సినిమాలను జగన్, చిన్న సినిమాలను కెసీఆర్ చంపేస్తున్నారు.. కాస్త అతిశయోక్తిలా అనిపించినా ఇదే నిజం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అసలేం జరుగుతుందో అందరికీ తెలుసు. అక్కడ టికెట్ రేట్లను దారుణంగా తగ్గించారు. దీంతో భారీ బడ్జెట్ సినిమాలకు, పెద్ద హీరోల సినిమాలకు ఆ రేట్ లు అస్సలు వర్కవుట్ కావు. ఆ కారణంగానే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన అఖండ, పుష్ప వంటి చిత్రాలు పెట్టుబడిని రాబట్టుకోవడానికి నానా తంటాలు పడ్డాయి. ముఖ్యంగా పుష్ప చిత్రానికి అక్కడ చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ రాలేదంటే అతిశయోక్తేం కాదు. ఈ రేట్లను పెంచాలని పరిశ్రమ కొన్నాళ్లుగా ఆంధ్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. ఇప్పటి వరకూ ఆ మేటర్ ఏ కొలిక్కీ రాలేదు. లేటెస్ట్ గా ఇదే అంశంపై రామ్ గోపాల్ వర్మ ప్రభుత్వంతో ట్విట్టర్ ఫైట్ మొదలుపెట్టాడు. కుదిరితే ట్వీట్ లేదంటే వీడియో పెట్టి ఓ రేంజ్ లో అక్కడి నిర్ణయాలపై నిలదీస్తున్నాడు. సో అలా జగన్ ప్రభుత్వం పెద్ద సినిమాలకు పెద్ద విలన్ గా మారింది.
ఇక ఇటు కెసీఆర్ కూడా చిన్న సినిమాల మెడపై భారీ కత్తి పెట్టాడు. అదెలా అంటారా..? తాజాగా కేసీఆర్ ప్రభుత్వం టికెట్ రేట్లను ఇష్టానికి పెంచుకోవచ్చు అంటూ జీవో ఇచ్చాడు. దీంతో మల్టీ ప్లెక్స్ ల్లో ఒక్కో టికెట్ ను 300 రూపాయలు చేశారు. ఈ రేట్ పెట్టి చిన్న సినిమాలకు ఎవరు వెళతారు. చిన్న సినిమాకు అంత ధర పెట్టడం ఎంత సినిమా పిచ్చి ప్రేక్షకుడికైనా అసాధ్యం. అంటే చిన్న సినిమాలు మల్టీప్లెక్స్ లో పూర్తిగా చనిపోతాయనే చెప్పాలి. అలాగే ఇతర ప్రాంతాల్లో ఆడతాయా అంటే కష్టం.
జిల్లా కేంద్రాల వంటి థియేటర్స్ లో కూడా 150 -200 వరకూ టికెట్ ధరలను పెంచారు. టౌన్, రూరల్ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఆ రేట్ పెట్టి సినిమా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా లేరు. ఒకవేళ పెద్ద హీరో పెద్ద సినిమాలైతేనో.. లేక ప్రమోషన్స్ తో ఓ రేంజ్ లో ఆకట్టుకున్న సినిమాలకో అయితే చెప్పలేం కానీ.. మీడియం రేంజ్ తో పాటు చిన్న సినిమాలను పట్టించుకుంటారు అనుకోలేం. ఇంకా చెబితే వాళ్లు అనుకుంటోన్న పెద్ద సినిమాలు నెలకు ఒకటి కూడా రాదు. అంటే పరిశ్రమ మనుగడ అంతా చిన్న సినిమాలపైనే ఉంది. అలాంటి చిన్న సినిమా మెడపై పెంచిన ధరలు అనే కత్తిని పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో టికెట్ రేట్లను తగ్గించకపోతే చిన్న సినిమాలు బతికిబట్టకట్టడం అసాధ్యం.
మొత్తంగా టికెట్ రేట్లను తగ్గించిన వారితో ఓ ప్రాబ్లమ్.. పెంచిన వారితో మరో ప్రాబ్లమ్ అన్నట్టుగా తయారైందీ సినిమా పరిస్థితి.

Related Posts