హ్యాపీ బర్త్ డే నేచురల్ స్టార్ నాని

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో సత్తా చాటడం అంటే మామూలు విషయం కాదు. వారసత్వం లేకుండానూ తెలుగు చిత్ర పరిశ్రమలో సత్తా చాటుతున్న వారిలో నేచురల్ స్టార్ నాని ఒకరు. తొలి సినిమా ‘అష్టాచమ్మా’తోనే నాని విలక్షణ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘రైడ్, అలా.. మొదలైంది, పిల్ల జమిందార్’ వంటి చిత్రాలతో విజయాలందుకున్నాడు. పక్కింటబ్బాయి తరహా పాత్రలకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే నాని.. తన నటనతో నేచురల్ స్టార్ గా ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు.

పుష్కర కాలంలోనే పాతిక సినిమాల మైలురాయిని చేరుకున్నాడు నాని. 2015, 16, 17 సంవత్సరాలు నానికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్ మేన్, మజ్ను, నేను లోకల్, నిన్నుకోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి’ వంటి చిత్రాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తనతరం హీరోల్లో నానికి ఉన్న అరుదైన రికార్డు ఇది.

నానికి కొన్నిసార్లు ప్రయోగాలు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ‘పైసా, జెండా పై కపిరాజు, కృష్ణార్జున యుద్ధం, వి, టక్ జగదీష్’ వంటి చిత్రాలు నానికి నిరాశనే మిగల్చాయి. ఈ సినిమాలలో మనం సరికొత్త నానిని చూశాం. కానీ.. ఆ ప్రయోగాలు మాత్రం ఆడియన్స్ కి రుచించలేదు. ఇక.. రాజమౌళితో చేసిన ‘ఈగ‘ మినహా.. ఇప్పటివరకూ నేచురల్ స్టార్.. స్టార్ డైరెక్టర్స్ జోలికి పోలేదు. వరుసగా యంగ్ డైరెక్టర్స్ తోనే.. సూపర్ హిట్స్ అందుకుంటూ వచ్చాడు. ప్రెజెంట్ టాలీవుడ్ లోని మీడియం రేంజ్ హీరోస్ లో నాని అగ్ర స్థానంలో నిలుస్తాడు. అయితే.. అగ్ర దర్శకులతో చేయకపోవడం కూడా.. నాని ఇంకా టైర్-2 హీరోల క్యాటగిరీలో ఉండిపోవడానికి ఒక కారణంగా చెప్పొచ్చు.

సీజన్, అన్ సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ వరుస సినిమాలతో బిజీగా ఉంటాడు నాని. గతంలో హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్ అంటూ కంటిన్యూస్ హిట్స్ ఇచ్చిన నేచురల్ స్టార్ కి.. ఆమధ్య బ్యాడ్ పీరియడ్ నడిచింది. వరుసగా ఫ్లాపులు పడ్డాయి. అయితే.. ‘శ్యామ్ సింగ రాయ్‘ నుంచి మళ్లీ విజయాల బాటపట్టాడు. పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్‘లో నాని పెర్ఫామెన్స్ కి సూపర్ అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘అంటే సుందరానికి‘ చిత్రం కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది.

లాస్ట్ ఇయర్ రిలీజైన ‘దసరా‘లో సరికొత్త మేకోవర్ తో సందడి చేశాడు. ఈ సినిమాలో రస్టిక్ లుక్ తో ధరణి పాత్రలో అదరగొట్టాడు. ‘దసరా‘ తర్వాత ‘హాయ్ నాన్న‘తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ‘హాయ్ నాన్న‘ కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం డివివి ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో ‘సరిపోదా శనివారం‘ సినిమాతో రాబోతున్నాడు. ‘అంటే.. సుందరానికి‘ తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తోన్న చిత్రమిది.

Related Posts