‘పుష్ప 2’ అనుకున్న తేదీకి వస్తోందా?

భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాల షూటింగ్స్ విషయంలో జాప్యం అనేది జరుగుతూ ఉంటుంది. ముందుగా అనుకున్న తేదీకి ఆ చిత్రాలు వస్తాయా? లేదా? అనేది విడుదల వరకూ డౌటే. ‘బాహుబలి, ఆర్.ఆర్.ఆర్, సలార్’ వంటి సినిమాల విషయంలో ఇదే జరిగింది. ముందుగా కొన్ని విడుదల తేదీలు ప్రకటించడం.. ఆ తర్వాత అవి వాయిదా పడటం మనం చూశాము. ఇప్పుడు ‘పుష్ప 2’ విషయంలోనూ ఇదే జరుగుతుందనే రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి.

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప 2’ షూటింగ్ కి ఆమధ్య బ్రేక్ పడింది. అందుకు ముఖ్య కారణం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెన్ను నొప్పితో బాధపడడమే. ఆమధ్య ఈ సినిమాకోసం ఓ జాతర ఎపిసోడ్ ను చిత్రీకరించారు. ఆ సీక్వెన్స్ లో వచ్చే సాంగ్ తో పాటు.. ఫైట్ లో వీరవిహారం చేశాడట బన్నీ. ఈనేపథ్యంలోనే.. వెన్ను నొప్పి వచ్చిందనే ప్రచారం జరిగింది. ఇక.. తన అనుకున్న అవుట్ పుట్ కోసం ఎన్ని రోజులైనా తీసుకునే సుకుమార్.. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ‘పుష్ప 2’ని ఫినిష్ చేస్తాడా? లేదా? అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. మరోవైపు.. ఈ సినిమాలో కేశవ పాత్రలో పుష్పకి ఫ్రెండ్ రోల్ లో కనిపించిన జగదీష్ అరెస్ట్ ప్రభావం కూడా ఈ సినిమా షూటింగ్ పై పడుతుందంటున్నారు. మొత్తంమీద.. ఆగస్టు 15న ఆడియన్స్ ముందుకు రావాల్సిన ‘పుష్ప 2’ అనుకున్న తేదీకి వస్తుందో? లేదో? చూడాలి.

Related Posts