గని మినీ రివ్యూ..

వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ హీరోలకు భిన్నమైన రూట్ లో వెళుతోన్న వరుణ్ ఇవాళ గని అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ నిర్మాతగా గనితో కొత్త ప్రయాణం మొదలుపెట్టిన సినిమా ఇది. ముందు నుంచీ ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను గని అందుకున్నాడా లేదా అనేది చూద్దాం..
గని సినిమాను కథగా చూస్తే.. గని తండ్రి ప్రొఫెషనల్ బాక్సర్. నేషనల్ లెవెల్ వరకూ వెళ్లిన తర్వాత అతను డోపీ అని తెలుస్తుంది. ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల చనిపోతాడు. దీంతో ఆ నింద గని తల్లితో పాటు అతనిపైనా పడుతుంది. అప్పటికే తనూ బాక్సింగ్ నేర్చుకుంటూ ఉంటాడు. భర్త మరణంతో కొడుకును బాక్సింగ్ వైపు వెళ్లొద్దు అని మాట తీసుకుంటుంది తల్లి. కానీ ఆమె మాటను కాదని సీక్రెట్ గా బాక్సింగ్ నేర్చుకుంటాడు గని. నేషనల్ ఛాంపియన్ కావాలనే కలతో ఉంటాడు. కాలేజ్ రేంజ్ లో గెలిచే మ్యాచ్ లో అపోనెంట్ ఆడిన ఎమోషనల్ గేమ్ లో బలై ఓడిపోతాడు. అప్పుడే తల్లికీ అతను తనకు ఇచ్చిన మాట తప్పాడని తెలుసి అతని వద్దకు వస్తుంది. ఈ మ్యాచ్ తన తండ్రి వల్లే ఓడిపోయానని చెప్పిన గని.. విజేందర్ సిన్హా అనే వ్యక్తి వచ్చి ఓ నిజం చెబుతాడు. అదేంటీ.. అసలు విజేందర్ ఎవరు..? మరి నేషనల్ చాంపియన్ అయ్యాడా లేదా అనేది మిగతా కథ.
క్రీడల నేపథ్యంలో సినిమాలు ఎంచుకుంటున్నప్పుడు ఆటతో పాటు ఎమోషన్స్ కూడా ఉండాలి. ఆ ఎమోషన్స్ మధ్య మంచి కాన్ ఫ్లిక్ట్ కూడా ఉంటే కంటెంట్ బలంగా ఉంటుంది. ఈ విషయంలో గని సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కాకపోతే కథనం సాధారణ ప్రేక్షకులు కూడా ఊహించేలా ఉండటం కొంత మైనస్ గా ఉన్నా.. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తన లక్ష్యానికి డిస్ట్రబెన్స్ అవుతుందని ప్రేమనూ పక్కన బెట్టిన గని బాక్సింగ్ రింగ్ లో ఓడిపోవడం నుంచి అతని తండ్రి ఫ్లాష్ బ్యాక్ వరకూ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ జగపతిబాబు ఎంట్రీతో కొత్త టర్న్ తీసుకుని గని ఎలా గెలవబోతున్నాడు అనే ఆసక్తిని కలిగించి థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు ఓ మంచి ఫీల్ ని అందించి సినిమా ముగుస్తుంది. ఇదంతా ఊహించేదే అయినా కథనం ఆకట్టుకుంటుంది.
గనిగా వరుణ్ తేజ్ ట్రాన్స్ ఫర్మేషన్ చూసి అందరూ సర్ ప్రైజ్ అవుతారు. ఈ పాత్ర కోసం అతనెంత కష్టపడ్డాడు అనేది ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. బాక్సర్ గా రియలిస్టిక్ గా కనిపించాడు. అతని అపోనెంట్ నవీన్ చంద్ర పాత్ర బావుంది. ఇక తండ్రిగా నటించిన ఉపేందర్, కోచ్ సునిల్ శెట్టిలు బాగా నటించారు. జగపతిబాబు పాత్రను సులువుగా ఊహించొచ్చు. అందుకు కారణం అతను ఈ మధ్య ఎంచుకునే పాత్రలన్నీ ఇలాగే ఉంటున్నాయి. గని తల్లిగా నదియా ఓకే. హీరోయిన్ సాయీ మంజ్రేకర్ యాక్టివ్ గా ఉంది. పాత్రకు తగ్గట్టుగా మంచి నటన చూపించింది. అతనికి సపోర్ట్ గా నిలిచే సందర్భంలో తన నటన బావుంది.
టెక్నికల్ గా ఈ చిత్రానికి మెయిన్ హైలెట్ తమన్ నేపథ్య సంగీతం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి. గనికి సగం బలం అతనే అంటే అతిశయోక్తి కాదు. పాటలు మాత్రం యావరేజ్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. కొత్తగా నిర్మాణంలోకి వచ్చినా.. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. కొత్త దర్శకుడ కిరణ్.. స్పోర్ట్స్ పేరుతో ఇండియాలో జరిగే అక్రమాలను ఎలివేట్ చేయాలనుకున్నాడు. కానీ ఇంకా కొత్తగా ట్రై చేసి ఉంటే బావుండేది అనిపిస్తుంది. కథ బలంగా లేకపోయినా అతని టేకింగ్ ఆకట్టుకుంటుంది. మంచి కాన్ ఫ్లిక్ట్ ను బిల్డ్ చేసి దాన్ని ఆకట్టుకునేలా చెప్పడంలో చాలా వరకూ సక్సెస్ అయ్యాడు. మొత్తంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలను ఇష్టపడే వారికి గని ఓ మంచి ఛాయిస్ అనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :
ఆకట్టుకోలేకపోయిన కథనం
బలహీనమైన కథ
ఊహించదగిన సన్నివేశాలు
తేలిపోయిన ఉపేంద్ర, సునిల్ శెట్టి ఎపిసోడ్
రొటీన్ గా జగపతిబాబు పాత్ర

ప్లస్ పాయింట్స్ :
వరుణ్ తేజ్
తమన్ నేపథ్య సంగీతం

Related Posts