ఆ ఇద్దరితో చిరంజీవికి సెట్ అవ్వలేదు.. కానీ చరణ్ సాధించాడు!

సందేశాత్మక కథాంశాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడు శంకర్. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే శంకర్‌ తో సినిమా చేయాలనేది చిరంజీవి చిరకాల కోరిక. శంకర్ తొలి చిత్రం ‘జెంటిల్‌మేన్’ని.. చిరంజీవి హిందీలో ‘ది జెంటిల్‌మేన్’ పేరుతో రీమేక్ చేశాడు. కానీ.. శంకర్ తో సినిమా చేయాలన్న చిరు కోరిక మాత్రం నెరవేరలేదు. అయితే.. ఇప్పుడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కి ఆ అవకాశం లభించింది. శంకర్ – చరణ్ కలయికలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా రూపొందుతోంది. ఈ ఏడాది ద్వితియార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

శంకర్ తో పాటు చిరంజీవి పనిచేయాలనుకున్న మరో టెక్నీషియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్. 80లలో చిరంజీవి నటించిన పలు చిత్రాలకు రాజ్-కోటి వద్ద అసిస్టెంట్ గా పనిచేశాడు రెహమాన్. అయితే.. మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం చేయలేదు. చిరంజీవి బయోగ్రాఫికల్ డ్రామా ‘సైరా’ కోసం తొలుత రెహమాన్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. కానీ.. అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు రెహమాన్ తో పనిచేసే అవకాశం రామ్ చరణ్ కి దక్కింది. చరణ్-బుచ్చిబాబు కాంబో మూవీకి రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అలాగే.. మెగా కాంపౌండ్ లో పవన్ కళ్యాణ్ తోనూ రెహమాన్ కి పనిచేసిన అనుభవం ఉంది. పవర్ స్టార్ ‘కొమరం పులి’కి రెహమాన్ సంగీతాన్ని సమకూర్చాడు.

Related Posts