‘డెవిల్’ రివ్యూ

నటీనటులు: నంద‌మూరి క‌ల్యాణ్‌ రామ్, సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, మాళవిక నాయర్, సత్య, అజయ్ తదితరులు
సినిమాటోగ్రఫి: సౌందర్ రాజన్.ఎస్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
నిర్మాత: అభిషేక్‌ నామా
దర్శకత్వం: అభిషేక్‌ నామా
విడుదల తేదీ: డిసెంబర్ 29, 2023

కథల ఎంపికలో విలక్షణతను చూపించే కళ్యాణ్ రామ్.. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా నటించిన చిత్రం ‘డెవిల్’. హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘డెవిల్’ ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ
సినిమా కథంతా 1940ల నేపథ్యంలో సాగుతోంది. డెవిల్ (కళ్యాణ్ రామ్‌) ఒక బ్రిటీష్ గూఢచారి. రాసపాడు అనే ఊళ్లో జరిగిన ఒక జమిందారి కూతురి హత్య కేసుని పరిశోధించదానికి వస్తాడు. ఆ హత్య జరిగిన బంగ్లాలో ఉంటున్న నైషధ (సంయుక్త మీనన్) ఎవరు ?, ఆమెను డెవిల్ ఎందుకు టార్గెట్ చేశాడు ? అసలు ఈ హత్యకి.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కథకి సంబంధం ఏంటి? వంటి అంశాల నేపథ్యంలో రియాలిటీతో సాగే ఫిక్షనల్ డ్రామా ‘డెవిల్’.

విశ్లేషణ
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇతివృత్తంతో చాలా కథలొచ్చాయి. ఆయన కథను ప్రేరణగా తీసుకుని ఎన్నో కథలు, సినిమాలు రూపొందాయి. అలాంటి కథే ‘డెవిల్’. అయితే.. ఈ కథను దేశభక్తి, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో తెరకెక్కించారు. సుభాష్‌ చంద్రబోస్‌ పాయింట్‌ తో కథను చాలా ఆసక్తికరంగా ప్రారంభించారు. ఆ తర్వాత కథంతా జమీందారు కూతురు హత్య చుట్టూ తిరుగుతుంది. అయితే సుభాష్ చంద్రబోస్ కథకు ఇది ఉపకథ మాత్రమే. ఈ హత్య కేసు నుంచి మళ్లీ సుభాష్ చంద్రబోస్ స్టోరీకి వెళ్లి ప్రేక్షకుల్ని దేశభక్తి కోణంలోకి తీసుకెళతాడు దర్శకుడు.

విరామం వరకూ మర్డర్ మిస్టరీతో నడిచిన ‘డెవిల్’ తర్వాత బ్రిటిష్ గూఢచర్యం, ఇండియన్ నేషనల్ ఆర్మీ నేపథ్యంలో సాగుతోంది. మర్డర్ మిస్టరీని చేధించే క్రమంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమాయణం కథను పక్కదోవ పట్టించేదిగా సాగుతుంది. ఇంటర్వెల్‌ ముందు వచ్చే యాక్షన్‌ సీన్‌ బాగుంది. అలాగే అక్కడ ట్విస్ట్‌ రివీల్‌ చేసి ద్వితియార్థంపై ఆసక్తి కలిగించేలా చేశారు. సెకండాఫ్‌ లో ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి.

నటీనట, సాంకేతిక వర్గం

‘డెవిల్’ పాత్రలో కళ్యాణ్ రామ్ న‌ట‌న‌, మేకోవర్ కొత్తగా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాల్లో అతని కష్టం కనిపిస్తుంది. సంయుక్త, మాళ‌విక నాయ‌ర్ ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లో నటించారు. వారి పాత్ర‌లు దేశ‌భ‌క్తి కోణంతో ముడిప‌డి ఉండటంతో సినిమాపై ప్రభావం చూపించాయి. షఫి, సత్య, అజయ్, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ వారి పాత్రలకు న్యాయం చేసారు.

నిర్మాతగా ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని రూపొందించారు అభిషేక్ నామా. అయితే.. దర్శకుడిగా కథనం విషయంలో ఇంకాస్త కసరత్తు చేసుంటే బాగుండేది. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల మెప్పిస్తుంది. సౌందర్ రాజన్ విజుల్స్ మనల్ని బ్రిటీష్ ఇండియా కాలానికి తీసుకెళతాయి. మొత్తంగా.. నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’గా మెప్పించాడు.

Related Posts