డిజే టిల్లు.. రివ్యూ

డిజే టిల్లు.. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లోనూ ప్రేక్షకుల్లోనూ ఒక రకమైన ఆసక్తిని రేకెత్తిస్తోన్న చిత్రం. ప్రమోషన్స్ పరంగానూ యూత్ ను ఎక్కువగా అట్రాక్ట్ చేసింది. మొత్తంగా రిలీజ్ కు ముందే మంచి అంచనాలను పెంచిన డిజే టిల్లు.. ఇవాళ విడుదలైంది. జొన్నలగడ్డ సిద్ధు, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ మూవీ ఎలా ఉంది.. ? అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..
కొన్ని సినిమాల్లో భారీ కథలు కనిపించవు. అదిరిపోయే ట్విస్టులుండవు. అయినా ఆకట్టుకుంటాయి. అలాంటి సినిమానే డిజే టిల్లు. ఓ చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ.కానీ కథనం మాత్రం కట్టిపడేస్తుంది. ప్రతి ఫ్రేమూ కొత్తగా జోష్ గా సాగుతూ మెప్పిస్తుంది. ఆల్మోస్ట్ సినిమా అంతా నవ్వులు కురిపిస్తూనే సాగుతుంది. ఓ రకంగా ఆ మధ్య వచ్చిన జాతిరత్నాలు చిత్రాన్ని గుర్తుకు చేసినా.. దానికంటే భిన్నమైన పాయింట్ కనిపిస్తుందీ చిత్రంలో. అందుకే డిజే టిల్లుకు యూనానిమస్ గా హిట్ టాక్ వచ్చేసింది.

హైదరాబాద్ లో చిన్న చిన్న ఫంక్షన్స్ లో డిజే వాయిస్తూ.. బిందాస్ లైఫ్ గడిపే టిల్లు అనే కుర్రాడి కథ ఇది. అతని లైఫ్ లోకి అనుకోకుండా రాధిక అనే అమ్మాయి వస్తుంది. టిల్లు ఆమెను ప్రేమిస్తాడు. ఆ తర్వాత అతని లైఫ్ అంతా ఛేజింగ్ ల మయం అవుతుంది. తను చేయని ఓ హత్య కేస్ లో ఇరుక్కుంటాడు. ఓ వైపు పోలీస్, మరోవైపు చిన్నసైజ్ గూండా అతనితో పాటు రాధికను వెంటాడతారు. అలాంటి క్రమంలో రాధిక చేసిన ఓ పని వల్ల టిల్లు లైఫ్ కోమా పాలవుతుంది. మరి రాధిక ఏం చేసింది.. హత్య ఎవరు చేశారు. ఆ ఛేజింగ్ లన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది మిగతా కథనం.
ఓ సింపుల్ పాయింట్ చుట్టూ అల్లుకున్నట్టుగా కనిపించినా .. డిజే టిల్లులో ఓ లైఫ్ లెసన్ ఉంటుంది. ప్రపంచంలో ప్రతి మనిషీ స్వార్థపరుడే. ప్రేమలను కూడా స్వార్థానికి వాడేస్తుంటారు. నిజాయితీకి చోటు లేదు అని చెబుతూనే.. టిట్ ఫర్ టాట్ అనే పాత సామెతను రిపీట్ చేస్తూ సినిమాకు ఎండ్ కార్డ్ పడుతుంది. ఇదంతా అబద్ధానికి, నిజాయితీకి మధ్య జరిగే కథనంలా ఉంటుంది. నిజానికి ఇలాంటి కథలు తెలుగులో ఇంతకు ముందు రాలేదు. వచ్చినా ఈ జానర్ లో అస్సలు లేవు. ఒక్క రాత్రిలో టిల్లు లైఫ్ అంతా అతనికి గందరగోళంలా మారితే.. చూస్తున్నవారికి హిలేరియస్ గా అనిపిస్తాయి. అటు సగానికి పైగా సినిమా అంతా ప్రధాన పాత్రధారులు కేవలం ఒకే డ్రెస్ లో కనిపించడం సినిమా ఎంత రియలిస్టిక్ గా ఉందనేదానికి నిదర్శనం.
డిజే టిల్లు మంచి క్యాచీ టైటిలే కాదు. సినిమా కూడా అంతే సింపుల్ గా ఆకట్టుకుంటుంది. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా నవ్వించడమే టార్గెట్ గా వచ్చిన సినిమా ఇది. సన్నివేశాలకంటే ఎక్కువగా డైలాగ్స్ వినిపించినా అవన్నీ నవ్వించేందుకే. ముఖ్యంగా ఇది టిల్లుగా నటించిన సిద్ధు ఒన్ మేన్ షో అంటే అతిశయోక్తి కాదు. హీరోయిన్ నేహా శెట్టి తన పాత్రలో ఒదిగిపోయింది. బ్రహ్మాజీ, చిన్న విలన్ గా నటించిన ప్రిన్స్, నర్రా శ్రీను కూడా ఆకట్టుకున్నారు. ఇలాంటి కథలు అరుదుగా వస్తాయి. అలాగని బలమైన కథ కాదు. బలమైన సన్నివేశాలతో బాగా ఎంటర్టైన్ చేసిన సినిమాల్లో డిజే టిల్లు మొదటి వరుసలో ఉంటాడని చెప్పొచ్చు.
డిజే టిల్లుకు దర్శకత్వ ప్రతిభ తర్వాత చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్. అసలు ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమే నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్. దాన్ని డబుల్ చేస్తూ ప్రతి దశలోనూ మేకర్స్ కష్టపడ్డారు. అందుకే ఈ హిలేరియస్ రిజల్ట్ వచ్చింది. ఇక తెర వెనక సంగీతం హైలెట్ గా నిలిచింది. అన్ని పాటలూ బావున్నాయి. టైటిల్ సాంగ్ చాలాకాలం పాటు అన్ని దావత్ లలో వినిపిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. సిద్ధు రాసిన డైలాగ్స్ అన్నీ చాలా సహజంగా కుదిరాయి.
మరీ లాజిల్ ల జోలికి పోకుండా ఉంటే.. ఖచ్చితంగా థియేటర్స్ లో ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నంత సేపూ మరో ఆలోచన రాకుండా స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆర్టిస్టులు, తెర వెనక టెక్నీషియన్స్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ముఖ్యంగా ముందు నుంచీ మేకర్స్ చెబుతున్నట్టుగానే యూత్ కు విపరీతంగా నచ్చే అంశాలన్నీ ఉన్నాయి. అలాగని డబుల్ మీనింగ్స్, వల్గారిటీ ఏ మాత్రం లేదు. మొత్తంగా డిజే టిల్లు ఈ వీకెండ్ కే కాదు.. వీక్ డేస్ లోనూ స్ట్రాంగ్ గా నవ్వించే సత్తా ఉన్న సినిమా అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్

సిద్ధు
నేహాశెట్టి
కామెడీ
మ్యూజిక్
డైలాగ్స్
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల
కొన్ని చోట్ల లాజిక్ పూర్తిగా వదిలేయడం

ఫైనల్ గా : ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెక్క సూపర్ ఫాస్ట్ ఎంటర్టైనర్

రేటింగ్ : 3.25/5

Related Posts